Madhu Yaskhi Slams CM KCR over Paddy Procurement issue: తెలంగాణలో ప్రస్తుతం టీఆర్ఎస్ ప్రభుత్వం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య రైతులు పండించిన ధాన్యం కొనుగోలు చేయడం. అయితే అన్నదాతల సమస్యలకు కారకుడు సీఎం కేసీఆర్ అని కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్ ఆరోపించారు. వరి వేయండి అని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్ర శేఖర్ రావు అసెంబ్లీ సాక్షిగా చెప్పారని.. ప్రతి గింజా కొంటానని శాసనసభలో చెప్పి ఇప్పుడు డ్రామాలు ఆడుతున్నారంటూ మండిపడ్డారు. వరి ధాన్యం టీఆర్ఎస్ ప్రభుత్వం కొనుగోలు చేయకపోతే కాంగ్రెస్ చూస్తూ ఊరుకోదు.


తెలంగాణ కేబినెట్ లో నిర్ణయం తీసుకోకపోతే టీఆర్ఎస్  నాయకులు ఎక్కడ తిరగకుండా చేస్తామని, అడుగడుగునా అడ్డుకుంటామని హెచ్చరించారు. రైతులకు లేని సమస్యలు సృష్టించి, తానే పరిష్కారం చేసినట్లు నటిస్తున్నారని విమర్శించారు. సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ నేతలు మిల్లర్లతో కుమ్మక్కై రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని చెప్పారు. వంద లక్షల టన్నులు ధాన్యం అవసరం అని చెప్పిన కేసీఆర్ఇప్పుడు దీక్షల పేరుతో డ్రామాలు చేస్తున్నారు, దరిద్రపు మాటలతో రైతులను ఇంకా మోసం చేయవద్దని సీఎం కేసీఆర్‌కు సూచించారు.  


సిగ్గు శరం లేకుండా మాట్లాడుతున్నారు..
సిద్దిపేట జిల్లా దౌల్తబాద్ మండలం సోరంపల్లి గ్రామంలో బొల్లం అశోక్ అనే రైతు అత్మహత్య చేసుకున్నాడని, కేసీఆర్ ప్రకటనల వల్లే రైతుల ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయని చెపారు. ఖమ్మం రైతులు సూర్యాపేట వెళ్తే బ్రోకర్ లు తక్కువ ధరకు కొంటున్నారు. మీ అధికారులు, నాయకులు చేస్తున్నారు. సీఎంగా ఉండి కూడా ఏం చేయలేని నేత కేసీఆర్ ఎద్దేవా చేశారు. కేంద్రం నూకలు, ధాన్యం కొనను అని చెప్పింది, కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేయకుండా మీరు కూడా సిగ్గు శరం లేకుండా మాట్లాడుతున్నారంటూ మధుయాష్కీ గౌడ్ ధ్వజమెత్తారు.


కేబినెట్‌లో తీర్మానం చేయండి..
తాజా కేబినెట్ భేటీలో ప్రతీ గింజా కొంటాం అని తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. వరి ధాన్యం కొనుగోలులో అక్రమాలపై కేంద్ర హోం శాఖకు ఫిర్యాదు చేస్తాం. సీబీఐ విచారణ జరపాలని ఫిర్యాదు చేస్తామని.. ఒకవేళ కేంద్రం స్పందించక పోతే కోర్టుకు వెళ్తామన్నారు. రైస్ మిల్లర్ల యజమానులు లక్షలు పెట్టీ మరీ కేసీఆర్ కుటుంబం సభ్యులకు పేపర్ లో యాడ్స్ ఇస్తున్నారని పేర్కొన్నారు. తాను ప్రధాని కావాలన్న కల కోసం సీఎం కేసీఆర్ ఢిల్లీలో దీక్ష చేశారని ఆరోపించారు.


Also Read: Telangana Cabinet: కేబినెట్‌ సమావేశం తర్వాత కేసీఆర్ కీలక ప్రకటన! బీజేపీని దోషిగా నిలబెట్టేందుకు భారీ స్కెచ్! 


కేంద్రం తమ రాష్ట్రం రైతులు పండించిన ధాన్యం మొత్తం కొనుగోలు చేయాలని సీఎం కేసీఆర్ ఢిల్లీలో ధర్నా సైతం చేశారు. రైతు ఉద్యమ నేత రాకేష్ టికాయత్ ఈ దీక్షలో పాల్గొని కేసీఆర్‌కు నైతిక మద్దతు తెలిపారు. కేంద్రం రైతుల కోసం కొత్త వ్యవసాయ చట్టాలు తీసుకురావాలని, లేకపోతే దేశంలో అతిపెద్ద రైతు ఉద్యమం మొదలయ్యే అవకాశం ఉందని కేంద్రానికి సంకేతాలు పంపారు కేసీఆర్. వరి వేయాలని రైతులను ప్రోత్సహించింది కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీయేనని ఢిల్లీ దీక్షలో మాట్లాడుతూ కేసీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రైతులను తప్పుదోవ పట్టించి, వారిని అన్యాయం చేసింది మాత్రం బీజేపీ నేతలేనని ఆరోపించారు.