Comprehensive Family Survey In Telangana: తెలంగాణలో సమగ్ర సర్వే ప్రారంభమైంది. హైదరాబాద్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ సర్వేను ప్రారంభించారు. వివిధ జిల్లాల్లో మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు ఈ ప్రక్రియను ప్రారంభించారు. అనంతరం ప్రభుత్వ ఉద్యోగులు ఇంటింటికీ వెళ్లి వివరాలు సేకరిస్తున్నారు. 


ఇంట్లో ఉన్న సభ్యుల వివరాలు, ఆర్థిక, సామాజిక స్థితిగతులు, ఉద్యోగ, రాజకీయ నేపథ్యంపై కూడా ప్రశ్నలు ఉన్నాయి. ఒక ఫ్యామిలీకి సంబంధించిన అన్ని రకాల వివరాలు తెలుసుకునేలా ఈ సర్వే ప్రశ్నావళిని రూపొందించారు. మొత్తం 75 ప్రశ్నలతో ఈ సర్వే కొనసాగుతోంది. పూర్తి వివరాలు సేకరించిన తర్వాత యజమాని సంతకం అధికారుల సంతకం తీసుకుంటారు. 


సర్వేలో ప్రభుత్వం ఉద్యోగం చేస్తున్న వారి వివరాలు, రాజకీయాల్లో ఉన్నట్టు అయితే వారి వివరాలు, పదవుల్లో ఉంటే ఆ పదవుల వివరాలు కూడా చెప్పాల్సి ఉంటుంది. గతంలో పథకాలు లబ్ధి పొంది ఉంటే వాటి వివరాలు అడుగుతారు. మీ ఫ్యామిలీ మెంబర్స్‌లో ఎవరైనా విదేశాల్లో ఉంటే ఆ వివరాలు కూడా చెప్పాలి. ఒక్కో దేశానికి ఒక్కొక్క కోడ్ ఉంది. దాని ప్రకారం ఏ ప్రాంతం వాళ్లు ఏ దేశంలో ఉంటున్నారు. అందులో గల్ఫ్‌లో ఉంటున్న వారు ఎంత మంది అనే వివరాలు తెలియబోతున్నాయి. 


సర్వేలో కులమతాలకు సంబంధించిన వివరాలు సేకరించడంపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు ఫామ్‌లలో కులం, మతం వివరాలు వెల్లడించడానికి ఇష్ట పడని వారి కోసం ప్రత్యేక కాలమ్ ఏర్పాటు చేయమని ఆదేశించింది. రాజ్యాంగంలోని అధికరణ 25(1) ప్రకారం పౌరులకు స్వేచ్చ ఉందని అందుకే ఈ విషయాన్ని పరిశీలించాలని పేర్కొంది. దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకున్నారో చెప్పాలని కోర్టు ఆదేశించింది. 


ఇవాళ్టి నుంచి ప్రారంభమైన సర్వే ఈనెల 30 వరకు కొనసాగనుంది. ఎన్యూమరేటర్లు ఇంటింటికీ వెళ్లి కుటుంబాల వివరాలు సేకరిస్తారు. ప్రతి 150 ఇళ్లకు ఒక ఎన్యూమరేటర్‌ను నియమించారు. పది మంది ఎన్యూమరేటర్లకు ఒక సూపర్‌వైజర్‌ ఉంటారు. ఎన్యూమరేటర్లకు 10 వేల రూపాయల పారితోషికం, సూపర్‌వైజర్లకు 12 వేల రూపాయల పారితోషం ఇస్తారు. ఎన్యూమరేటర్లకు మహాళా సంఘాలు, టీచర్లు, ఇతర విభాగాల సిబ్బంది సహాయం చేస్తారు. 


