Hyderabad Liberation Day on September 17: ఓ వైపు అమిత్‌షా పర్యటన మరోవైపు లోక్‌సభ ఎన్నికలు ఇలాంటి టైంలోనే కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎప్పటి నుంచో వివాదానికి కారణమవుతున్న సెప్టెంబర్‌ 17ను అధికారికం చేసింది. ఇకపై ఆ రోజును "హైదరాబాద్‌ లిబరేషన్ డే"గా నిర్వహించాలని కేంద్రం గెజిట్‌ జారీ చేసింది.  


సెప్టెంబర్‌ 17న అధికారిక కార్యక్రమాలు నిర్వహించాలని దీన్ని స్వేచ్ఛకు గుర్తుగా ప్రజలను భాగస్వాములను చేయాలని ఎప్పటి నుంచో బీజేపీతోపాటు చాలా వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే దీన్ని ఒక్కొక్కరు ఒక్కో విధంగా జరుపుకుంటూ వచ్చారు. ఏ పార్టీకి నచ్చినట్టు ఆ పార్టీ దీనికో పేరు పెట్టుకొని వేడుకలు చేస్తుంటాయి. కొందరు విమోచన దినోత్సవం అంటే.. మరికొందరు విలీన దినోత్సవం అంటారు. ఇంకొందరు విద్రహో దినంగా అభివర్ణిస్తుంటారు. 


దీనికి అధికారికంగా ఒక పేరు లేకపోవడంతో ఎవరికి నచ్చినట్టు వాళ్లు వేడుకలు చేసుకుంటూ వచ్చారు. ఉద్యమ టైంలో సెప్టెంబర్ 17ను అధికారిక కార్యక్రమంగా నిర్వహిస్తామని చెప్పింది. అధికారంలోకి వచ్చిన తర్వాత పదేళ్ల పాటు దాని ప్రస్తావనే తీసుకురాలేదు. పార్టీ పరంగా కార్యక్రమాలు చేయడం తప్ప అధికారికంగా ఎలాంటి వేడుకలు నిర్వహించలేదు.


మొత్తానికి ఇన్ని చర్చలు, అంతకంటే అభ్యంతరాల మధ్య దీన్ని కేంద్రం గెజిట్‌లో చేర్చింది. రాష్ట్ర ప్రభుత్వ సూచన మేరకు ఇకపై సెప్టెంబర్‌ 17 అధికారిక కార్యక్రమంగా నిర్వహించాలని పేర్కొంది. "హైదరాబాద్‌ లిబరేషన్ డే"గా పిలవాలని అధికారికంగా గెజిట్‌ తీసుకొచ్చారు. గెజిట్‌లో ఏముంది అంటే...."భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన 1947 ఆగస్టు 15న హైదరాబాద్‌కు స్వాతంత్ర్యం రాలేదు. 13 నెలల పాటు నిజాం పాలనలో ఉండేది. ఆపరేషన్ పోలో కారణంగా 17 సెప్టెంబర్‌ 1948న నిజాం పాలన నుంచి స్వాతంత్ర్యం లభించింది.


అందుకే సెప్టెంబర్‌ 17ను హైదరాబాద్ లిబరేషన్ డేగా నిర్వహించాలని ఎప్పటి నుంచో ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అందుకే అమరుల త్యాగలను, దేశభక్తిని యువతరానికి తెలియజేసేందుకు ఏటా ఇకపై హైదరాబాద్‌ లిబరేషన్ డేగా సెలబ్రేట్‌ చేసుకోవాలని కేంద్రం నిర్ణయించింది." అని గెజిట్‌ విడుదల చేసింది.