Kishan Reddy Comments: కేసీఆర్ జాతీయ పార్టీ పెట్టడం అనేది ఈ పది సంవత్సరాల్లోనే అతిపెద్ద జోక్ అంటూ కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఉట్టికి ఎగరనోడు... ఆకాశానికి ఎగిరాడట అంటూ కామెంట్లు చేశారు. దళితులను ధగా చేసిన వ్యక్తిగా సీఎం కేసీఆర్ చరిత్రలో నిలవబోతున్నారన్నారు. పరిపాలించే సత్తా లేనోడు సీఎం కేసీఆర్ అని తెలిపారు. ప్రధాని మోదీపై కల్వకుంట్ల కుటుంబం తప్పుడు ప్రచారం చేస్తోందని అన్నారు. దేశంలో కుటుంబ పాలన తేవాలని... కుటుంబ పార్టీలన్నిటిని కలిపే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. కుటుంబ పార్టీలకు వ్యతిరేకంగా ప్రజాస్వామ్య పాలన తీసుకు రావడమే ప్రధాని మోదీకి తెలుసని వివరించారు. ఎన్డీఏకు ఎప్పటికీ కేసీఆర్ ప్రత్యామ్నాయం కాదని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.
అప్పుల తెలంగాణగా మార్చారు..
కేసీఆర్ కు ఉన్నదే 7 సీట్లేనని వాటితో ఆయన ఏం చేస్తాడో మీరో ఆలోచించంచండంటూ కిషన్ రెడ్డి కామెంట్లు చేశారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో కేసీఆర్ కు 17 స్థానాల్లో ఒక్క సీటు కూడా రాదని తెలిపారు. పంచాయితీ నుంచి పార్లమెంటు వరకు, గల్లి నుంచి ఢిల్లీ వరకు... 130 కోట్ల మంది ప్రజలతో జాతీయ జెండాను ఎగరవేసిన చరిత్ర బీజేపీది అని తెలిపారు. సీఎం కీసీఆర్ ది అతిపెద్ద అవినీతి కుటుంబం అని ఆరోపించారు. మిగులు బడ్జెట్ తో ఉన్న రాష్ట్రాన్ని చేతిలో పెడితే అప్పుల తెలంగాణగా మార్చిన ఘనత కల్వకుంట్ల కుటుంబానికే చెందుతుందన్నారు. మోటార్లకు మీటర్లు పెట్టాల్సిన అవసరం లేదని ఎలక్ట్రిసిటీ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. రానున్న రోజుల్లో ఉద్యోగులు ఎవరికి జీతాలు ఇవ్వలేని పరిస్థితి వస్తుందని తెలిపారు. ట్రాన్స్కో, జెన్కోలకు ఈ ప్రభుత్వం రూ.40 వేల కోట్లు అప్పు ఉందని స్పష్టం చేశారు.
కుర్చీలో ఉంది కేసీఆర్ యే అయినా స్టీరింగ్ మాత్రం మజ్లిస్ చేతిలోనే..
బీజేపీ మోటార్లకు మీటర్లు పెట్టదని.. తప్పకుండా కేసీఆర్ అవినీతికి మీటర్లు పెడుతుందన్నారు. సీఎం కేసీఆర్ ఏం చేశాడని దేశవ్యాప్తంగా కేసీఆర్ పాలన కావాలని ప్రశ్నించారు. దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానన్న కేసీఆర్ హామీ ఏమైందని అడిగారు. దళితులకు వెన్నుపోటు పొడిచిన చరిత్ర కేసీఆర్ ది అని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వివరించారు. దళితులకు మూడు ఎకరాల భూ పంపిణీ ఏమైందన్నారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇవ్వకుండా మోసం చేసిన చరిత్ర కేసీఆర్ ది అని తెలిపారు. కేజీ టు పీజీ హామీ ఏమైందన్నారు. సంక్షేమ హాస్టల్లో రాళ్లతో అన్నం పెడుతున్నారన్నారు. కలుషిత ఆహారం తిని విద్యార్థులు మరణిస్తున్న ఘటనలను చూస్తున్నామన్నారు. మజ్లిస్ కు, ఓవైసీకి భయపడే పార్టీ బీజేపీ కాదని తెలిపారు. కేసీఆర్ సీఎం కుర్చీలో కూర్చున్నా స్టీరింగ్, బ్రేక్ ఓవైసీ చేతిలోనే ఉందని విమర్శించారు. ఇలాంటి పాలనేనా దేశానికి కావాల్సిందన్నారు.
బీజేపీ అధికారంలోకి వచ్చాకే మోడల్ అంటే తెలుస్తుంది..
కేసీఆర్ జాతీయ పార్టీ అనేది ఈ దశాబ్దపు అతిపెద్ద జోక్ అంటూ కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు. కేసీఆర్ ఎనిమిదవ నిజాం అంటూ విమర్శించారు. కేసీఆర్ లాంటి అరాచక వ్యక్తి, అవినీతి పరుడు ఇంకెవరూ లేరన్నారు. కల్వకుంట్ల కుటుంబానికి తెలంగాణను దోచుకున్నది సరిపోదని.. బీజేపీ యేతర పార్టీలకు కేసీఆర్ ఎలా డబ్బులు పంపిస్తున్నాడో ప్రజలందరికీ తెలుసని కామెంట్లు చేశారు. సీఎం కేసీఆర్ తెలంగాణలో చెల్లని రూపాయి .. మరి దేశంలో ఈ రూపాయి ఎలా చెల్లుతుందని అడిగారు. కేసీఆర్ విషయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు. తెలంగాణ మోడల్ అంటే ఏంటో... బీజేపీ ప్రభుత్వం వచ్చాక ప్రజలకు తెలుస్తుందన్నారు. ప్రజా ఉద్యమాలను అడ్డుకోవడం.. ప్రజలకు అందుబాటులో లేకపోవడమేనా 'తెలంగాణ మోడల్' అంటే అని ప్రభుత్వాన్ని నిలదీశారు. ప్రగతి భవన్ నుంచి కేసీఆర్ ను ప్రజలు తరిమికొట్టడం ఖాయమన్నారు. లక్ష మంది కేసీఆర్ లు, లక్ష మంది ఓవైసీలు వచ్చినా... 2024లో అధికారంలోకి వచ్చేది బీజేపనే అని తెలిపారు. ప్రజా సంగ్రామ యాత్రతో కేసీఆర్ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయన్నారు. బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని తెలిపారు.