ఈ దేశంలో అత్యంత పేద పార్టీ కాంగ్రెస్ పార్టీ అని..ప్రస్తుతం ఏ రకమైన ఆర్థిక సంక్షోభం ఎదుర్కుంటున్నామో అర్థం చేసుకోవాలని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. ఇప్పుడు రాజకీయ పార్టీలను దాటి.. ఏజెన్సీలు వచ్చాయని, ఈ రకం ఏజెన్సీలను నియమించుకోవడం చాలా ఖర్చుతో కూడుకున్నదని రేవంత్ రెడ్డి అన్నారు. గురువారం (జూలై 6) ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్‌, బీజేపీలు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేందుకు సిద్దమయ్యాయని అన్నారు. బీజేపీ, బీఆర్ఎస్‌లను మనం జన బలంతో కొట్టాలని రేవంత్ రెడ్డి అన్నారు. 


పెండింగ్‌లో ఉన్న మూడు జిల్లా కమిటీలను రెండు రోజుల్లో ప్రకటిస్తామని చెప్పారు. జులై 25లోగా గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అన్ని కమిటీలు పూర్తి చేస్తామని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులను అధికార పార్టీ తమ పార్టీకి అనుకూలంగా పని చేయించుకుంటోందని చెప్పారు. ఇది ఒక రకంగా అధికార దుర్వినియోగం లాంటిదని అన్నారు. గ్రామ స్థాయిలోనే కాంగ్రెస్ అనుకూల, వ్యతిరేక ఓట్లను గుర్తించాలని చెప్పారు. గతంలో గ్రామ పెద్ద ఏపార్టీకి లేదా గుర్తుకు ఓటు వేయమని చెబితే ఆ గుర్తుకు గ్రామ ప్రజలు ఓటు వేసేవారని, కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదని అన్నారు. 


ఎన్నికల్లో వచ్చిన మార్పులు, సాంకేతికతను బీజేపీ, బీఆర్ఎస్ లు తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తున్నాయని అన్నారు. దీన్ని కాంగ్రెస్ అధిగమించాలని చెప్పారు. ఆగస్టు 18న హైదరాబాద్ మండల అధ్యక్షులకు ట్రైనింగ్ కార్యక్రమం ఉంటుందని రేవంత్ రెడ్డి వెల్లడించారు.


ధరణి పోర్టల్ పైనా విమర్శలు


ధరణి పోర్టల్‌లో జరుగుతున్న అక్రమాలను గురించి రేవంత్ రెడ్డి వివరించారు. ధరణి పేరుతో కేసీఆర్‌ కుటుంబం దోచుకుంటోందని, రాత్రిపూట ధరణి రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయని అన్నారు. ధరణి దోపిడీలో శ్రీధర్‌రాజు కీలక పాత్ర పోషిస్తున్నారని ఆరోపించారు. ప్రజల ఆస్తులు వివరాలు విదేశీ సంస్థలకు చేరుతున్నాయని.. మంత్రి గంగుల కమలాకర్ కు కూడా ప్రభుత్వ భూములు కేటాయించారని ఆరోపించారు. త్వరలోనే తాను ధరణి పోర్టల్‌ ఫెయిల్యూర్ పై పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇస్తానని చెప్పారు. ధరణిలో జరిగిన అక్రమాలను జులై 15 తర్వాత బయటపెడతామని అన్నారు.


విదేశీయుల చేతికి డేటా


కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ధరణిని రద్దు చేసి అంతకంటే మెరుగైన పోర్టల్‌ను తీసుకొస్తామని హామీ ఇచ్చారు. కేసీఆర్‌ భూ అక్రమాలను కూడా బయటపెడతామని అన్నారు. ధరణి పోర్టల్‌ నిర్వహిస్తున్న సంస్థలో పెట్టుబడి పెట్టిన వారు ఆర్థిక నేరగాళ్లు. ధరణి పోర్టల్‌ను నిర్వహిస్తున్న వారిలో విదేశీయులు ఉన్నారని, ఈ పోర్టల్‌ ద్వారా మన డీటైల్స్ అన్నీ విదేశీయుల చేతుల్లోకి  వెళ్తున్నాయని అన్నారు. అనేక చేతులు మారి చివరకు.. ధరణి పోర్టల్‌ బ్రిటిష్‌ ఐల్యాండ్‌ చేతికి వెళ్లిందని అన్నారు. ధరణిలోని లోటుపాట్లను ఆసరాగా తీసుకొని నిషేధిత జాబితాలోని భూములను అనుచరులకు రిజిస్ట్రేషన్‌ చేసుకుంటున్నాని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వ భూములను అనుచరులకు రిజిస్ట్రేషన్‌ చేసి వెంటనే ప్రొహిబిషన్‌ లాక్‌ చేస్తున్నారని, ధరణి పోర్టల్‌ మొత్తం కేటీఆర్‌ మిత్రుడు శ్రీధర్ గాదె చేతిలో ఉందని అన్నారు. దేవాదాయ భూములను అక్రమంగా ఫార్మా కంపెనీలకు కట్టబెట్టాలని చూశారని రేవంత్ రెడ్డి ఆరోపించారు.