హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో, ముఖ్యంగా ప్రతిపక్షపార్టీ బీఆర్ఎస్ నిత్యం కేసులు, అరెస్ట్ లతో వార్తల్లోకెక్కుతున్న ఎమ్మెల్యే ఎవరంటే.. ముందుగా గుర్తొచ్చే పేరు పాడి కౌశిక్ రెడ్డి. హుజురాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే గత ఎన్నిల్లో గెలిచిన నాటి నుండి తాజా అరెస్ట్ వరకూ  ప్రతీ అరెస్ట్ ఓ వివాదమే. అధికార, ప్రతిపక్షాల మధ్య మినీ యుద్దమే అన్న పరిస్థితి నెలకొంది.

రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్  ప్రభుత్వం తెలంగాణలో అధికారం చేపట్టిన నాటి నుండి ఈ ఎమ్మెల్యేనే టార్గెట్ చేస్తోందాా, లేక కౌశిక్ రెడ్డి నోటి దురుసు,  దూకుడు చర్యలు కేసుల్లో చిక్కుకునేలా చేస్తున్నాయా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలింది. తాజాగా శంషాబాద్ విమానాశ్రయంలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని వరంగల్ సుబేదారి పోలీసులు అరెస్ట్ చేశారు. కమలాపూర్ మండలం, వంగపల్లిలో గ్రానైట్ వ్యాపారం నిర్వహిస్తున్న మనోజ్ రెడ్డి అనే వ్యక్తిని బెదిరించి 50 లక్షల రూపాయలు డిమాండ్ చేశాడంటూ వ్యాపారి భార్య ఉమాదేవి ఫిర్యాదుతో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై సెక్షన్ 308(4), 308(2), 352 సెక్షన్ల క్రింద కేసు నమోదు చేశారు. రోజంతా సాగిన ఉత్కంఠత తరువాత షరతులతో కూడిన బెయిల్ పై విడుదలైయ్యారు.

సంజయ్ తో బాహాబాహీ..

ఈ ఏడాది జనవరి 13వ తేదిన సైతం కౌశిక్ రెడ్డి అరెస్ట్ అయ్యారు.  అరెస్ట్ కు కారణం.. కరీంనగర్ కలెక్టరేట్ లో నిర్వహించిన ఓ సమావేశంలో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ తో కలసి హాజరైయ్యారు పాడి కౌశిక్ రెడ్డి. సంజయ్ ను రెచ్చగొట్టేలా కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య గొడవకు కారణమైంది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలోనే ఇద్దరూ బాహాబాహీకి దిగారు. తనపై కౌశిక్ రెడ్డి దాడిచేశాడంటూ  స్పీకర్ గడ్డం ప్రసాద్ కు సంజయ్ ఫిర్యాదుతో అరెస్ట్ వరకూ వెళ్లింది.

విధులకు ఆటంకం కలిగించారని..

ఈ ఘటనకు ముందు గత ఏడాది డిసెంబర్ 5వ తేది కౌశిక్ రెడ్డి మరోసారి అరెస్ట్ అయ్యారు. బంజారాహిల్స్ పోలీస్టేషన్ లో విధులకు ఆటంకం కలిగించాడంటూ సీఐ రాఘవేంద్ర ఫిర్యాదుతో  కౌశిక్ రెడ్డితోపాటు అతని అనుచరులు 20మందిపై కేసులు నమోదు చేశారు. మరుసటి రోజు కొండాపూర్ లోని అతని నివాసం వద్ద కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు. ఈ ఘటనలో 57, 126 (2), 132, 224,333,451(3), 191 (2) ఇలా వివిధ సెక్షన్ల క్రింద కేసు నమోదు చేశారు.

ఆంధ్రోడివి అంటూ వివాదస్పద వ్యాఖ్యలు

ఈ ఘటనకు రెండు నెలల ముందు శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకెపూడి గాంధీపై నువ్వు ఆంధ్రోడివి అంటూ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. గాంధీ ఫిర్యాదుతో రాయదుర్గం పోలీసులు కౌశిక్ రెడ్డిపై సెక్షన్ 132, 351 (2) బిఎన్ ఎస్ చట్టం క్రింద కేసునమోదు చేశారు. అదే రోజు గాంధీ ఇంటిని ముట్టడించేందకు కౌశిక్ రెడ్డి సిద్దమవ్వడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఇలా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టి ఏడాదిన్నరలోపే కౌశిక్ రెడ్డిపై ఎన్నో కేేసులు, వరుస అరెస్ట్ లతో వివాదాస్పద ఎమ్మెల్యేగా మారారు.

 

కౌశిక్ రెడ్డికి నోటి దురుసు అని, బెదింపులతో వసూళ్లకు పాల్పడుతున్న ఎమ్మెల్యేపై చట్టపరంగా చర్యలు తీసుకుంటే తప్పేంటని వరుస అరెస్ట్ లపై  కాంగ్రెస్ పార్టీ నేతలు స్పందిస్తున్నారు. కావాలనే కౌశిక్ రెడ్డిని టార్గెట్ చేసి, తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. శని, ఆదివారం సెలవు దినాల్లో అరెస్ట్ లు చేయోద్దని న్యాయస్థానం చెప్పినా, లెక్క చేయకుండా అరెస్ట్ లతో వేధించి దోషిగా చిత్రీకరించే పనిచేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలా ఎవరి ఆరోపణలు, విమర్శలు ఎలా ఉన్నా, నేనింతే అనే ధరోణిలో కౌశిక్ రెడ్డి దూసుకుపోతున్నారు. వరుస కేసులలో అరెస్ట్ అవుతున్నారు.