Musi River Development Plan: మూసీ నది ప్రక్షాళన  కేంద్రంగా తెలంగాణలో రాజకీయ విమర్శలు హీటెక్కుతున్నాయి. గురువారం మీడియాతో మాట్లాడిన సీఎం రేవంత్‌ రెడ్డి.. ఎప్పటికీ మూసీ చుట్టూ ప్రజలు రోగాలతో బతకాలా అని ప్రశ్నించారు. అసలు మూసీ ప్రక్షాళల ఎలా చేస్తారు... అక్కడ నిర్వాసితులకు ఏం చేయబోతున్నారో వివరిస్తూ పవర్‌ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. ప్రతిపక్షాలపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.


సీఎం రేవంత్ రెడ్డి కామెంట్స్‌పై బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు స్పందించారు. తెలంగాణ భవన్‌లో ప్రెస్‌మీట్‌ పెట్టిన ఆయన... రేవంత్‌ సవాల్‌కు ప్రతిసవాల్ చేశారు. సెక్యూరిటీ లేకుండా వస్తా అన్నావ్. పోదాం పదా అన్నారు. డేట్, టైం చెప్పండి, కారు డ్రైవింగ్ చేసుకుంటూ ఇద్దరమే పోదామన్నారు. లేదంటే శనివారం ఉదయం 9 గంటలకు సిద్ధంగా ఉంటామన్నారు. 


ముందు మూసి నిర్వాసితుల వద్దకు, ఆ తర్వాత ఆర్ అండ్ ఆర్ కాలనీ, మల్లన్న సాగర్, రంగనాయక సాగర్ కట్ట మీదకు పోదాం అన్నారు రేవంత్. అక్కడే కూర్చొని మాట్లాడుదాం అంటూ సవాల్ చేశారు. 2013 చట్టానికి మించిన ప్రయోజనాలు మల్లన్న సాగర్ ప్రజలకు బిఆర్ఎస్ పార్టీ ఇచ్చిందన్నారు హరీష్‌. అవేమీ చెప్పకుండా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. రేవంత్ యాక్టివిటీ నిర్మాణంతో మొదలు కాలేదని... విధ్వంసంతో మొదలైందని గుర్తు చేశారు. 


మూసీ నది పునరుజ్జీవనమే తప్ప సుందరీకరణ కాదని ముఖ్యమంత్రి చెప్పారు కానీ వీడియోల్లో అలా కనిపించడం లేదన్నారు హరీష్‌. విదేశీ కంపెనీ ఇచ్చిన వీడియో చూస్తే మాత్రం న్యూయార్ టైం స్క్వేర్‌ను మించిన వెలుగు జిలుగులు, సిడ్నీ ఒపెరా హౌజ్‌ను తలదన్నే హైరైజ్ బిల్డింగులు, లండన్‌లోని థేమ్స్ నది మీదున్న బ్రిడ్జిని మించిన బ్రిడ్జిలు పెట్టారని గుర్తు చేశారు. ప్రపంచం ఉన్న రివర్ ఫ్రంటులన్నీ ఒక్క దగ్గర వేసి ఏఐలో వేసి తీసినట్టున్న పంచవన్నెల దృశ్యాలను చూపించారని ఎద్దేవా చేశారు. 


నది పునరుజ్జీవనం అంటే సజీవంగా గలగలపారే స్వచ్ఛమైన జలాలు ఇవ్వడమని...మీరు చూపించే హైటెక్కులు, అద్దాల బిల్డింగులను సుందరీకరణ అంటారన్నారు. అద్దాల బిల్డింగులు ఉండవంటూనే ఎన్నెన్నో అందాలను చూపించారన్నారు. ముఖ్యమంత్రి మాట కరెక్టా? కాంట్రాక్టు తీసుకున్న కంపెనీల కన్సార్షియం చూపించింది కరెక్టా? అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి ఇచ్చిన ప్రజెంటేషన్‌లో రివర్ రెజునెవేషన్ అండ్ రివర్ ఫ్రంట్ అని ఉందన్న హరీష్‌... రివర్ రెజునెవేషన్ అంటే నదీ పునరుజ్జీవనమని అయితే మరి ఈ ఫ్రంట్ ఏంది దాని వెనుక దాగి ఉన్న స్టంట్ ఏందని నిలదీశారు. 


దమ్ముంటే మల్లన్న సాగర్ నిర్వాసితులకు ఇచ్చిన ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ మూసీ నిర్వాసితులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డే అక్రమంగా పేదల భూములు తీసుకున్నారని ఆరోపించారు. ఫోర్త్ సిటీ పేరుతో రియల్ ఎస్టేట్ చేస్తున్నారని విమర్శించారు. నల్లగొండ ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నల్లగొండ ప్రజల మీద నిజంగా ప్రేమ ఉంటే పారిశ్రామిక వ్యర్థాలు చెరువుల ద్వారా మూసీలో చేరకుండా చర్యలు తీసుకోవాలన్నారు. మూసీ పునరుజ్జీవనానికి తాము వ్యతిరేకం కాదన్న హరీష్‌... బుల్డోజర్ విధానాలకు, రియల్ ఎస్టేట్ దందాలకు వ్యతిరేకమని స్పష్టం చేశారు. ఎంత వెకిలి దాడి చేసినా సరే బాధితులైన ప్రజల పక్షాన నిలబడుతామన్నారు.


బీజేపీ నుంచి స్పందించిన కిషన్ రెడ్డి
బీజేపీ కూడా రేవంత్ రెడ్డి ప్రెస్‌మీట్‌పై స్పందించింది. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ... మూసీ సుందరీకరణకు, పునరుజ్జీవానికి తాము వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. ముందు మూసీకి ఇరువైపులా రిటైనింగ్ వాల్ ఏర్పాటు చేయాలన్నారు. డ్రైనేజీ వాటర్ అందులోకి రాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పేదల ఇళ్లు కూల్చకుండా కూడా సుందరీకరణ చేయవచ్చని సూచించారు. హైదరాబాద్ చారిత్రక వైభవానికి ఆనవాలుగా మిగిలిన మూసీకి పునరుజ్జీవం కల్పించడమే లక్ష్యంగా మూసీ సుందరీకరణ చేపట్టినట్లు చెప్పారు.