Revanth Reddy Unveils Telangana Talli Statue at Secretariat | హైదరాబాద్: తెలంగాణ తల్లి విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. రాష్ట్ర సచివాలయం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని మంత్రులు, నేతలు, ప్రజల సమక్షంలో రేవంత్ ఆవిష్కరించారు. అనంతరం పూలు చల్లి తెలంగాణ తల్లికి నమస్కరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, శాసనసభ స్పీకర్, శాసనమండలి ఛైర్మన్లు, మంత్రులు సీతక్క, కొండా సురేఖ, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్ బాబు, దామోదర రాజనర్సింహ, తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర గీతం ’జయజయహే తెలంగాణ’ ప్రదర్శించారు. ఒక జాతి వ్యక్తిత్వానికి, జాతి అస్తిత్వానికి, సాంస్కృతిక చిహ్నంగా ఉన్న తెలంగాణ తల్లి విగ్రహాన్ని సీఎం రేవంత్ ఆవిష్కరించారు. ఇది ఎంతో ప్రాముఖ్యత ఉన్న విగ్రహమని ప్రభుత్వం చెబుతోంది. ప్రజాకవి, ప్రకృతి కవి అందెశ్రీ రాష్ట్ర గీతం జయ జయహే తెలంగాణ గీతం రచించారని తెలిసిందే. రాష్ట్ర గీతం రచించిన అందెశ్రీని తెలంగాణ ప్రభుత్వం శాలువా కప్పి సన్మానించింది.
అందెశ్రీ మాట్లాడుతూ.. నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల గుండె చప్పుడు జయజయహే తెలంగాణ జననీ జయకేతనం.. ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చైతనం అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక తెలంగాణ గేయంలో స్వల్ప మార్పులు చేశారు.
పల్లవి:
జయ జయహే తెలంగాణ జననీ జయకేతనం
ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం
తరతరాల చరిత గల తల్లీ నీరాజనం
పదపదాన నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం
జై తెలంగాణ జైజై తెలంగాణ
జై తెలంగాణ జైజై తెలంగాణ
చరణం:(1)
జానపద జనజీవన జావళీలు జాలువార
కవిగాయక వైతాళిక కళలా మంజీరాలు
జాతిని జాగృత పరచే గీతాల జనజాతర
అనునిత్యము నీగానం అమ్మనీవే మా ప్రాణం
జై తెలంగాణ జైజై తెలంగాణ
జై తెలంగాణ జైజై తెలంగాణ
చరణం:(2)
గోదావరి కృష్ణమ్మలు తల్లీ నిన్ను తడుపంగా
పచ్చని మా నేలల్లో పసిడిసిరులు పండంగా
సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలి
ప్రతిదినమది తెలంగాణ ప్రజల కలలు పండాలి
జై తెలంగాణ జైజై తెలంగాణ
జై తెలంగాణ జైజై తెలంగాణ
విగ్రహం రూపర్త, శిల్పిలను సత్కరించిన తెలంగాణ ప్రభుత్వం
తెలంగాణ తల్లి విగ్రహం రూపకర్త ప్రొఫెసర్ గంగాధర్. ఆయన జవహర్ లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ ప్రిన్సిపాల్ ను తెలంగాణ ప్రభుత్వం సన్మానించింది. తెలంగాణ తల్లి విగ్రహం రూపొందించిన శిల్పి రమణా రెడ్డిని సీఎం రేవంత్ రెడ్డి సన్మానించారు. రమణారెడ్డి ఎంఏ ఫైన్ ఆర్ట్స్‌లో గోల్డ్ మెడలిస్ట్. భారత ప్రభుత్వం తరఫున పలు దేశాల్లో పర్యటించిన తన కళను ఇతర దేశాలకు పరిచయం చేశారు.
తెలంగాణ చరిత్రలో గుర్తుండిపోయే రోజు నేడు