కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు తొమ్మిదో ప్యాకేజీకి చెన్నమనేని రాజేశ్వరరావు పేరు పెట్టాలని నిర్ణయించారు. మల్కపేట జలాశయంతో పాటు దాని పరిధిలోని కాల్వలకు రాజేశ్వరరావు పేరు పెట్టనున్నారు. గతంలో రాజేశ్వరరావు చేసిన సామాజిక సేవలను గుర్తిస్తూ ఈ పేరు పెట్టాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. రేపు (ఆగస్టు 31) చెన్నమనేని రాజేశ్వరరావు శతజయంతి సందర్భంగా కేసీఆర్ ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. సిరిసిల్ల, వేములవాడ పరిధి ప్రాజెక్టు పరిధిలోని తొమ్మిదో ప్యాకేజీకి రాజేశ్వరరావు పేరు పెట్టనున్నారు.
చెన్నమనేని రాజేశ్వరరావు నిరంతరం ప్రజల కోసం పోరాడిన గొప్పనేత అని సీఎం కేసీఆర్ కొనియాడారు. ఆయన స్వాతంత్ర్య సమరయోధుడు అని, తెలంగాణ తొలితరం రాజకీయ వేత్త అని అన్నారు. ఆనాడు తెలంగాణలో ఎత్తిపోతల పథకాల కోసం పోరాడారని గుర్తు చేశారు. నేడు తెలంగాణ రైతులు దేశం గర్వించే స్థాయిలో పంటలు పండిస్తున్నారని సీఎం కేసీఆర్ వెల్లడించారు.
సీఎం కేసీఆర్ ను కలిసిన చెన్నమనేని రమేశ్ బాబు
చెన్నమనేని రాజేశ్వరరావు కుమారుడు చెన్నమనేని రమేశ్‌ను ఇటీవల రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా (వ్యవసాయ రంగ వ్యవహారాలు) ప్రభుత్వం నియమించిన సంగతి తెలిసిందే. ఆయనకు కేబినెట్ హోదా కూడా కల్పించారు. ఈ మేరకు తనను నియమించినందుకు వేములవాడ ఎమ్మెల్యే డాక్టర్ చెన్నమనేని రమేశ్ బాబు ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ ను నేడు (ఆగస్టు 30) మర్యాదపూర్వకంగా కలిసి ధన్యవాదాలు తెలిపారు.
ఈ సందర్భంగా రమేశ్ బాబు మాట్లాడుతూ.. వ్యవసాయ రంగంలో నెలకొన్న ఆరు దశాబ్దాల సంక్షోభాన్ని, స్వరాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో, కేవలం దశాబ్ది కాలంలోపే అధిగమించిందని తెలిపారు. సీఎం కేసీఆర్ దార్శనికతతో తెలంగాణ రాష్ట్రం నేడు వ్యవసాయ విధానాల అమలు, వ్యవసాయాభివృద్ధిలో దేశానికే ఆదర్శంగా నిలిచిందని రమేశ్ బాబు తెలిపారు. సీఎం సారథ్యంలో వ్యవసాయ అభివృద్ధి, రెండవ దశలో భవిష్యత్తు సవాళ్లకు సిద్ధమౌతున్న సమయంలో సీఎం తనకు అప్పగించిన బాధ్యతను చిత్తశుద్ధితో నిర్వహిస్తానని ఎమ్మెల్యే రమేశ్ బాబు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ చెన్నమనేనికి శుభాకాంక్షలు తెలిపారు.