Telangana Latest News: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత రెడ్డి చేసిన కామెంట్స్‌పై కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్‌ ఫైర్ అయ్యారు. బీఆర్‌ఎస్‌తో కుమ్మక్కై రాష్ట్రాభివృద్ధిని అడ్డుకోవడమే కాకుండా కేటీఆర్, కేసీఆర్ అరెస్టు కాకుండా కూడా కాపాడుతున్నారని రేవంత్ రెడ్డి విమర్శలు చేశారు.  ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో సీఎం చేసిన ఈ కామెంట్స్‌ వైరల్ అయ్యాయి. అందుకే దీనిపై కేందమంత్రులుఘాటుగా రియాక్ట్ అయ్యారు. 

ప్రతిపక్షంలో ఉన్నట్టు రేవంత్ ఫీల్ అవుతున్నారని కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరాశ నిసృపహతో మాట్లాడుతున్నారని అభిప్రాయపడ్డారు. ఎవరిని విమర్శిస్తున్నారో అర్థంకావడం లేదన్నారు. ఎన్నికలకు ముందే రేవంత్ రెడ్డి చేతులు ఎత్తేసినట్టు కనిపిస్తోంది. ఓటమిని అంగీకరించారని అన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో పూర్తి స్థాయిలో విచారణ చేయాలని బీజేపీయే కోర్టులో కేసు విషయాన్ని కిషన్ రెడ్డి గుర్తు చేశారు. ఇప్పటికైనా ఈ కేసును సీబీఐకు అప్పగించాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. కాంగ్రెస్ మాదిరి చీకటి ఒప్పందాలు చేసుకోవాల్సిన అవసరం బీజేపీకి లేదని అన్నారు. 

తెలంగాణలో  పాలకులు మారారే తప్ప పాలనలో ఎలాంటి మార్పు లేదన్నారు కిషన్ రెడ్డి. ఇచ్చిన హామీలు కానీ, ప్రజలకు చేసిన మేలు ఏం లేదని  విమర్శించారు. అందుకే ఓటమి భయంతో రేవంత్ రెడ్డి ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పాలనకు ఎలాంటి మార్పు లేదని ఎద్దేవా చేశారు. కేసీఆర్‌కు, రేవంత్ రెడ్డికి ఏం తేడా లేదని విమర్శించారు. కులగణనను ఎక్కడా బీజేపీ వ్యతిరేకించకపోయినా తప్పుడు ప్రచారం చేస్తున్నారని వివరించారు. 

తెలంగాణలో అసలు ఒప్పందం కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ మధ్యే ఉందన్నారు కేంద్రమంత్రి బండి సంజయ్‌. దమ్ముంటే బీఆర్‌ఎస్‌ హయాంలో జరిగిన స్కామ్‌లపై సీబీఐ విచారణకు పిలవాలని డిమాండ్ చేశారు. అప్పుడు అవినీతికి పాల్పడిన వారిని ఊచలు లెక్కించేలా చేస్తామన్నారు. అలా కాకుండా కేసులన్నీ రాష్ట్ర ప్రభుత్వం విచారించి కేంద్రమంత్రులు, బీజేపీ అడ్డుకుంటుందని విమర్శలు చేయడం ఎంత వరకు కరెక్టని ప్రశ్నించారు. తమపై బురదజల్లేందుకే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నామని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్ ఒక్కటయ్యాయని అన్న సంజయ్‌... ఎన్ని చేసినా బీజేపీ గెలవడం ఖాయమైందని అభిప్రాయపడ్డారు. ఓటమి భయంతోనే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. ఎన్ని చేసినా మూడు సీట్లలో గెలిచేది బీజేపీ మాత్రమేనని చెప్పుకొచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా చేస్తున్న సర్వేలు చూస్తే కాంగ్రెస్ మూడో స్థానానికి పడిపోయిందని చెబుతున్నారని అన్నారు. 

Also Read: SLBC నిర్మాణంలో ఆది నుంచి నిర్లక్ష్యమే, పాలకుల తప్పునకు కార్మికులకు శిక్ష!