వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ నుంచి విచారణ ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరుగుతోంది. అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ ఇవ్వవద్దని సీబీఐ కోరింది. ఆయన్ను ఇంకా ప్రశ్నించాలని వాదించింది. గతంలో అవినాష్ రెడ్డి నాలుగు సార్లు ప్రశ్నించగా, అందుకు ఆయన సహకరించలేదని సీబీఐ తరపు న్యాయవాదులు తెలిపారు. కాబట్టి, అవినాష్‌ రెడ్డి నుంచి మరింత సమాచారం సేకరించాల్సి ఉందని, ఆయనకు ముందస్తు బెయిల్‌ ఇవ్వవద్దని కోర్టును కోరారు. 


వివేకా హత్య జరిగిన రోజు ఉదయం అవినాష్‌ రెడ్డి జమ్మలమడుగుకు దగ్గర్లో తాను ఉన్నట్లు చెప్పారు. కానీ, మొబైల్‌ సిగ్నల్స్‌ చూస్తే ఆయన తన ఇంట్లోనే ఉన్నట్లు తెలుస్తోంది. ఆ రాత్రంతా తన ఫోన్‌ను ఎక్కువగా వినియోగించినట్లు సాంకేతికంగా గుర్తించామని కోర్టుకు చెప్పారు. వివేకా హత్య కుట్ర అవినాష్‌ రెడ్డికి ముందే తెలుసని చెప్పారు. విచారణలో శాస్త్రీయ, సాంకేతిక ఆధారాలను తాము సేకరించామని, అసలు వివేకా హత్యను గుండెపోటుగా ఎందుకు చెప్పాలనుకున్నారో తెలియాలని కోర్టులో వాదనలు వినిపించారు. అనంతరం కోర్టు విచారణను మధ్యాహ్నం 2.30 గంటలకు వాయిదా వేసింది.