CM KCR Comments: ఐటీ, ఈడీ దాడుల నేపథ్యంలో సీఎం కేసీఆర్ మంత్రి గంగుల కమలాకర్, ఎంపీ వద్దిరాజుతో చర్చించారు. గ్రానైట్ కేసులకు సంబంధించిన వ్యవహారంలో రాష్ట్ర మంత్రి గంగుల, ఎంపీ వద్దిరాజు నివాసాలు, సంస్థల్లో ఈడీ సోదాలు చేసింది. ఈ క్రమంలోనే గురువారం వీరిద్దరినీ సీఎం హుటాహుటిన ప్రగతి భవన్ కు పిలిపించారు. వీరితో సుదీర్ఘంగా చర్చించారు. కాగా.. ఈ చర్చల్లో కొందరు మంత్రులు, పలువురు టీఆర్ఎస్ నాయకులు కూడా పాల్గొన్నట్లు సమాచారం. 


అవన్నీ అవాస్తవం - గంగుల కమలాకర్


నిన్ననే మంత్రి గంగుల కమలాకర్.. తమపై బీజేపీ నాయకులు నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని మంత్రి ఆరోపించారు. దర్యాప్తు సంస్థలు విచారణ చేపట్టి ఆరోపణల్లో నిజానిజాలు తేల్చాలన్నారు. నిరాధారమైన ఆరోపణలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తనని విచారణ కోసం హైదరాబాద్ రావాలని పిలిచారని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. వాళ్లు విచారణ కోసం పిలిస్తే వెళ్ళేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. దర్యాప్తు సంస్థల అధికారులకు అందుబాటులో ఉండి... వారికి కావలసిన సమాచారం ఇవ్వాలని విదేశాల పర్యటనలో ఉన్న తాను తిరిగి వచ్చానని తెలిపారు. 


భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయం..


సీఎం కేసీఆర్ డిసెంబర్ లో దేశ రాజధాని ఢిల్లీలో ఒక బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించారు. డిసెంబర్ 9వ తేదీన 12వ తేదీన ఈ సభ ఉండే అవకాశాలు ఉన్నాయి. టీఆర్ఎస్ పేరు మార్పిడి పూర్తి బీఆర్ఎస్ మారుతున్న నేపథ్యంలో ఈ సభను జాతీయ స్థాయిలో నిర్వహించాలని ఏర్పాట్లు చేస్తున్నారు. రైతు సంఘాల నేతలతో పాటు వివిధ రాజకీయ పార్టీల నాయకులను కూడా ఈ సభకు ఆహ్వానించనున్నారు. ఇందులో రైతాంగ సమస్యలతో పాటు, కేంద్ర ప్రభుత్వ కక్షసాధింపు ధోరణులను ఎండగట్టే అవకాశాలు ఉన్నాయి. అదే సమయంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రలోభాలు పెట్టిన అంశాన్ని గట్టిగా ప్రస్తావిస్తారని సమాచారం. ఎమ్మెల్యేల కొనుగోలు, ప్రలోభాలకు సంబంధించి కేసు విషయంలోనూ సీఎం కేసీఆర్ సమీక్షించినట్లు సమాచారం. 


మరోవైపు ప్రలోభాల వ్యవహారంలో ఉన్న నలుగురు ఎమ్మెల్యేలు ఇంకా సొంత నియోజక వర్గాలకు వెళ్లలేదని తెలిసింది. అక్టోబర్ 26న స్వామీజీలు, నందకుమార్ కలిసి ఫాం హౌస్ లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పైలట్ రోహిత్ రెడ్డి, గువ్వల బాలరాజు, హర్ష వర్ధన్ రెడ్డి, రేగా కాంతారావు మాట్లాడారు. వారిని పార్టీ మారాల్సిందిగా ప్రలోభ పెట్టడం పోలీసుల దాడితో వెలుగులోకి వచ్చింది. ఈ తర్వాత స్వామీజీలు, నంద కుమార్ లను పోలీసులు అరెస్ట్ చేయగా... ఎమ్మెల్యేలు ప్రగతి భవన్ కు వెళ్లారు. నాలుగు రోజుల పాటు అక్కడే ఉండిపోయారు. ఆ తర్వాత మునుగోడు ప్రచారంలో సీఎం కేసీఆర్ నిర్వహించిన బహిరంగ సభలో ఆయనతో పాటు పాల్గొన్నారు. అయితే గత 10 రోజుల నుంచి మళ్లీ వారు బయట ఎక్కడా ఎలాంటి కార్యక్రమాల్లో పాల్గొనలేదు. ఎక్కువగా ప్రగతి భవన్ లో కానీ లేకుంటే హైదరాబాద్ కు కానీ పరిమితం అయ్యారని చెబుతున్నారు.