CM KCR News: తెలంగాణ రాష్ట్ర సాధనలో అమరవీరులైన వారి కోసం ప్రతిష్టాత్మకంగా స్మారక చిహ్నాన్ని నిర్మించారు. భారీ స్థాయి కోడిగుడ్డు ఆకారం, అద్దంలా మెరిసిపోయే ఫినిషింగ్, పైభాగంలో ఎరుపు - పసుపు కలగలిపిన రంగులో మండుతున్న జ్వాల ఆకృతిలో ఇది ఉంటుంది. హైదరాబాద్ నడిబొడ్డున, ఓ వైపు హుస్సేన్ సాగర్, మరోవైపు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సచివాలయానికి మధ్యలో దీన్ని నిర్మించారు. ఈనెల 22వ తేదీన ఈ స్మారక చిహ్నాన్ని ప్రారంభించబోతున్నారు. రేపు సాయంత్రం 5 గంటలకు 6 వేల మందితో అంబేడ్కర్ విగ్రహం నుంచి భారీ ర్యాలీ ఉంటుంది. సీఎం కేసీఆర్ 6.30 గంటలకు అమరుల స్మారకం వద్దకు చేరుకుంటారు. అమరులకు పోలీస్ గన్ సెల్యూట్ చేసిన తర్వాత అమరజ్యోతిని ప్రారంభిస్తారు. అనంతరం పక్కనే ఏర్పాటు చేసిన సభాస్థలికి చేరుకుంటారు. అక్కడ 10 వేల మంది దీపాలతో అమరులకు నివాళులు అర్పిస్తారు. తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగం ఉంటుంది. అనంతరం 800 డ్రోన్ లతో అమరులకు నివాళి, తెలంగాణ సాధించిన ప్రగతిని ప్రదర్శిస్తారు. 


ఈ నిర్మాణానికి దాదాపుగా 180 కోట్ల వ్యయం


అయితే ఈ నిర్మాణానికి రూ.177.50 కోట్లు ఖర్చు చేశారు. ప్రపంచంలోనే అతి పెద్దదైన, అతుకులు లేని స్టెయిన్ లెస్ స్టీల్ తో నిర్మితం కావడం విశేషం. 17 వందల టన్నుల స్టీల్ ను వినియోగించి నిర్మించిన ఈ నిర్మాణం పూర్తి ఆర్సీసీ రహితం. దీపం ఎత్తు 65 అడుగులు ఉంటుంది. దీనికి మొత్తం 100 టన్నుల స్టెయిన్ లెస్ స్టీలును వాడారు. అమరజ్యోతి ఎత్తు 85 అడుగులు ఉంటుంది. దీనికోసం హై డిఫైన్డ్ కార్బన్ స్టీల్ ను ఉపయోగించినట్లు తెలుస్తోంది. అమరజ్యోతి బంగారం, పసురు రంగులో ఇంటగా.. రెండు రకాల స్టీల్ ను జర్మనీ నుంచి తెప్పించారు. వీటిని దుబాయ్ కు చెందిన ఓ కంపెనీ అమర్చింది. ఇలాంటి నిర్మాణాలు ఇప్పటి వరకు చికాగో, దుబాయ్ లో ఉన్నా... అవి ఇక్కడి స్మారక చిహ్నంలా ఉపయోగించుకునే వసతులు లేవు.  


ఆరు అంతస్తులతో భవన నిర్మాణం..!


3.269 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఈ భవనం మొత్తం ఆరు అంతస్థులు. రెండు అండర్ గ్రౌండ్ కాగా, మరో నాలుగు పై అంతస్తులు. బేస్ మెంట్ - 1లో పార్కింగ్ సదుపాయం, గ్రౌండ్ ఫ్రోల్ లో ఆర్ట్ గ్యాలీ, మొదటి అంతస్తులో తెలంగాణ ఉద్యమ ప్రస్థానం, అమరుల పొటోలతో పాటు ఒక థియటర్ ఉంటుంది. రెండో అంతస్తులో 600 మంది కూర్చునేలా ఓ పెద్ద హాల్, మూడో అంతస్తు, నాలుగో అంతస్తులో ఓపెన్ రెస్టారెంట్, గ్లాస్ రూప్ రెస్టారెంట్ ఏర్పాటు చేశారు. ఈ భవనంలోఅనేక ఇతర సౌకర్యాలు కూడా ఉన్నాయి. 350 కార్లు, 600 బైకులకు సరిపడా పార్కింగ్ సౌకర్యం ఉంది. భవనం నిర్మాణ వైశాల్యం (బిల్డప్ ఏరియా) 2.88 లక్షల చదరపు అడుగులు. హుస్సేన్ సాగర్ అందాలు, బుద్ధ విగ్రహం, బిర్లామందిర్, అంబేడ్కర్ విగ్రహం, సచివాలయం తదితర నిర్మాణాు వీక్షించేందుకు వీలుగా టెర్రస్ పై రెస్టారెంట్ ను ఏర్పాటు చేశారు. అమరుల స్మారకం నిర్మాణ పనులు దాదాపు పూర్తికాగా ప్రస్తుతంత ఫినిషింగ్ పనులు, ప్రధాన ద్వారం, గ్రీనరీ తదితర పనులు కొనసాగుతున్నాయి.