Telangana News: తెలంగాణ చాప్టర్ క్లోజ్ అయిపోయిందనుకున్న టీడీపీకి మరోసారి గేర్ మార్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందుకు ఇవాళ జరిగే ఓ సమావేశం చాలా ఆసక్తిని రేకెత్తిస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబుతో కొందరు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు భేటీ కావచ్చని సమాచారం అందుతోంది. ఎమ్మెల్యేలు మల్లారెడ్డి రాజశేఖర్‌రెడ్డి, కృష్ణారావు, మాజీ ఎమ్మెల్యే  తీగల కృష్ణారెడ్డి చంద్రబాబుతో సమావేశం కానున్నారని టాక్ నడుస్తోంది. 


2014 ఎన్నికల్లో మంచి స్థానాలు సంపాదించుకున్న టీడీపీ తర్వాత లీడర్లు పార్టీ మారడంతో బలహీనపడుతూ వచ్చింది 2018 ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తుపెట్టుకొని ప్రజల్లోకి వెళ్లింది. అయితే రెండు స్థానాలు మాత్రమే గెలుచుకుంది. తర్వాత పూర్తిగా బలహీన పడిపోయింది. 2023 ఎన్నికల్లో కీలకమైన వ్యక్తులు పార్టీకి రాజీనామా చేసి బీఆర్‌ఎస్‌లో చేరడంతో పోటీ చేయకూడదని నిర్ణయించుకుంది. అప్పటికే చంద్రబాబు అరెస్టు కావడం ఈ నిర్ణయానికి ఓ కారణంగా చెబుతారు. 


ఇప్పుడు పార్టీని బలోపేతం చేసే దిశగా చంద్రబాబు పావులు కదుపుతున్నట్టు చెబుతున్నారు. ఇప్పటికే పలుమార్లు తెలంగాణ తెలుగుదేశం నేతలతో చంద్రబాబు సమావేశమయ్యారు. పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలు గురించి ఆలోచించారు. ఆంధ్రప్రదేశ్‌లో కూడా అధికారంలో ఉండటం ఒక ప్లస్ అయితే... కేంద్రంలో బీజేపీ అండగా ఉండటం మరో ప్లస్. అందుకే తెలంగాణలో పార్టీని బలోపేతం చేయాలని నిర్ణయానికి వచ్చారు. 


రాష్ట్రవిభజన సమయంలో తెలంగాణ వాదంతో చాలా మంది టీడీపీ లీడర్లు బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌, బీజేపీలో చేరిపోయారు. 2014లో బీఆర్‌ఎస్‌ అధికారం చేపట్టిన తర్వాత తెలంగాణ టీడీపీని పూర్తిగా వీక్ చేయాలనే సంకల్పంతో చాలా మంది నేతలను లాక్కుంది. ఆర్థికంగా, సామాజిక పరంగా బలంగా ఉన్న నేతలంతా పార్టీని విడిచి పెట్టి వెళ్లిపోయారు. పార్టీకి భవిష్యత్ లేదని విమర్శలు కూడా చేశారు. 


2019 వరకు ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉండటంతో పార్టీని కాస్త కాపాడుకుంటూ వచ్చారు చంద్రబాబు. ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్‌లో అధికారం కోల్పోయారో పార్టీ వేగంగా బలహీనపడుతూ వచ్చింది. అసలు ప్రెస్‌మీట్లు పెట్టి ప్రత్యర్థులు చేస్తున్న రాజకీయ ఎత్తుగడలను, విమర్శలను ఖండించే పరిస్థితి కూడా లేకుండా పోయింది. ఒకరిద్దరు తప్ప చెప్పుకోదగ్గ లీడర్లు మాత్రం ఇప్పటికీ లేరు. 


పార్టీ కష్టాల్లో ఉన్న టైంలో కాసాని జ్ఞానేశ్వర్‌ వచ్చి పార్టీలో చేరారు. బీసీ కార్డుతో ఆయన పార్టీ బలోపేతానికి శ్రమిస్తారనుకుంటే 2023 ఎన్నికల నాటికి ఆయన కూడా పార్టీకి షాక్ ఇచ్చి కేసీఆర్‌తో చేతులు కలిపారు. కారులో ప్రయాణించారు. అదే టైంలో చంద్రబాబు జైల్లో ఉండటం వల్ల పార్టీకి పెద్ద దిక్కు లేకుండా పోయింది. బాలకృష్ణ లాంటి వాళ్లు నేతలతో మాట్లాడి ఎన్నికల కోసం సిద్ధం కావాలని చెప్పారు. కొన్ని రోజులకే ఆ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ప్రకటించి సంచలనం సృష్టించింది.


ఎన్నికల్లో పోటీ చేయకపోవడంతో అనేక విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ టీడీపీ అధినాయకత్వం వాటిని సమర్థంగా తిప్పికొట్టింది. అదే టైంలో కాంగ్రెస్ విజయం సాధించడం, బీఆర్‌ఎస్ ఓటమిపాలవడంతో టీడీపీకి ఊరట లభించినట్టైంది. మరోవైపు ఏపీలో కూడా ఘనవిజయం తెలంగాణలోని టీడీపీ నాయకలకు వెయ్యి ఏనుగుల బలాన్ని ఇచ్చింది. ఫలితంగా ఇక్కడ కూడా  బలపడేందుకు అవకాశాలు లేకపోలేదనే ఆశ వారిలో పుట్టింది. దీనికి తోడు చంద్రబాబు తరచూ వచ్చి వారితో మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలు చర్చించడం తెలంగాణ నేతల ఆశలు చిగురిస్తున్నాయి. 


ఇవన్నీ ఒక ఎత్తు అయితే బీఆర్‌ఎస్‌కు చెందిన కీలక నేతలు వచ్చి తరచూ చంద్రబాబును కలవడంతోపాటు పార్టీలో చేరుతామని ఉత్సాహాన్ని చూపించడం పార్టీ భవిష్యత్‌పై మళ్లీ పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. బీఆర్‌ఎస్‌ ఉంటూ ఉక్కపోతకు గురవుతున్న వాళ్లు కాంగ్రెస్‌లోకి వెళ్లలేక బీజేపీ వైపు చూడలేని వాళ్లకు టీడీపీ షెల్టర్ కానుంది. ఆ పార్టీకి వెళ్తే కాంగ్రెస్, బీజేపీ దాడి నుంచి సురక్షితంగా బయటపడొచ్చనే ఆలోచనలో చాలా మంది ఉన్నారని తెలుస్తోంది