Governor Meet : తెలంగాణ గ‌వ‌ర్నర్ త‌మిళిసై సౌంద‌ర్ రాజ‌న్‌తో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గురువారం భేటీ అయ్యారు. యూనివర్సిటీ కామన్ రిక్రూట్మెంట్ బిల్లుపై చర్చించేందుకు మంత్రి సబితా ఇంద్రా రెడ్డిను గవర్నర్ రాజ్ భవన్ కు ఆహ్వానించారు. దీంతో మంత్రి రాజభవన్ కు వెళ్లారు. రాజ్ భ‌వ‌న్‌లో  జ‌రిగే ఈ భేటీలో  మంత్రితో పాటు విద్యాశాఖ సెక్రటరీ వాకాటి కరుణ, ఉన్నత విద్యామండలి ఛైర్మన్ లింబాద్రి, కళాశాల విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. యూనివర్సిటీ కామన్ రిక్రూట్‌మెంట్‌ బోర్డు విషయంలో గవర్నర్ అభ్యంతరాలపై మంత్రి సబితా వివరణ ఇచ్చారు. ప్రైవేట్ యూనివర్సిటీ బిల్‌పై  గవర్నర్ సందేహాలను ఉన్నతాధికారులు నివృత్తి  చేశారు.






గవర్నర్ అపాయింట్మెంట్ 


యూనివర్శిటీల్లో కామన్ రిక్రూట్మెంట్ బోర్డ్ బిల్లు విషయంపై చర్చ కోసం తెలంగాణ గవర్నర్ తమిళిసై మంత్రి సబితా ఇంద్రారెడ్డికి గురువారం అపాయింట్మెంట్ ఇచ్చారు. ఈ అపాయింట్మెంట్ ప్రకారం మంత్రి బృందం గవర్నర్ ను కలిశారు.  యూనివర్శిటీల్లో కామన్ రిక్రూట్మెంట్ బోర్డ్ బిల్లు విషయంపై చర్చించనున్నారు. దీనిపై కొన్ని రోజులుగా టీఆర్ఎస్, రాజభవన్ మధ్య లేఖల విషయంలో వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే.  కానీ గవర్నర్ నుంచి తమకు ఎటువంటి లేఖ రాలేదని మంత్రి సబితా ఇటీవల చేసిన వ్యాఖ్యలపై రాజ్ భవన్ వర్గాలు స్పందించి మెసెంజర్ ద్వారా సమాచారం ఇచ్చామని స్పష్టం చేశాయి. ఈ క్రమంలో మంత్రి సబితా స్పందించి గవర్నర్ నుంచి ప్రభుత్వానికి లేఖ వచ్చిందని, గవర్నర్ అపాయింట్ మెంట్ ఇస్తే కామన్ రిక్రూట్మెంట్ బోర్డ్ బిల్లు గురించి రాజ్ భవన్ కు వెళ్లి గవర్నర్ ఉన్న సందేహాలన్నీ తీరుస్తామని తెలిపారు. దీంతో గవర్నర్ అపాయింట్ మెంట్ ఇచ్చారు. తర్వాత మంత్రి రాజ్ భవన్ కు వచ్చి గవర్నర్ తో సమావేశం అయ్యారు. 


ఫోన్ ట్యాప్ ఆరోపణలు 


 తెలంగాణ ప్రభుత్వంపై గవర్నర్ తమిళిసై తన ఫోన్‌ను ట్యాప్ చేస్తున్నారన్న అనుమానాలు ఉన్నాయన్నారు. అంతే కాకుండా ఫామ్ హౌస్ డీల్స్ విషయంలో రాజ్ భవన్‌ను ఇరికించేందుకు ప్రయత్నించారని ఆరోపించారు.  ఫామ్ హౌస్ డీల్స్ విషయంలో తుషార్ అనే వ్యక్తిపై కేసు పెట్టారని..గతంలో ఆయన రాజ్‌భవన్‌లో ఏడీసీగా పని చేశారన్నారు. ఈ కేసు విషయంలో తుషార్‌పై అనవసరంగా కేసు పెట్టారని మండిపడ్డారు. మొదట తుషార్ పేరు.. ఆ తర్వాత  రాజ్ భవన్ పేరు ప్రస్తావించారని.. ఈ కేసులో.. అసలు రాజ్‌భవన్‌కు సంబంధం ఏమిటని తమిళిసై ప్రశ్నించారు.  


ఆ తుషార్ వేరు 


గవర్నర్ ఎలా ఎందుకు మాట్లాడారో తెలియదన్నారు మంత్రి హరీశ్ రావు. తాము రాహుల్ గాంధీ మీద పోటీ చేసిన కేరళకు చెందిన  తుషార్ కోసం మాట్లాడామన్నారు. గవర్నర్ ఎందుకో తన మాజీ ఏడీసీ తుషార్ కోసం మాట్లాడారన్నారు. ఎవరు ఎవరి ఫోన్లు ట్యాప్ చేస్తున్నారో దేశ ప్రజలందరికీ తెలుసన్నారు. రాజ్యాంగ వ్యవస్థలో ఉన్న వ్యక్తులు గౌరవ ప్రదంగా ఉండాలని మంత్రి హరీశ్ రావు సూచించారు. తమ విలువ తగ్గించుకుని, స్థాయి తగ్గేలా మాట్లాడటం తగదన్నారు. మంత్రి సబిత ఇంద్రారెడ్డి, గవర్నర్ ను కలిసి యూనివర్సిటీ కామన్ రిక్రూట్ మెంట్ బోర్డుపై అనుమానాలు నివృత్తి చేశారని తెలిపారు.