Paddy Procurement in Telangana: హైదరాబాద్: తెలంగాణ నుంచి పారాబాయిల్డ్ బియ్యం సేకరణకు కేంద్రం ఆమోదం తెలిపింది. కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు విడుదల చేయడంతో కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార మరియు పౌర సరఫరాల శాఖ మంత్రి పీయుష్ గోయల్‌కు కిషన్ రెడ్డి (Kishan Reddy) ధన్యవాదాలు తెలిపారు. 2023-24 ఖరీఫ్ తో పాటు రబీ సీజన్ లకు సంబంధించి తెలంగాణ నుంచి 30 లక్షల మెట్రిక్ టన్నుల పారాబాయిల్డ్ రైస్ సేకరించేందుకు కేంద్రం ఆమోదం తెలిపింది. రాష్ట్రం నుంచి అంత మొత్తంలో బియ్యం సేకరణకు ఆమోదం తెలిపిన కేంద్రానికి కిషన్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.
తెలంగాణ రైతులకు ఎంతో మేలు
పారాబాయిల్డ్ బియ్యం సేకరణకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కారణంగా తెలంగాణ రైతులకు ఎంతో మేలు కలుగుతుందని కిషన్ రెడ్డి అన్నారు. కనుక రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతుల నుంచి వరిధాన్యాన్ని వెంటనే సేకరించాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం హామీగా ఇచ్చిన హామీ మేరకు కనీస మద్దతు ధరతో పాటు రూ. 500 బోనస్ ను చెల్లించి రైతుల నుంచి బియ్యం సేకరించాలని సూచించారు. రైతులకు లబ్ధి చేకూరేందుకు వీలున్న అన్ని మార్గాల్లో కేంద్ర ప్రభుత్వం తనవంతు కృషిచేస్తోందని కిషన్ రెడ్డి తెలిపారు.
పెరుగుతున్న ఎరువుల ఖర్చుల భారం రైతులపై పడకుండా కేంద్రమే భరిస్తుందన్నారు. ఈ ఏడాదికి ఎరువుల రాయితీ 500 శాతం పెరిగింది. యూరియా బస్తాపై కేంద్రం రూ. 1470 సబ్సిడీ ఇస్తోందని తెలిపారు. అంతర్జాతీయంగా ఎరువుల రెట్లు పెరిగిన మోదీ ప్రభుత్వం మాత్రం ఎరువుల రెట్లు పెంచకుండా సబ్సిడీలో తక్కువ ధరకే రైతులకు ఎరువులను అందిస్తుందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.