Innovative protest against mosquito problem:  హైదరాబాద్ నగరంలో దోమల జోరు ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి బిఆర్ఎస్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి  వినూత్నమైన పంథాను ఎంచుకున్నారు.  సాధారణంగా నేతలు ప్లకార్డులతోనో, నినాదాలతోనో నిరసన తెలుపుతారు. కానీ, సుధీర్ రెడ్డి మాత్రం ఏకంగా  దోమతెర డ్రెస్‌ వేసుకొని అసెంబ్లీ మీడియా హాల్‌కు రావడంతో అందరూ ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఆయన ఆహార్యం చూస్తుంటే, నగరంలో దోమల దాడి నుంచి తప్పించుకోవడానికి సామాన్యుడు యుద్ధానికి సిద్ధమవ్వాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పకనే చెప్పారు.   

Continues below advertisement

ప్రెస్ మీట్‌లో ఆయన చేసిన వ్యాఖ్యలు మరింత ఆసక్తికరంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే.. మాట్లాడదామని నోరు తెరిస్తే చాలు, దోమలు లోపలికి దూరిపోతున్నాయి  అంటూ ఆయన వేసిన పంచ్‌లు నవ్వులు పూయించడమే కాకుండా, క్షేత్రస్థాయిలో ఉన్న తీవ్రతను కళ్ళకు కట్టాయి. ప్రజలు ఇకపై బట్టలకు బదులు ఇలా దోమతెరలే కుట్టించుకోవాల్సిన దుస్థితికి కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమని ఆయన మండిపడ్డారు.

Continues below advertisement

నగరం ఎదుర్కొంటున్న ఈ వింత ఇబ్బందికి పరిష్కారంగా.. ప్రతి డివిజన్‌కు కనీసం  10 ఫాగింగ్ మెషిన్లను  కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా, గల్లీ గల్లీలో దోమల నివారణ చర్యలు చేపట్టాలని కోరారు. లేదంటే భాగ్యనగర బ్రాండ్ ఇమేజ్ కాస్తా  దోమల నగరంగా మారిపోయే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు.

ఎల్బీనగర్‌లో దోమల సమస్య మరింత ఎక్కువ 

ఎల్బీనగర్ నియోజకవర్గంలో దోమల సమస్య ప్రస్తుతం పతాక స్థాయికి చేరింది. ముఖ్యంగా ఈ ప్రాంతంలోని మూసీ పరివాహక ప్రాంతాలు, మన్సూరాబాద్, బైరామల్ గూడ, హస్తినాపురం వంటి డివిజన్లలోని కాలనీలు దోమల దాడులతో అల్లాడిపోతున్నాయి. సమీపంలోని చెరువులు గుర్రపుడెక్కతో నిండిపోవడం, డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేకపోవడంతో సాయంత్రం 5 గంటలు దాటితే చాలు ఇళ్లలో ఉండలేని పరిస్థితి నెలకొంది. కాలనీ వాసులు ఎన్ని రకాల కాయిల్స్, లిక్విడ్లు వాడినా ఫలితం ఉండటం లేదని, మున్సిపల్ అధికారులు క్రమం తప్పకుండా ఫాగింగ్ చేయడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందుకే సుధీర్ రెడ్డి ఈ నిరసన చేపట్టారు.   సుధీర్ రెడ్డి చేసిన ఈ  నెట్ వర్క్ నిరసన సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దోమల సమస్యపై ఆయన చేసిన ఈ వెరైటీ యుద్ధం ప్రభుత్వంలో ఏ మేరకు కదలిక తెస్తుందో చూడాలి.