Revanth Reddy vs Amit Shah: తెలంగాణ గడ్డపై విద్వేష రాజకీయాలకు తావులేదని, శాంతి భద్రతల పరిరక్షణే తమ ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. జమియర్ ఉలమా యే హింద్‌ సంస్థ నిర్వహించిన భారీ బహిరంగ సభలో పాల్గొన్న ఆయన, రాష్ట్ర భవిష్యత్తు, మైనారిటీల హక్కులకు సంబంధించిన పలు కీలక ప్రకటనలు చేశారు. ముఖ్యంగా సమాజంలో చిచ్చు పెట్టే విద్వేష ప్రసంగాలను నియంత్రించేందుకు వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో కఠినమైన చట్టాన్ని తీసుకురాబోతున్నట్టు వెల్లడించి సంచలనం సృష్టించారు. 

Continues below advertisement

భారత్‌ స్వాతంత్య్ర పోరాటంలో జమియత్ ఉలమా సంస్థ పోషించిన పాత్రను సీఎం రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా కొనియాడారు. దేశ విముక్తి కోసం కాంగ్రెస్ పార్టీతో భుజం భుజం కలిపి పోరాడిన చరిత్ర ఈ సంస్థకు ఉందని ఆయన గుర్తు చేశారు. దేశంలో మెజారిటీ, మైనారిటీ ప్రజలు సోదరభావంతో కలిసి ముందుకు సాగడానికి జమీయత్ నిరంతర కృషి చేస్తోందని అభినందించారు. తన వ్యక్తిగత రాజకీయ ఎదుగుదలలో కూడా ఈ సంస్థ పాత్రను ఆయన స్మరించుకున్నారు. మల్కాజిగిరి లోక్‌సభ ఎన్నికల్లో తాను పోటీ చేసినప్పుడు  హిందువులతోపాటు ముస్లింలు తనను ఆశీర్వదించి గెలిపించారని, తాను గల్లీ నుంచి ఢిల్లీకి వెళ్లి రాహుల్ గాంధీకి తోడుగా మోదీ, అమిత్‌ షాపై పోరాడటానికి ఆనాటి సహకారమే పునాది అని ఆయన పేర్కొన్నారు. 

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కావడంలో మైనారిటీల అండదండలు మరువలేనివని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. నిజాం పాలనపై షోయబుల్లా ఖాన్ వంటి నేతలు చేసిన పోరాటాలను ఆయన గుర్తు చేస్తూ, కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ మైనారిటీ నేతలకు సముచిత స్థానం కల్పిస్తోందని చెప్పారు. జాతీయ స్థాయి సల్మాన్ ఖుర్షిద్, అహ్మద్‌ పటేల్ వంటి నేతలు అగ్రశ్రేణి నాయకులుగా ఎదిగారని, రాష్ట్రంలో కూడా అజారుద్దీన్, షబీర్ అలీ వంటి వారికి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఇచ్చామని వివరించారు. అజారుద్దీన్ ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ, ఆయనపై నమ్మకంతో ఎంఎల్‌సీగా అవకాశం ఇచ్చి, మంత్రిని చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఇప్పటికే 8 కార్పొరేషన్ల బాధ్యతలను మైనారిటీ నేతలకే అప్పగించామని, పార్టీ టికెట్లు ఇచ్చినప్పుడు అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన బాధ్యత సమాజంపై ఉందని ఆయన పిలుపునిచ్చారు. ముఖ్యంగా రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో మైనారిటీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాలని కోరారు. 

Continues below advertisement

రాష్ట్ర అభివృద్ధికి శాంతిభద్రతలు అత్యంత కీలకమని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. విద్వేష ప్రసంగాల వల్ల సమాజంలో అశాంతి నెలకొంటుందని, దీనిని అరికట్టడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. విద్వేష ప్రసంగాల నియంత్రణ కోసం వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో చట్టం తీసుకురాబోతున్నామని, దేశం అభివృద్ధి చెందాలంటే అంతా కలిసిమెలిసి ముందుగా సాగాలి అని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రానికి పెట్టుబడులు రావాలన్నా, యువతకు ఉద్యోగ అవకాశాలు పెరగాలన్నా శాంతియుత వాతావరణం అవసరమని ఆయన గుర్తు చేశారు. ఏ ఒక్కరి వల్ల దేశం అభివృద్ధి చెందదని అందరి భాగస్వామ్యం ఉండాలని ఆయన ఆకాంక్షించారు. 

మైనారిటీలకు కల్పించిన 5 శాతం రిజర్వేషన్ల అంశంపై సీఎం రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు. మైనారిటీల రిజర్వేషన్లు రద్దు చేస్తామంటూ కేంద్రమంత్రి అమిత్‌ షా చేస్తున్న వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామంటూ అమిత్‌ షాకు దమ్ముంటే ఆ మాట చెప్పి తెలంగాణలో గెలిచి చూపించండి అని ఆయన బహిరంగ సవాల్ చేశారు. ఒక పార్టీ తన ఓట్లను అవయవ దానం చేయడం వల్ల బీజేపీ ఓట్ల శాతం పెరిగి ఉండవచ్చని అంత మాత్రాన తెలంగాణ కాంగ్రెస్ ప్రభావాన్ని తగ్గించలేరని ఆయన వ్యాఖ్యానించారు. 

ప్రస్తుతం ఈ రిజర్వేషన్లు కేసు సుప్రీం కోర్టులో ఉందని తమ  ప్రభుత్వం దీనిపై అత్యంత పకడ్బందీగా వ్యవహరిస్తోందని ఆయన వెల్లడించారు. రాష్ట్రంలో నిర్వహించిన కుల గణనలో మైనారిటీల జనాభాను కూడా శాస్త్రీయంగా లెక్కించామని, ఈ గణాంకాలను సుప్రీంకోర్టుకు సమర్పించిన నాలుగు శాతం రిజర్వేషన్ల వల్ల ఇప్పటికే వేలాది మందికి ఉద్యోగాలు వచ్చాయని, మైనారిటీలు విద్యావంతులు కావాలని ఆయన కోరారు. పదవులు ఎల్లకాలం ఎవరికీ ఉండవని, ఉన్నంత కాలం ప్రజల కోసం పని చేయడమే తమ లక్ష్యమని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.