Kavitha reached at Shamshabad Airport from Delhi | హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. తన భర్త అనిల్, కుమారుడు, సోదరుడు కేటీఆర్ సహా బీఆర్ఎస్ నేతలతో కలిసి ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరిన కవిత శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయ్యారు. శంషాబాద్ చేరుకున్న కవితకు బీఆర్ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. దాదాపు ఐదు నెలల తరువాత కవిత హైదరాబాద్ కు వచ్చారు. అక్కడి నుంచి బంజారాహిల్స్ లోని తన నివాసానికి భర్తతో పాటు కవిత, కేటీఆర్, బీఆర్ఎస్ నేతలు బయలుదేరారు.
కవిత రాక సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు హైదరాబాద్ నుంచి ఎయిర్ పోర్ట్ మార్గంలో ఘన స్వాగతం పలుకుతూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. బెయిర్ రావడంతో కవిత 165 రోజుల తరువాత హైదరాబాద్ కు తిరిగొచ్చారు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి బంజారాహిల్స్ నివాసానికి 500 కార్లతో భారీ ర్యాలీగా బయలుదేరనున్నారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరెస్టై తిహార్ జైలులో ఉన్న కవితకు సుప్రీంకోర్టు మంగళవారం బెయిల్ మంజూరు చేసింది. కోర్టు ఉత్తర్వుల ఆర్డర్ అందిన తరువాత, పూచీకత్తు సమర్పించిన అనంతరం రాత్రి 9 గంటల ప్రాంతంలో కవిత తిహార్ జైలు నుంచి విడుదలయ్యారు.
రాత్రి ఢిల్లీలోని వసంత్ విహార్‌లోని పార్టీ ఆఫీసులో కవిత, ఆమె భర్త అనిల్, సోదరుడు కేటీఆర్ సహా బీఆర్ఎస్ నేతలు బస చేశారు. బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు రౌస్ అవెన్యూ కోర్టులో ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసుపై సీబీఐచార్జ్ షీట్ పై వర్చువల్ గా విచారణకు హాజరయ్యారు. అనంతరం ఢిల్లీ ఎయిర్ పోర్టుకు చేరుకుని ప్రత్యేక విమానంలో బయలుదేరి శంషాబాద్ చేరుకోగా, పార్టీ శ్రేణులు ఆమెను గ్రాండ్ గా రిసీవ్ చేసుకున్నాయి. తనను పలకరిస్తున్న వారికి అభివాదం చేస్తూ ఆమె ముందుకుసాగారు.
కవిత రాక గురించి తెలిసిన బీఆర్ఎస్ నేతలు, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఎయిర్ పోర్టుకు తరలి రావడంతో అక్కడ పండుగ వాతావరణం కనిపించింది. ఐదు నెలల తరువాత హైదరాబాద్ కు తిరిగొచ్చిన కవితకు పెద్ద ఎత్తున రెస్పాన్స్ వచ్చింది. బీఆర్ఎస్ శ్రేణులు కవితపై పూలవర్షం కురిపించారు. కవిత జై తెలంగాణ అని పిడిగిలి బిగించి నినాదాలు చేశారు. బెయిల్ వచ్చి కవిత రాష్ట్రానికి తిరిగి రావడంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో నూతనోత్సాహం కనిపించింది. కేసీఆర్ ఆట మొదలైందని పార్టీ శ్రేణులు కొందరు అంటుంటే, న్యాయం గెలిచిందని.. కానీ కాస్త ఆలస్యమైందని సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు.
Also Read: Kavitha Bail: కవిత బెయిల్ పై బీజేపీ, కాంగ్రెస్ ల పొలిటికల్ వార్ వెనుక కథ ఇదేనా?