CM KCR: సర్వ మత సమానత్వాన్ని కొనసాగిస్తూ.. రాజ్యాంగం అందించిన లౌకికవాద స్ఫూర్తి ప్రతిఫలించే విధంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. డా.బీ.ఆర్ అంబేడ్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో నిర్మాణం పూర్తి చేసుకున్న నల్ల పోచమ్మ దేవాలయం, మసీదు, చర్చిని ఒకే రోజున ప్రారంభించేందుకు సీఎం కేసీఆర్ సిద్ధమయ్యారు. ఈ మేరకు ఆయా మత పెద్దలను సంప్రదించి అందరికీ ఆమోదయోగ్యమైన తేదీని ఖరారు చేశారు. ఆగస్టు 25వ తేదీన హిందూ సాంప్రదాయాలను అనుసరించి పూజారుల సమక్షంలో నల్ల పోచమ్మ విగ్రహ ప్రతిష్టాపన చేసి దేవాలయాన్ని సీఎం పునః ప్రారంభిస్తారు. అదే రోజున ఇస్లాం, క్రిస్టియన్ మతాల సాంప్రదాయాలను అనుసరించి ఆయా మత పెద్దల ఆధ్వర్యంలో మసీదును, చర్చిని సీఎం ప్రారంభిస్తారు.






ఈ మేరకు మంత్రులు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సీఎంఓ అధికారులు, ఆర్ అండ్ బి ఆధికారులతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హిందూ, ముస్లిం, క్రిస్టియన్ మతాల పెద్దలతో సంప్రదించి ఒకే రోజున మూడు మతాల ప్రార్థనా మందిరాలను ప్రారంభించే చారిత్రక నిర్ణయాన్ని సీఎం తీసుకున్నారని అధికారులు వెల్లడించారు. తద్వారా సచివాలయ ఉద్యోగులకు ఈ మూడు ప్రార్థనా మందిరాలు అందుబాటులోకి రానున్నాయి.






కొత్త సచివాలయ సముదాయాన్ని ఏప్రిల్ 30న సీఎం కేసీఆర్ ప్రారంభించారు. వివిధ యుగాలలో నిర్మించిన బహుళ భవనాల సముదాయమైన పాత సచివాలయం సరిపోదని, వెంటిలేషన్ కూడా సరిగ్గా లేదని దాన్ని తొలగించింది. అలాగే ఏవైనా అగ్నిప్రమాదాలు జరిగినా బయటకు రాలేని పరిస్థితి అక్కడ ఉందంటూ దాన్ని కూల్చివేశారు. ఈ భవనాలలో వాస్తు పాటించకపోవడం మరొక కారణం. పాత సచివాలయం వద్ద ఉన్న నల్ల పోచమ్మ దేవాలయం, మసీదు ఇతర భవనాలు కూడా ఉన్నాయి. అయితే సచివాలయ భవనాన్ని కూలగొట్టే సమయంలో శిథిలాలు పడటం వల్ల మతపరమైన కట్టడాలు దెబ్బతిన్నాయని సీఎం విచారం వ్యక్తం చేశారు. మరోవైపు ఇతర మతాల ప్రజలు విపరీతమైన విమర్శలు చేశారు. మళ్లీ నిర్మాణాలు చేపట్టాలని కోరారు. ఈక్రమంలోనే ఇతర భవనాల కూల్చివేత సమయంలో పాడైన నల్లపోచమ్మ, చర్చి, మసీదును నిర్మించారు. వాటినే ఆగస్టు 25వ తేదీన ప్రారంభించబోతున్నారు.