ABP  WhatsApp

KCR Speech: అతిథులు ఎవరొచ్చినా ముందు స్తూపం దగ్గరికే; అప్పట్లో నాపై విపరీతమైన దాడి జరిగింది - కేసీఆర్

ABP Desam Updated at: 22 Jun 2023 08:22 PM (IST)

ప్రస్తుతం తనలో సంతోషం ఒక పాలు, విషాదం రెండు పాళ్లు ఉందని కేసీఆర్ అన్నారు. ఉద్యమ సమయంలో కార్యాచరణ కోసం తాము పిడికెడు మంది కలిసి ఐదారు గంటల పాటు చర్చలు చేసినట్లుగా గుర్తు చేసుకున్నారు.

కేసీఆర్ (ఫైల్ ఫోటో)

NEXT PREV

తెలంగాణ పర్యటనకు లీడర్లు సహా విదేశీ ప్రతినిధులు ఎవరూ వచ్చినా సరే ముందు తెలంగాణ అమరవీరుల స్తూపాన్ని సందర్శించేలా చేసి తర్వాత మిగతా కార్యక్రమాలు జరిపేలా సాంప్రదాయం తీసుకొస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ప్రస్తుతం తనలో సంతోషం ఒక పాలు, విషాదం రెండు పాళ్లు ఉందని అన్నారు. ఉద్యమ సమయంలో కార్యాచరణ కోసం తాము పిడికెడు మంది కలిసి ఐదారు గంటల పాటు చర్చలు చేసినట్లుగా గుర్తు చేసుకున్నారు. 1966లో ఖమ్మం నుంచి ఆజన్మ తెలంగాణ వాది అయిన ప్రొఫెసర్ జయశంకర్ ఎక్కడా వెనకడుగు వేయలేదని అన్నారు. అనేక అపవాదులు, హింస, పోలీసుల కాల్పులు ఎన్నో తెలంగాణ చరిత్రలో ఉన్నాయని అన్నారు.


తెలంగాణ రాష్ట్ర సమితి ఆఫీసు జలదృశ్యం సమీపంలో ఉంటే అప్పటి ప్రభుత్వం కర్కశంగా వ్యవహరించి సామాన్లు బయట పెట్టించి వెళ్లగొట్టిందని గుర్తు చేశారు. అందుకే పట్టుబట్టి, అదే ప్రదేశంలో అమరవీరుల స్తూపం నిర్మించాలని సంకల్పించామని అన్నారు.


తెలంగాణ కోసం తాము, తమ పార్టీ నేతలు ఎన్నోసార్లు రాజీనామాలు చేశామని గుర్తు చేసుకున్నారు. ఎంపీలు, ఎమ్మెల్యే, మంత్రి పదవులుకు రాజీనామా చేశామని చెప్పారు. తెలంగాణ పోరాటంలో హింస జరగకుండా తమ శక్తిమేర చూశామని, కానీ భావోద్వేగాలు పిల్లల్ని ఆపలేకపోయాయని అన్నారు. ఉద్యమ సమయంలో ఆంధ్రా పాలకులు తనపై చేసిన దాడి ప్రపంచంలో ఏ రాజకీయ నాయకుడిపైన కూడా జరిగి ఉండదని చెప్పారు. తెలంగాణ వచ్చుడో, కేసీఆర్‌ సచ్చుడో అనే నినాదంతో ఉద్యమానికి బయల్దేరామని గుర్తు చేసుకున్నారు.



కేసీఆర్ సచ్చుడో, తెలంగాణ వచ్చుడో అని ముందుకు వెళ్లా. నన్ను డాక్టర్లు కూడా భయపెట్టారు. అన్నీ తట్టుకొని నిలబడ్డా. జేఏసీ మిత్రులు అందరి ఆందోళనకు ఫలితంగా కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి పార్లమెంటులో చర్చ జరిగింది. మొత్తం దేశ రాజకీయ వ్యవస్థే కదిలి తెలంగాణ ఇస్తామని ప్రకటన వచ్చింది. ఒక్క రక్తపు చుక్క కారకుండా తెలంగాణ సాధించుకోవాలనే ఆశయం నెరవేరలేదు. ఈ విషయం నన్ను బాగా బాధ పెట్టింది. -


అంతకుముందు సభలో దాదాపు 10 వేల మంది క్యాండిల్‌ లైట్స్‌ ప్రదర్శించారు. ముఖ్యమంత్రి, మంత్రులు సహా ఇతర ప్రజా ప్రతినిథులు అందరూ కొవ్వొత్తులను ప్రదర్శించారు. ఆ తర్వాత ఆరుగురు అమరుల కుటుంబాలను సన్మానించారు.


అమరవీరుల స్తూపం ప్రారంభం


తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో అమరులుగా నిలిచిన వారి స్మారకార్థం ప్రభుత్వం నిర్మించిన స్మారక స్తూపాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం (జూన్ 22) సాయంత్రం ప్రారంభించారు. హైదరాబాద్ నడి మధ్యలో హుస్సేన్ సాగర్ ఒడ్డున, సచివాలయానికి ఎదురుగా ఈ స్మారక చిహ్నాన్ని వెలుగుతున్న దీపం ఆకారంలో నిర్మించారు. గురువారం (జూన్ 22) సాయంత్రం ఈ నిర్మాణాన్ని సీఎం కేసీఆర్ ప్రాంరభించారు. మొద‌ట‌గా పోలీసులు అమరవీరులకు తుపాకులతో సెల్యూట్ నిర్వ‌హించారు. ఆ త‌ర్వాత అమ‌ర‌వీరుల‌కు కేసీఆర్ తో పాటు, మంత్రులు, ఇత‌ర ప్ర‌జాప్ర‌తినిధులు నివాళుల‌ు అర్పించారు. ఆ తర్వాత తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ చేశారు. వెంటనే అమర జ్యోతిని సీఎం ప్రారంభించారు. తర్వాత అమ‌ర‌వీరుల‌పై ప్ర‌ద‌ర్శించిన లఘుచిత్రాన్ని లోపల ఏర్పాటు చేసిన మినీ ఆడిటోరియంలో తిలకించారు. 


Join Us on Telegram: https://t.me/abpdesamofficial

Published at: 22 Jun 2023 07:53 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.