సర్వే ఫామ్‌ 3 విభాగాలుగా ఉంటుంది. సర్వే చేస్తున్నప్రాంతం వివరాలు మొదట ఫిల్ చేయాలి. జిల్లా కోడ్, మండలం కోడ్‌, ఇంటి నెంబర్‌ ఎంటర్ చేయాలి. జిల్లా పేరు, మండలం పేరు, పంచాయతీ లేదా మున్సిపాలిటీ పేరు, హాబిటేషన్ పేరు, వార్డ్ నెంబర్, ఇంటి నెంబర్ వీధి పేరు దానికి కేటాయించిన కోడ్ నమోదు ఎంటర్ చేస్తున్నారు అక్కడే కుటుంబానికి ఇచ్చే ఓ సీరియల్ నెంబర్ ఎంటర్ చేస్తున్నారు. 


తర్వాత పార్ట్ 1లో కుటుంబానికి సంబంధించిన వివరాలు రాస్తున్నారు. కుటుంబ యజమానికి ఉన్న సంబంధం, వారి కేటగిరి ఏంటో చెప్పాలి. మతం, సామాజిక వర్గం, కులం చెప్పాలి. వయసు, మాతృభాష ఎంటర్ చేస్తున్నారు. ఆధార్‌ కార్డు వివరాలు ఇవ్వడం ఐచ్చికం చేశారు. అంటే ఇష్టం ఉంటే ఇవ్వాలి లేకుంటే ఇవ్వబోమని చెప్పారు. మొబైల్ నెంబర్‌, పెళ్లి అయిందో లేదో కూడా చెప్పాలి. దివ్యాంగులైతే ఆ వివరాలు అందించాలి. విద్యార్హతలు కూడా చెప్పాలి. 


తర్వాత పేజ్‌లో ఉపాధి, ఉద్యోగం వివరాలు చెప్పాలి. రియల్ ఎస్టేట్ చేస్తున్నారా ఉద్యోగం చేస్తున్నార లేకుండా వ్యాపారం చేస్తున్నారో వివరించాలి. టర్నోవర్‌ గురించి చెప్పాలి. ఆదాయపు పన్ను చెల్లిస్తున్నారో లేదో తెలపాలి. తర్వాత భూముల వివరాలు అందజేయాలి. 


మీరు భూమి కలిగి ఉన్నారా?
ధరణి పాస్ బుక్ ఉంటే నెంబర్ రాయండి ?
భూమి ఏ రూపంలో ఉందో చెప్పాలి అంటే... పట్టా స్థలమా, అసైన్డ్‌ స్థలమా, అటవీ హక్కు భూమో చెప్పాలి. 
భూమి ఏ రకమో వివరించాలి
భూమికి నీటి పారుదర సౌకర్యం ఎలా కల్పిస్తున్నారో తెలియజేయాలి
కౌలు భూమి సాగు చేస్తున్నట్టైతే ఎంత విస్తీర్ణమో చెప్పాలి. 
రిజర్వేషన్ కేటగిరిలోకి వివరాలు సమర్పించాలి:- 
రిజర్వేషన్ విధానం నుంచి పొందిన విద్యా ప్రయోజనాలు ఏంటీ
రిజర్వేషన్ విధానం నుంచి పొందిన ఉద్యోగ ప్రయోజనాలు ఏంటీ
గత ఐదేళ్లుగా మీరు లబ్ధి పొందిన మూడు ప్రభుత్వ పథకాల పేర్లు 
రిజర్వేషన్ కేటగిరికి చెందిన వారు అయితే సర్టిఫికేట్ తీసుకున్నారా అవునో కాదో చెప్పాలి 
మీరు డీనోటిఫై చేసిన సంచార లేదా పాక్షిక సంచార తెగకు చెందినవారా


వీటితోపాటు రాజకీయ వివరాలు తీసుకుంటున్నారు. ఏ పార్టీలో సభ్యత్వం ఉంది...ఏ పదవుల్లో ఉన్నారు ఎప్పటి నుంచి పని చేస్తున్నారో తెలియజేయాలి. వలస వచ్చిన వాళ్లు అయితే ఎక్కడి నుంచి వలస వచ్చారో కూడా చెప్పాలి.