Telangana Elections 2024: పార్లమెంటు ఎన్నికల కోసం మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇకపై జనంలోకి రానున్న సంగతి తెలిసిందే. ఇన్నాళ్లు బహిరంగ సభలతోనే సరిపెట్టిన ఆయన.. ఇప్పుడు పార్టీ గ్రాఫ్ కాస్త తగ్గడంతో దాన్ని పెంచడం కోసం నేరుగా జనాల మధ్యలోకి వస్తున్నారు. తెలంగాణలో జనాల మధ్యలో తిరగడం కోసం ఆయన బ‌స్సు యాత్రకు రెడీ అయ్యారు. బుధ‌వారం (ఏప్రిల్ 24) ఉద‌యం నుంచి బస్సు యాత్ర ప్రారంభం కానుంది. తెలంగాణ భ‌వ‌న్ నుంచి మొదలయ్యే ఈ యాత్ర తెలంగాణలోని వివిధ ప్రాంతాల గుండా ముందుకు సాగుతుంది. 


ఇందుకోసం తెలంగాణ భ‌వ‌న్‌లో మంగళవారమే (ఏప్రిల్ 23) గులాబీ ర‌థానికి ప్రత్యేక పూజ‌లు చేయించారు. అయితే, బస్సు యాత్ర కోసం బీఆర్ఎస్ పార్టీ ఓ పవర్ ఫుల్ ట్రైలర్ ను కూడా వదిలింది. ఈ ట్రైల‌ర్ ను పూర్తిగా ఖలేజా సినిమాలోని డైలాగ్ లతో రూపొందించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మోసాల‌ వల్ల రైతులు బాగా గోస అనుభవిస్తున్నారని.. ఎంతో మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆ ట్రైలర్ లో చూపించారు. కేసీఆర్ హ‌యాంలో జ‌రిగిన అభివృద్ధిని కూడా ఆ ట్రైలర్ లో చూపించారు. ఇటీవ‌ల కేసీఆర్ మాట్లాడిన మాట‌ల‌ను కూడా ఈ ట్రైల‌ర్‌లో చూపించారు.









రైతుబంధు, 24 గంట‌ల ఫ్రీ క‌రెంట్ వ‌ల్ల తెలంగాణ రైతాంగానికి గుండె ధైర్యం వ‌చ్చింది. నిల‌బ‌డతామ‌ని రైతులు అనుకుంటుండగానే.. మూడు నెల‌ల్లోనే మళ్లీ పాత పరిస్థితి వచ్చిందని కేసీఆర్ అన్నారు. పంట‌లు ఎండ‌బెట్టే ప‌రిస్థితి చూస్తుంటే తన క‌ళ్లల్లో కూడా నీళ్లు వ‌స్తున్నాయ‌ని కేసీఆర్ ఇటీవల ఓ సభలో మాట్లాడిన మాటలను కూడా ట్రైలర్ లో చూపించారు.


‘‘ఒక్క మాసంలో 20 మంది చనిపోయారు. అయ్య పోయాడు.. ఈ ఊరికి ఏదో తెగులు తగిలింది సామీ.. ఎందుకయ్యా ఇంత మంది సచ్చిపోతున్నరు. బిడ్డలు సచ్చిపోతున్నరు. ఏడ్చి ఏడ్చి కన్నీళ్లు ఇంకిపోతున్నాయి. ఊరు వల్లకాడ కావాల్సిందేనా? ఏం చేయలేమా?’’ అంటూ ఖలేజా సినిమా డైలాగ్‌లతో ఈ ట్రైలర్ ను రూపొందించారు.






బస్సు యాత్ర కోసం మరో పాట కూడా విడుదల


‘‘గడప గడపలోనా నీ పేరు రాసుకున్నవే.. కడుపుల పెట్టుకోని మమ్ముల చూసుకున్నవే.. మాకెంత గోస వచ్చే ఏదోటి చేయవే.. అమ్మలాంటి ఆలన నీది అయ్యా కేసీఆరు.. నమ్మలేకపోతోంది నీ పాలన లేదంటే ఊరు..’’ అంటూ బీఆర్ఎస్ పార్టీ మరో పాటను కూడా విడుదల చేసింది.