Womens University In Telangana: హైదరాబాద్: మహిళా యూనివర్సిటీకి వీరనారి చిట్యాల ఐలమ్మ(చాకలి ఐలమ్మ) పేరు పెడుతూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు తెలంగాణ శాసన మండలిలో ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ యూనివర్సిటీ పేరు మార్పుపై బిల్లు ప్రవేశ పెట్టారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ పేరును మహిళా యూనివర్సిటీకి పెట్టడం ఆనందంగా ఉందన్నారు మంత్రి దామోదర రాజనర్సింహ. ఆమె చేసిన పోరాటం ఎంతోమంది మహిళలకు స్పూర్తి అని, అందుకే ఆమె ధైర్య సాహసాలు స్మరించుకునేందుకు మహిళా యూనివర్సిటీకి చాకల ఐలమ్మ పేరు పెట్టామని మంత్రి పేర్కొన్నారు.

ఉమెన్స్ కాలేజీని యూనివర్సిటీ చేసిన గత ప్రభుత్వం

2014 జూన్ 2న ఏర్పడ్డ నూతన రాష్ట్రం తెలంగాణలో మ‌హిళా యూనివ‌ర్సిటీ అవ‌స‌ర‌మ‌ని గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆలోచించింది. ఆ దిశ‌గా అడుగులు వేస్తూ హైదరాబాదులోని కోఠి ఉమెన్స్ కాలేజీ (Koti Womens College)ని తెలంగాణ మ‌హిళా విశ్వ‌విద్యాల‌యం (Telangana Womens University) గా మార్చుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కోఠి ఉమెన్స్ కాలేజీ తెలంగాణ మహిళా యూనివర్సిటీగా మార్చుతూ గత ప్రభుత్వం 2022 ఏప్రిల్ 25న ఉత్త‌ర్వులు జారీ చేసింది.

ఉమ్మ‌డి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఏకైక మహిళా యూనివర్సిటీ తిరుప‌తిలోని శ్రీ ప‌ద్మావ‌తి మ‌హిళా విశ్వ‌విద్యాల‌యం. అయితే రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత ఆ యూనివ‌ర్సిటీ ఏపీలో ఉంటుంది. తెలంగాణలో ఉన్నత విద్యావకాశాలు అంతగా లేని కారణంగా విద్యార్థులు ఇతర రాష్ట్రాలకి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. ఆ సమయంలో నగరంలోని కోఠి ఉమెన్స్ కాలేజీని మహిళా విశ్వ‌విద్యాల‌యంగా మార్చారు. దాంతో తెలంగాణలోని తొలి మహిళా యూనివర్సిటీ అవతరించినట్టు అయింది. 

Also Read: Telangana TET Exam Dates: తెలంగాణ టెట్ అభ్యర్థులకు అలర్ట్, ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

అధికారికంగా చాకలి ఐలమ్మ జయంతి

సెప్టెంబరు 26, 1895న జన్మించిన చిట్యాల ఐలమ్మ సెప్టెంబర్ 10, 1985న కన్నుమూశారు. తెలంగాణలో వీర వనితగా చాకలి ఐలమ్మ గుర్తింపు పొందారు. తొలి భూ పోరాటానికి నాంది పలికి, సామాజిక ఆధునిక పరిణామానికి నాంది పలికిన ధెైర్యశాలి. కాగా, 2022 నుండి తెలంగాణ ప్రభుత్వం చాకలి ఐలమ్మ జయంతిని అధికారికంగా నిర్వహించడం తెలిసిందే.