కర్ణాటక ఎన్నికల వైపు దేశమంతా చూస్తోంది. ఇప్పటికే అక్కడ ప్రభుత్వాని ఏర్పాటు చేసి పాలిస్తున్న బీజేపీ గెలుస్తుందా... లేకుంటే ప్రజలు మార్పు కోరుకుంటారా అనే ఆసక్తి అందరిలోనూ కనిపిస్తోంది. ఇవాళ జరుగుతున్న పోలింగ్‌లో ప్రజలు తమ అభిప్రాయాన్ని ఈవీఎంలలో ఉంచుతున్నారు.
కర్ణాటకలో పోలింగ్ జరుగుతున్న వేళ బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. డియర్ కర్ణాటక విద్వేషాన్ని తిరస్కరించు అంటూ పిలుపునిస్తూనే.. ప్రజలతోపాటు సమాజాభివృద్ధి, శ్రేయస్సు, సంక్షేమానికి ఓటు వేయాలని పిలుపునిచ్చారు.
ప్రజాస్వామ్య పండుగను సుసంపన్నం చేయాలన్న మోదీ
కర్ణాటక ప్రజలు, ముఖ్యంగా యువత, మొదటిసారి ఓటు హక్కు వినియోగించుకున్న వారు పెద్ద సంఖ్యలో ఓటు వేసి ప్రజాస్వామ్య పండుగను సుసంపన్నం చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ కర్ణాటక ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
కర్ణాటక మరింత అభివృద్ధి కోసం ఓటు వేయాలన్న అమిత్ షా
ఓటు వేసే ముందు రాష్ట్రం అభివృద్ధి గురించి ఆలోచించి ఓటు వేయాలని హోంమంత్రి అమిత్ షా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో సుపరిపాలన, అభివృద్ధి, శ్రేయస్సు కోసం పెద్ద సంఖ్యలో ఓటు వేయాలని కోరారు. మీ ఒక్క ఓటు రాష్ట్రాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్లే ప్రజా అనుకూల, ప్రగతి అనుకూల ప్రభుత్వాన్ని నిర్ధారిస్తుందన్నారు.
ప్రగతిశీల కర్ణాటకను నిర్మించండి: రాహుల్
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ట్వీట్ చేస్తూ.. మహిళల హక్కుల కోసం, యువత ఉపాధి కోసం, పేదల అభ్యున్నతి కోసం ఓటు వేయాలన్నారు. రండి, పెద్ద సంఖ్యలో తరలి వచ్చి ఓటు వేయండి అని పిలుపునిచ్చారు. అంతా కలిసి '40% కమీషన్'రహిత, ప్రగతిశీల కర్ణాటకను నిర్మించండి అని సూచించారు.
రాష్ట్ర ప్రగతిని కొనసాగిస్తాం: జేపీ నడ్డా
కర్ణాటక ఓటర్లందరూ ప్రజాస్వామ్య పండుగలో అత్యధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా. ఈ ఎన్నికలు కర్ణాటక భవిష్యత్తును నిర్ణయించడంలో ముఖ్యమైనవి, రాష్ట్ర ప్రగతి కొనసాగించే, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి కట్టుబడి ఉన్న ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను అని ట్వీట్ చేశారు.
మతతత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా ఓటు వేయాలని ప్రకాశ్ రాజ్ పిలుపు
ఓటు వేసిన అనంతరం నటుడు ప్రకాశ్ రాజ్ మాట్లాడుతూ.. మతతత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా ఓటు వేయాలన్నారు. కర్ణాటకను సుందరంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.