Telangana Assembly Sessions | హైదరాబాద్: తెలంగాణ శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీజేపీ, బీఆర్ఎస్ సభ్యులు లక్ష్యంగా తీవ్ర విమర్శలు గుప్పించారు. సభలో కేవలం సూచనలు ఇచ్చి పారిపోవడం బీజేపీ సభ్యులకు అలవాటుగా మారిందని ఆయన ఎద్దేవా చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై విచారణను ఇప్పటికే సిబిఐకి అప్పగించామని గుర్తు చేసిన సీఎం రేవంత్ రెడ్డి.. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావులపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు.

హరీష్ రావు బంధువులు భూ దోపిడీ చేశారు..

గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ధరణి పోర్టల్‌ను అడ్డుపెట్టుకుని మాజీ మంత్రి హరీష్ రావు బంధువులు భూ దోపిడీకి పాల్పడ్డారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఈ అక్రమాలపై నిగ్గు తేల్చేందుకు హౌస్‌ కమిటీ వేయడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి కాళేశ్వరం ఏటీఎంగా మారిందని గతంలో బీజేపీ నేతలు ఆరోపించారు.. సిబిఐకి ఇస్తే 48 గంటల్లో విచారణ పూర్తి చేస్తామని చెప్పారు. అందుకే కాళేశ్వరంపై అవినీతి, కేసు ఫైల్‌ను సిబిఐకి ఇచ్చినా ఇంకా ఎందుకు చర్యలు తీసుకోలేదు అని అసెంబ్లీ సాక్షిగా ప్రశ్నించారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డితో మాట్లాడి విచారణ జరిపించే ధైర్యం బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డికి ఉందా అని సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు.

మరోవైపు, సభలో బీఆర్‌ఎస్‌ సభ్యులు రాఘవ కన్‌స్ట్రక్షన్స్ వ్యవహారంపై ఆందోళనకు దిగారు. ఈ వ్యవహారంపై కూడా సభా సంఘం వేయాలని డిమాండ్ చేస్తూ స్పీకర్ పోడియం వద్ద నిరసన తెలిపారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని వెంటనే బర్తరఫ్ చేయాలని నినాదాలు చేయడంతో సభలో గందరగోళం నెలకొంది.

అంతకుముందు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నిరసనరాఘవ కన్‌స్ట్రక్షన్స్ వ్యవహారంపై తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి. ఈ సంస్థ అక్రమాలపై సభా సంఘం వేయాలని డిమాండ్ చేస్తూ భారత రాష్ట్ర సమితి (BRS) ఎమ్మెల్యేలు గళమెత్తారు. బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు నేతృత్వంలో ఎమ్మెల్యేలు నగరంలోని గన్‌పార్క్‌ వద్ద నిరసన చేపట్టారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ అసెంబ్లీకి కాలినడకన వచ్చారు. 

ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, రాఘవ కన్‌స్ట్రక్షన్స్ సాగించిన అక్రమాలను తాము ఆధారాలతో సహా బయటపెట్టామన్నారు. అక్రమ మైనింగ్‌కు పాల్పడిన ఇతర సంస్థలపై కఠిన చర్యలు తీసుకున్న ప్రభుత్వం, రాఘవ కన్‌స్ట్రక్షన్స్‌పై ఎందుకు మౌనంగా ఉందో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తప్పు చేయకపోతే విచారణకు భయమెందుకు? అని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కేవలం సభా సంఘమే కాకుండా, మంత్రులపై వస్తున్న అవినీతి ఆరోపణలపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని బీఆర్‌ఎస్ నేతలు డిమాండ్ చేశారు.