Palamuru Rangareddy Project :


హైదరాబాద్: తెలంగాణ పర్యటనకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ పాలమూరులో చేసిన ప్రకటనలపై అధికార పార్టీ బీఆర్ఎస్ నేతలు, రాష్ట్ర మంత్రులు మండిపడుతున్నారు. పాలమూరు గడ్డ మీదకి వచ్చిన ప్రధాని మోదీ నిజామాబాద్ జిల్లాకి సంబంధించిన పసుపు బోర్డు అంశం ప్రకటించడం హాస్యాస్పదమని చేవెళ్ల ఎంపీ డాక్టర్ జి. రంజిత్ రెడ్డి పేర్కొన్నారు. మహబూబ్ నగర్ జిల్లాలకు వచ్చిన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పాలమూరు రంగారెడ్డి  ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వకపోవడం దారుణం అన్నారు. 


పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని బీఆర్ఎస్ ఎంపీలుగా తాము పలుమార్లు పార్లమెంట్లో ఆందోళన చేసినా కేంద్రం కనీసం స్పందించలేదన్నారు. కర్ణాటక ఎన్నికల సమయంలో మాత్రం అక్కడి అప్పర్ భద్ర ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వడంపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎన్నికలు దగ్గర పడుతున్నాయంటే కేంద్రంలోని బిజెపి పార్టీకి గిమ్మిక్కులు గుర్తుకొస్తాయని ధ్వజమెత్తారు. తెలంగాణకి సంబంధించిన  పసుపు బోర్డు, గిరిజన యూనివర్సిటీకి నిధుల కేటాయింపు ప్రకటన కూడా ఎన్నికల స్టంట్ గానే ఎంపీ రంజీ రెడ్డి అభివర్ణించారు. 


ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ బీజేపీకి, కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ అభివృద్ధిపై చిత్తశుద్ధి ఉంటే విభజన హామీలపై తక్షణమే చర్చ చేసి తెలంగాణకు ఇవ్వాల్సిన నిధులు విడుదల చేయాలని ఎంపీ రంజిత్ రెడ్డి డిమాండ్ చేశారు. మోదీ ఎన్నికల స్టంటులతో తెలంగాణ ప్రజల హృదయాన్ని గెలవలేరని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని ఇప్పటికైనా బీజేపీ నేతలు కేంద్ర ప్రభుత్వ పెద్దలు గుర్తించాలని హితవు పలికారు. మెడికల్ కాలేజీలు కేంద్రం ఒక్కటి ఇవ్వకున్నా, సీఎం కేసీఆర్ నాయకత్వంలో ప్రతి జిల్లాకు ఓ మెడికల్ కాలేజీని ఏర్పాటు చేసుకుంటున్నామని పేర్కొన్నారు.


మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ లు ప్రధాని మోదీ వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు చేశారు. బీఆర్ఎస్ స్టీరింగ్ కేసీఆర్ చేతిలోనే ఉందని, బీజేపీ స్టీరింగ్ అదానీ చేతుల్లో ఉందని మోదీకి కౌంటర్ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక చట్టాలు తీసుకొచ్చి, ఉద్యమాలతో వాటిని వెనక్కి తీసుకోవడం నిజం కాదా అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వం కరోనా సమయంలోనూ రైతు బంధు ఇవ్వడంతో పాటు రైతులకు రుణమాఫీ చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని స్పష్టం చేశారు. 


పసుపు బోర్డు, గిరిజన వర్సిటీ ఏర్పాటు చేస్తామని మోదీ ప్రకటన
తెలంగాణ పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీ.. రాష్ట్రంలో పసుపు బోర్డుతో పాటు జాతీయ గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అంతకుముందు మహబూబ్‌నగర్‌ నుంచి 13,500 కోట్లతో చేపట్టనున్న పలు రకాల అభివృద్ధి పనులకు వర్చువల్ గా శంకుస్థాపన చేశారు. ఇందులో జాతీయ రహదారులు, రైల్వే తదితర అభివృద్ధి పనులున్నాయి. కరోనా వ్యాప్తి తర్వాత ప్రపంచానికి పసుపు గొప్పదనం తెలిసిందన్నారు. పసుపు బోర్డుతో తెలంగాణ రైతులకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. రూ.900 కోట్ల వ్యయంతో ములుగు జిల్లాలో సమ్మక్క- సారక్క గిరిజన యూనివర్సిటీ పేరుతో ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామన్నారు. దేశంలో నిర్మించే 5 టెక్స్‌టైల్‌ పార్కుల్లో తెలంగాణకు ఒకటి కేటాయించాం అన్నారు.