తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వరుసగా రెండో రోజు జాతీయ రైతు సంఘాల నేతలతో సమావేశం అయ్యారు. దేశంలో వ్యవసాయ రంగం ఏదుర్కొంటున్న సవాళ్లు, పరిస్థితులు, తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యలపై రైతు సంఘం నేతలతో చర్చలు జరుపుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ రంగంలో తీసుకొచ్చిన మార్పులు, విధానాలను కూడా జాతీయ రైతు సంఘాల నేతలకు సీఎం కేసీఆర్ వివరిస్తున్నారు. తెలంగాణలో వ్యవసాయ, సాగునీటి రంగ అభివృద్ధిని క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసేందుకు ఉత్తర్‌ప్రదేశ్‌, తమిళనాడు, మధ్యప్రదేశ్‌, కర్ణాటక, పంజాబ్‌, ఒడిశా సహా 26 రాష్ట్రాలకు చెందిన 100 మందికిపైగా రైతు సంఘాల నాయకులు, ప్రతినిధులు రాష్ట్ర ఆహ్వానం మేరకు ఇక్కడికి వచ్చారు.


26 రాష్ట్రాల రైతు సంఘాల నేతలతో సీఎం సమావేశం
శనివారం కూడా సీఎం కేసీఆర్ జాతీయ రైతు సంఘాలతో సమావేశం అయ్యారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లయినా ప్రజల కోరికలను సంపూర్ణంగా నెరవేర్చలేదని కేసీఆర్ అన్నారు. ప్రజల కోసం పని చేసే వారిని దేశ పాలకులే ఇబ్బందులకు గురిచేస్తున్నారని కేసీఆర్‌ ధ్వజమెత్తారు. దేశంలో ఉన్న వనరులను పూర్తి స్థాయిలో వాడుకొని వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చే అవకాశం ఉన్నా ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. ఇలాంటి పరిస్థితుల నుంచి దేశాన్ని బయటపడేసేందుకు, కేంద్ర ప్రభుత్వ శక్తులన్నీ ఏకం కావాలని పిలుపు ఇచ్చారు. 


శుక్రవారం వీరంతా సిద్దిపేట జిల్లా మల్లన్నసాగర్‌, సింగాయపల్లిలో క్షేత్రస్థాయిలో పంటలను పరిశీలించారు. శనివారం సీఎం కేసీఆర్‌ ఆహ్వానం మేరకు ప్రగతి భవన్‌కు వచ్చారు. కేంద్ర ప్రభుత్వ విధానాలు, ఆలోచనలు, దేశ వ్యవసాయ రంగంలో రావాల్సిన మార్పులు, రైతుల కోసం తీసుకోవాల్సిన చర్యలను సీఎం కేసీఆర్‌ వారికి వివరించారు. వారి అభిప్రాయాలను కూడా సీఎం కేసీఆర్ విన్నారు.


అమెరికా, చైనా కంటే మనకి వనరులు ఎక్కువ - కేసీఆర్
అమెరికా, చైనా లాంటి మనకంటే ముందున్న దేశాలతో పోల్చినా నీటి వనరులు, సాగయ్యే భూమి, రైతులు భారతదేశంలోనే ఎక్కువగా ఉన్నాయని సీఎం కేసీఆర్ చెప్పారు. మన దేశంలో సాగు యోగ్యమైన భూమి మొత్తం 40 వేల కోట్ల ఎకరాలు ఉంటే అది మొత్తం సాగు కావడానికి కేవలం 40 వేల టీఎంసీల నీరు కావాల్సి ఉంటుందని అన్నారు. తాగునీటికి మరో 10 వేల టీఎంసీలు సరిపోతాయని అన్నారు. 


మన దేశంలో 70 వేల టీఎంసీల నీటి వనరులు ఉన్నా సాగు నీటికి, తాగు నీటికి దేశ ప్రజలు ఇంకా ఎదురు చూడాల్సి వస్తోందని అన్నారు. అలాగే 4 లక్షల మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి చేసుకునే సామర్థ్యం మన దేశానికి ఉందని అన్నారు. అయినా, 2 లక్షల మెగా వాట్లను కూడా ఉత్పత్తి చేసుకోలేకపోతున్నామని అన్నారు.


కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ, రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్, సాగునీరు పుష్కలంగా అందిస్తున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం వల్ల ఎందుకు సాధ్యం కావడం లేదని అన్నారు. దేశంలో ఎక్కడైనా తెలంగాణలో ఉన్నట్లుగా రైతువేదికలు ఉన్నాయా? అని అడిగారు. రైతుల ఆత్మహత్యలు దేశంలో ఇంకా ఎందుకు ఉన్నాయని, దానిపై కేంద్ర పాలకులు ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారని అన్నారు. ఒక ముఖ్యమంత్రి రైతుల కోసం ఇంత సమయం ఇచ్చి మాట్లాడడం దేశంలోనే తొలిసారి అని నిన్నటి (ఆగస్టు 27) సమావేశంలో కేసీఆర్ అన్నారు.