వివేక హత్య కేసులో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై వరుసగా రెండో రోజు తెలంగాణ హైకోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. శుక్రవారం సుదీర్ఘంగా అవినాష్ రెడ్డి న్యాయవాది, సునీత తరఫున న్యాయవాది వాదనలు వినించారు. ఇవాళ సీబీఐ తరఫున న్యాయవాది వాదనలు వినిపిస్తున్నారు.
ఈ కేసులో జాప్యం చేసి లబ్ది పొందాలని అవినాష్ రెడ్డి చూస్తున్నారని సీబీఐ తరఫు న్యాయవాది వాదించారు. విచారణకు పిలిచినప్పుడల్లా ఏదో కారణంతో గైర్హాజరు అవుతున్నారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారని సీబీఐ తరఫున ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ అనిల్ వాదనలు వినిపించారు.
వివేక హత్య కేసు విచారణకు అవినాష్ రెడ్డి అసలు సహకరించడం లేదని దర్యాప్తులో మొదటి నుంచీ అడుగడుగునా అడ్డుకుంటున్నారని వాదించింది సీబీఐ. దర్యాప్తును ఓ పద్దతి ప్రకారం చేస్తున్నామని వివరించారు. విచారణ అవినాష్‌కు నచ్చినట్టు చేయబోమన్నారు. ఇప్పటి వరకు చాలా మందిని విచారించామన్న సీబీఐ కొందర్ని అరెస్టు చేసినట్టు పేర్కొంది. కానీ అవినాష్ రెడ్డి మొదటి నుంచి విచారణకు సహకరించడం లేదని మిగతావారికి లేని ప్రత్యేకత అవినాష్‌కు ఎందుకని ప్రశ్నించాుర.
సాధారణ కేసుల్లో ఇంత సమయం తీసుకుంటారా అని ప్రశ్నించారు వెకేషన్ బెంచ్ న్యాయమూర్తి జస్టిస్ లక్ష్మణ్. వివేక హత్య కేసులో చాలా కారణాలు తెరపైకి వస్తున్నాయని. అసలు ప్రధాన కారణమేంటని ప్రశ్నించారు. దీనికి సమాధానంగా సీబీఐ తరఫు న్యాయవాది వాదిస్తూ రాజకీయ ఉద్దేశాలే ఈ హత్యకు ప్రధాన కారణమని తేల్చారు. హత్యకు నెలరోజుల ముందు నుంచే కుట్ర ప్రారంభమైందన్నారు.
అవినాష్ రెడ్డి తరపు లాయర్లు ఏమని వాదించారంటే ?
ఫోన్ కాల్స్ ఆధారంగా అవినాష్ రెడ్డిని కేసులో ఇరికించాలని చూస్తున్నారని ఆయన తరపు లాయర్లు వాదించారు. వివేకానందరెడ్డిది హత్యో, గుండెపోటో చెప్పడానికి అవినాష్ రెడ్డి లాయరో, డాక్టరో కాదన్నారు. 2020 జులై 9న సీబీఐ FIR నమోదు చేసి 2021 జులై 21న రంగన్నను సీబీఐ విచారించిందని అవినాష్ రెడ్డి లాయర్ కోర్టుకు తెలిపారు. రంగన్న స్టేట్‌మెంట్ రికార్డు చేసి సంవత్సరం పాటు వదిలేశారని, స్టేట్‌మెంట్‌లో క్లియర్‌గా నలుగురి వివరాలు చెప్పాడని అవినాష్ లాయర్ అన్నారు. కానీ సీబీఐ నెలరోజుల పాటు దస్తగిరిని విచారణకు పిలవలేదని, దస్తగిరిని ఒక్కసారి కూడా అరెస్ట్ చేయలేదని అవినాష్ లాయర్ వాదించారు. మున్నా దగ్గర డబ్బు దొరికినా ఛార్జ్‌షీట్‌లో సాక్షిగా పేర్కొనలేదని, దస్తగిరి స్టేట్‌మెంట్‌లో అవినాష్ పేరు ఎక్కడైనా చెప్పాడా? అని జడ్జి ప్రశ్నించారు. దస్తగిరి దగ్గర 3 సార్లు 161 కింద సీబీఐ స్టేట్‌మెంట్ తీసుకుందని, మొదటి స్టేట్‌మెంట్‌లో ఎక్కడ అవినాష్ గురించి చెప్పలేదని అవినాష్ లాయర్ చెప్పారు. చివరి స్టేట్‌మెంట్‌లో గంగిరెడ్డి తనతో చెప్పిన వ్యాఖ్యలలో అవినాష్ తమ వెనుకాల ఉన్నాడని చెప్పినట్టు స్టేట్‌మెంట్ ఇచ్చారని లాయర్ పేర్కొన్నారు.
వివేకా గుండె పోటుతో చనిపోయాడని చెప్పారని, రక్తపు వాంతులతో మృతి చెందినట్లు చెప్పారని, హత్య జరిగితే.. గుండె పోటు అని ఎలా చెపుతారని సునీతారెడ్డి తరుపు న్యాయవాది వాదించారు. ఇందులో కుట్ర దాగి ఉందని, రాజారెడ్డి, గంగి రెడ్డి హాస్పిటల్ నుంచి వచ్చి కుట్లు వేశారని న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. ఈ ప్రక్రియ జరిగేటప్పుడు అవినాష్ రెడ్డి, కృష్ణారెడ్డి, గంగిరెడ్డి, శంకర్ రెడ్డి, మనోహర్ రెడ్డి తదితరులు ఉన్నారని సునీతారెడ్డి తరుపు న్యాయవాది రవిచంద్ వాదించారు. దాదాపుగా గంట సేపు సునతారెడ్డి తరపు లాయర్.. న్యాయమూర్తికి తన వాదనలు వినిపించారు.