KTR at Telangana Bhavan: పేద ప్రజల కోసం బీఆర్ఎస్ హయాంలో ప్రారంభించిన సంక్షేమ కార్యక్రమాలను కాంగ్రెస్ పార్టీ (Congress Party) రద్దు చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎండగడతామన్నారు భారత రాష్ట్ర సమితి (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. ప్రధాన ప్రతిపక్షంగా తమ బాధ్యత నిర్వహిస్తామని రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరికలు పంపారు. 50 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ గతంలో ఎన్నడూ కూడా పేద ప్రజల కోసం విప్లవాత్మకమైన, వినూత్నమైన కార్యక్రమాలను అమలు చేసేందుకు కూడా ఆలోచన చేయలేదన్నారు. 
మా పథకాలు ఆపొద్దు.. ప్రభుత్వానికి కేటీఆర్ అల్టిమేటం
బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించిన దళిత బంధు, గృహలక్ష్మి, బీసీ బందు, గొర్రెల పంపిణీ వంటి కార్యక్రమాలను అమలు చేసిందన్నారు. కానీ ఈ పథకాల అమలును నిలిపివేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపించారు. దశాబ్దాల పాటు కాంగ్రెస్ పాలనలో అభివృద్ధికి నోచుకోలేని దళిత కుటుంబాల అభివృద్ధి కోసం దేశంలో ఎక్కడా లేని విధంగా దళిత బంధు కార్యక్రమాన్ని సీఎంగా కేసీఆర్ ప్రారంభించారన్నారు. దళితులను కాంగ్రెస్ కేవలం ఒటు బ్యాంకుగా చూసిందని, వారి ఓట్ల కోసం ఎన్నికల సందర్భంగా దళిత బంధును 10 లక్షల నుంచి 12 లక్షలకు పెంచుతామని హామీ ఇచ్చిందన్నారు. కానీ అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ పార్టీ దాన్ని మరిచిపోయిందన్నారు. ఇప్పటికే బీఆర్‌ఎస్ ఎంపిక చేసిన దళిత బంధు లబ్ధిదారులను ఇబ్బందులకు గురిచేస్తుందని విమర్శించారు. 
దళిత బంధు ఖాతాలను ఫ్రీజ్ చేస్తోందని ఆరోపణలు
దళిత బంధు లబ్ధిదారులు నగదు జమ కోసం తెరిచిన బ్యాంకు అకౌంట్లను కాంగ్రెస్ ప్రభుత్వం ఫ్రీజ్ చేస్తుందని కేటీఆర్ ఆరోపించారు. మరోవైపు గొర్రెల పంపిణీ కోసం తమ వాటాలుగా డీడీలు కట్టిన వారిని పట్టించుకోవడం లేదన్నారు. గృహలక్ష్మి పథకం కింద నియోజకవర్గానికి మూడు వేల మందిని ఎంపిక చేయగా.. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని రద్దు చేసిందని కేటీఆర్ మండిపడ్డారు. ఈ విధంగా పేదలు, దళితులు, బీసీల ప్రయోజనాలను దెబ్బకొట్టేలా కాంగ్రెస్ పార్టీ కుట్రలు చేస్తూ పోతే ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ బాధితులకు అండగా నిలిచి పోరాడుతుందన్నారు.


ఎన్నికల్లో గెలిచేందుకు అడ్డగోలుగా వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు శ్వేత పత్రాలు, అప్పుల పేరుతో నాటకాలు ఆడుతుందని కేటీఆర్ విమర్శించారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అసెంబ్లీ సభసాక్షిగా నిరుద్యోగ భృతికి కాంగ్రెస్ హామీ ఇవ్వలేదని అబద్ధాలు చెప్పారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో కాంగ్రెస్ 420 హామీలు ఇచ్చి.. ఈరోజు కేవలం 6 గ్యారెంటీ ల పేరుతో తప్పించుకోవాలని చూస్తూ.. ఊరుకునేదే లేదని కేటీఆర్ హెచ్చరించారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చేలా ప్రభుత్వంపై బీఆర్ఎస్ ఒత్తిడి తీసుకువస్తుందని తమ వ్యూహాలను కేటీఆర్ వెల్లడించారు.  


గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎలాంటి లైన్లలో నిలబెట్టకుండానే ప్రజలకు అన్ని రకాల సంక్షేమ పథకాలను వారి ఇంటికి అందించామన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఒక్క ప్రభుత్వ పథకానికి ప్రజలందరినీ లైన్లలో నిల్చోబెట్టి ఇబ్బందులకు గురి చేస్తుందని విమర్శించారు. క్యూ లైన్లో నిల్చోబెట్టడంతో పాటు వారిని తమ రాజకీయాల కోసం వాడుకుంటారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అస్థవ్యస్థ పనితీరు, పరిపాలనను ఎప్పటికప్పుడు ఎండగట్టేలా పార్టీ శ్రేణులు క్షేత్రస్థాయిలో పనిచేస్తాయని తెలిపారు. తెలంగాణ భవన్లో సోమవారం జరిగిన నిజామాబాద్ లోక్ సభ సన్నాహక సమావేశంలో పార్టీ శ్రేణులను ఉద్దేశించి కేటీఆర్ ప్రసంగించారు.