Hyderabad News: హైదరాబాద్: చార్మినార్ గుల్జార్ హౌస్ వద్ద ఆదివారం ఉదయం జరిగిన భారీ అగ్నిప్రమాదంలో 17 మంది మృతిచెందారు. తెలంగాణ ప్రభుత్వం మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరి చొప్పున రూ.5 లక్షల పరిహారం ప్రకటించింది. అగ్నిప్రమాదం ఘటనపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడుతూ.. ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరి చొప్పున రూ.5 లక్షలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలతో మంత్రులు దామోదర్‌ రాజనర్సింహా, పొన్నం ప్రభాకర్‌ చార్మినార్ కు వెళ్లి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. సీఎం రేవంత్ రెడ్డి ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించి ఎప్పటికప్పుడూ సమీక్ష చేస్తున్నారని తెలిపారు.

సమాచారం అందిన వెంటనే కదిలిన ఫైరింజన్

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సహా పలువురు నేతలు అగ్నిప్రమాదం జరిగిన స్థలాన్ని పరిశీలించారు. అగ్నిప్రమాదం ఘటనపై భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడుతూ.. షార్ట్‌ సర్క్యూట్‌ ద్వారా ఆ బిల్డింగులో అగ్ని ప్రమాదం జరిగినట్లు అధికారులు ప్రాథమికంగా చెబుతున్నారు. ఆదివారం ఉదయం 6.16 గంటలకు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందింది. ఆ మరుసటి నిమిషంలోనే 6.17కి మొగల్‌పుర ఫైర్‌ ఇంజిన్‌ సిబ్బంది ప్రమాద స్థలానికి బయలుదేరారు. 6.20 గంటలకు అక్కడికి చేరుకుని మంటలు ఆర్పేందుకు సహాయకచర్యలు చేపట్టారు.

భారీ అగ్నిప్రమాదం అత్యంత బాధాకరం..

రెస్క్యూ ఆపరేషన్‌లో భాగంగా ఫైర్ డిపార్ట్‌మెంట్ మొత్తం 11 ఫైరింజన్లతో ఒక రోబోను ఉపయోగించారు. సహాయక చర్యలలో మొత్తం 70 మంది వరకు సిబ్బంది పాల్గొన్నారు. సాధ్యమైనంత వెంటనే మంటలు అదుపులోకి తేవడంతో ప్రమాద తీవ్రత పెరగకుండా చర్యలు తీసుకున్నట్లయింది. ఇంట్లో స్పృహ తప్పి పడిపోయిన వారిని రెస్క్యూ టీమ్ కాపాడి బటయకు తీసుకొచ్చింది. వారిని పలు హాస్పిటల్స్ తరలించినా ప్రయోజనం లేకపోయింది. ఈ ప్రమాదంలో నలుగురు ప్రాణాలతో బయటపడగా, మరో 17 మంది మృతిచెందారు. ఈ స్థాయిలో భారీ ప్రమాదం జరగడం అత్యంత బాధాకరం, దురదృష్టకరం. బాధిత కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని’ భట్టి విక్రమార్క తెలిపారు.

ప్రధాని మోదీ దిగ్భ్రాంతిహైదరాబాద్‌లో జరిగిన అగ్నిప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అగ్నిప్రమాదంలో చనిపోయిన మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరి చొప్పున రూ.2 లక్షల పరిహారం, గాయపడిన వారికి ఒక్కొక్కరికి రూ.50 వేలు అందిస్తామని ప్రకటించారు.