Telangana News: కేంద్ర ప్రభుత్వ విధానాలపై తెలంగాణ కాంగ్రెస్‌ ఫైర్ అయింది. తెలంగాణ పీసీసీ చీఫ్‌ మహేష్‌ గౌడ్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌ల భారీ ర్యాలీ జరిగింది. ఈ ర్యారీలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, మంత్రులు, ఇతర కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. కేంద్రం వైఖరిని ఎండగడుతూ చలో రాజ్‌భవన్ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. అందులో భాగంగా తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నేతలంతా అసెంబ్లీ నుంచి రాజ్‌భవన్ రోడ్డు వరకు ర్యాలీ చేపట్టారు. 


అదానీ అక్రమాలపై  ఆయనపై వచ్చిన ఆరోపణలు జేపీసీ వేయాలని డిమాండ్ చేస్తోంది కాంగ్రెస్. ఈ అంశంపై మోదీ ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ర్యాలీలకు ఏఐసీసీ పిలుపునిచ్చింది. అధిష్ఠానం పేలుపు మేరకు చేపట్టిన కార్యక్రమంలో కాంగ్రెస్‌కు చెందిన అగ్రనేతలంతా కార్యక్రమంలో పాల్గొని నడి రోడ్డుపై ధర్నా చేపట్టారు. 


అసెంబ్లీ సాయంత్రం  వరకు వాయిదా వేసిన అనంతరం ర్యాలీ చేపట్టారు. అసెంబ్లీ నుంచి రాజ్‌భవన్ వరకు జరిగిన ర్యాలీలో ముఖ్య నేతలంతా పాల్గొన్నారు. ఈ ర్యాలీ కారణంగా ఆ ప్రాంతంలో ట్రాఫిక్ భారీగా నిలిచిపోయింది. రాజ్‌భవన్‌కు వెళ్లే రోడ్డుపై బైఠాయించిన కాంగ్రెస్ నేతలు కేంద్రం విధానాలను తూర్పారబట్టారు. మోదీ అండతోనే అదానీ స్వైరవిహారం చేస్తున్నారని విచ్చలవిడిగా అవినీతి పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ సంపదను దోచుకుంటున్నారని మండిపడ్డారు. 


విదేశాల్లో అదానీ చేసిన స్కాములతో దేశం పరువు పోతుందన్నారు కాంగ్రెస్ లీడర్లు. అయినా కేంద్రం పట్టించుకోవడం లేదని చర్యలు తీసుకునేందుకు భయపడుతోందని ఆరోపించారు. ఆయన చేస్తున్న అక్రమాలపై జేపీసీ వేయడానికి ఎందుకు భయపడుతుందని నేతలు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు మణిపూర్ అల్లర్లపై కూడా కేంద్రం మౌనంగా ఉంటోందన్నారు.  


ప్రభుత్వమే ధర్నాలు చేయడం ఏంటని చాలా మందికి అనిపిస్తుందని అన్నారు రేవంత్ రెడ్డి.కానీ ప్రస్తుత పరిస్థితుల్లో తప్పడం లేదని అన్నారు. దేశ ప్రతిష్టను అదానీ ప్రపంచం ముందు మంటగలుపుతుంటే కేంద్రం మౌనంగా ఉంటే తిరుగుబాటు చేయక తప్పదన్నారు. లంచాలు ఇచ్చిన అదానీ వ్యాపారాలు చేశారని అమెరికా చెబితే కనీసం మోదీ మాట్లాటం లేదని అన్నారు. దీనిపై పార్లమెంట్‌లో కేంద్రాన్ని రాహుల్ గాంధీ నిలదీశారని అన్నారు. కనీసం పార్లమెంట్‌లో ఈ అంశంపై స్పందించేందుకు కూడా కేంద్రానికి ధైర్యం సరిపోవడం లేదని విమర్శించారు.  


అదానీ స్కామ్‌లపై నిగ్గు తేల్చేందుకు జేపీసీ వేయాలని డిమాండ్‌ను చేసినా మోదీ పట్టించుకోవడం లేదని ఆరోపించారు రేవంత్ రెడ్డి. అసలు అదానీని కాపాడేందుకు ఎందుకు ప్రయత్నిస్తున్నారని నిలదీశారు. అందుకే కాంగ్రెస్ పోరాట పంథా ఎంచుకుందన్నారు రేవంత్. రాహుల్ గాంధీ పిలుపు మేరకు ఇప్పుడు రాజ్‌భవన్‌ల వద్ద ధర్నాతో మొదలు పెట్టామని రాష్ట్రపతి భవన్‌ వరకు వస్తామన్నారు. అదానీ వివాదాలపై స్పందించకపోతే కచ్చితంగా రాష్ట్రపతి భవన్‌ ఎదుట ధర్నా చేస్తామని హెచ్చరించారు. 


ఒక వేళ జేపీసీ వేస్తే మాత్రం అదానీ కచ్చితంగా జైలుకు వెళ్తారని రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. అందుకే జేపీసీ వేయకుండా అదానీని మోదీ కాపాడుతున్నారని ఆరోపించారు. ఇద్దరూ లాలూచీ పడ్డారని విమర్శించారు. వీళ్లతో బీఆర్‌ఎస్‌ లోపాయికర ఒప్పందం చేసుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే అరెస్టు వార్తలు రాగానే కేటీఆర్ ఢిల్లీ వెల్లి బీజేపీ పెద్దలతో కలిశారని ఆరోపించారు.