తమిళనాడు సీఎం స్టాలిన్‌ను మెగా బ్రదర్స్ చిరంజీవీ, పవన్ కల్యాణ్ పొగిడారు. తమిళనాడులో స్టాలిన్ పాలన బాగుందని పవన్ కల్యాణ్ ట్వీట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. చెన్నైలో మెగాస్టార్ చిరంజీవి కలిసి.. అభినందనలు తెలిపారు.


 


తమిళనాడు సీఎం స్టాలిన్‌ పనితీరును జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ కొనియాడారు. ఏ పార్టీ అయినా అధికారంలోకి రావడానికి రాజకీయాలు చేయాలి కానీ.. వచ్చాక కాదని పవన్ కళ్యాణ్ అన్నారు. ఇదే విషయాన్ని కేవలం మాటల్లోనే కాకుండా చేతల్లో చేసి చూపిస్తున్నారని స్టాలిన్‌ని ప్రశంసించారు. స్టాలిన్ పరిపాలన, ప్రభుత్వ పని తీరు తమిళనాడుకే కాకుండా.. దేశంలోని అన్ని రాష్ట్రాలకు మార్గదర్శకంగా నిలిస్తుందని చెప్పారు. స్టాలిన్‌కు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.


 



మెగాస్టార్ చిరంజీవి చెన్నైలో తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ను కలిశారు. తమిళనాడు సీఎంగా అధికారం చేపట్టిన తర్వాత స్టాలిన్ తనదైన శైలిలో పాలన చేపడుతూ, అందరి అభినందనలు అందుకుంటున్నారని చెప్పారు. ఇటీవలి ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన స్టాలిన్ కొన్ని నెలల వ్యవధిలోనే ఉత్తమ సీఎంగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో, సీఎం స్టాలిన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన చిరంజీవి ఆయనను అభినందించారు. స్టాలిన్ కు పుష్పగుచ్ఛం అందించి శాలువా కప్పారు. ఈ సందర్భంగా అక్కడ స్టాలిన్ తనయుడు ఉదయనిధి కూడా ఉన్నారు. కేవలం మర్యాద పూర్వకంగానే సీఎం స్టాలిన్‌ ను తాను కలిసినట్లు చిరంజీవి మీడియా కు వెల్లడించారు.




స్టాలిన్ మార్క్ పాలిటిక్స్


స్టాలిన్ సీఎం అయిన తరువాత...గత ప్రభుత్వ నిర్ణయాల అమల్లో బేషజాలకు పోవటం లేదు. తన తండ్రి రాజకీయ ప్రత్యర్ధి అమ్మ పేరుతో కొనసాగుతన్న వాటిని రద్దు చేయలేదు. జయలలిత ప్రారంభించిన అమ్మ క్యాంటీన్లను యథావిధిగా కొనసాగించాలని స్టాలిన్ నిర్ణయించారు. అంతే కాకుండా.. కరోనా విషయంలో వేసిన టాస్క్ ఫోర్స్ కమిటీలోనూ ప్రతిపక్ష పార్టీల సభ్యులకు అవకాశం ఇచ్చారు. తన ప్రమాణ స్వీకార సమయంలో అన్నా డీఏంకే నేతలు పన్నీర్ సెల్వం.. పలని స్వామిలను తన టేబుల్ వద్దే కూర్చోబెట్టుకున్న ఫొటోలు వైరల్ అయ్యాయి.  ఇవి స్టాలిన్ మార్క్ రాజకీయాన్ని స్పష్టం చేశాయి. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్ధులకు ఉన్నత విద్యా సంస్థల్లో రిజర్వేషన్ కల్పించారు. ఇది ఖచ్చితంగా ప్రభుత్వ బడుల్లో చదివే విద్యార్ధులకు మేలు చేసే నిర్ణయంగా ప్రశంసలు అందుకుంది. మరోవైపు తనను పొగడొద్దంటూ.. ఇటివలే ఎమ్మెల్యేలకు ఆయన స్పష్టం చేశారు. ఇలాంటి నిర్ణయాలతో స్టాలిన్ పలువురి ప్రశంసలు అందుకుంటున్నారు.


 


Also Read: రేసర్‌తో ఉపాసన చెల్లెలి ఎంగేజ్‌మెంట్‌.. హాజరైన మెగాస్టార్ చిరు.. రామ్ చరణ్ రాలేదేంటి