BRS COUNTER: తెలంగాణ శాసన సభ ప్రారంభమైన వెంటనే వాయిదా పడటంపై ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్(BRS) తీవ్రంగా విమర్శించింది. మంత్రివర్గ సమావేశం పూర్తికాలేదని శాశనసభ వాయిదా వేయడం హాస్యస్పదంగా ఉందని...ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనూ ఎప్పుడూ ఇలాంటి ఘటనలు జరగలేదని మండిపడింది. కాంగ్రెస్(Congress) ప్రభుత్వం తెలంగాణ పరువు తీస్తోందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది.
హరీశ్ ఆగ్రహం
అసెంబ్లీ(Assembly) ప్రారంభమైన రెండు నిమిషాలకే వాయిదా వేయడం ఏంటని మాజీమంత్రి హరీశ్‌రావు(Harishrao) నిలదీశారు. క్యాబినెట్ సమావేశం(Cabinet Meet) కొనసాగుతోందని...సబ్జెక్ట్ నోట్స్ సిద్ధం కాలేదని సభను వాయిదా వేసిన దాఖలాలు గతంలో ఉన్నాయా అని ఆయన ప్రశ్నించారు. మంత్రివర్గ సమావేశం జరుగుతున్న కారణంగా సభను వాయిదా వేయాలని మంత్రి శ్రీధర్‌బాబు(Sridhar Babu) కోరడం హాస్యస్పదంగా ఉందని హరీశ్‌రావు మండిపడ్డారు. నాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడూ కాంగ్రెస్ నేతలు సభ కోసం ప్రిపేర్ కాలేదని...ఇప్పుడు అధికారపక్షంలో ఉన్నప్పుడూ ప్రిపేరు కాలేదన్న హరీశ్‌రావు....ఇంకెప్పుడు ప్రిపేర్ అవుతారంటూ ఎద్దేవా చేశారు...
బీఆర్‌ఎస్ చురకలు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పటి వరకు చరిత్రలోనే ఎన్నడూ లేనివిధంగా శాసనసభ ప్రారంభమైన వెంటనే వాయిదా వేశారని బీఆర్‌ఎస్ నేతలు విమర్శించారు. సభ బిజినెస్ గురించి ఒక్క మాట కూడా చెప్పకుండానే వాయిదా వేశారంటూ మాజీమంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి(Prasanth Reddy) విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం,శాసనసభ పరువు తీశారంటూ ఆయన మండిప్డడారు. కేబినెట్ మీటింగ్ పూర్తి కాలేదని శాసన సభను వాయిదా వేస్తారా అని ఆయన ప్రశ్నించారు. మంత్రివర్గ సమావేశం, శాసనసభ సమావేశాల షెడ్యూల్ ముందే ఖరారు చేసినప్పుడు...ఇలాఎలా జరిగిందని ఆయన నిలదీశారు.మార్పులు చేయాల్సిన అవసరం ఏం వచ్చిందని ప్రశాంత్‌రెడ్డి ప్రశ్నించారు. శాసన సభ ప్రారంభమైన ఒక్క నిమిషంలోనే వాయిదా వేయడాన్ని బీఆర్‌ఎస్ ఎల్పీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.
బీసీలను మోసంచేశారు
కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను మరోసారి మోసం చేసిందని మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్, గంగుల కమలాకర్(Gangula kamalakar) విమర్శించారు. కులగణనపై చర్చ అంటూ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి వెంటనే వాయిదా వేస్తారా అంటూ గంగుల కమలాకర్ మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ ఆయన నిలదీశారు.మంత్రివర్గం ముందు పెట్టకుండానే బీసీ(BC) కమిషన్ నిన్న నివేదికను ఎందుకు బయట పెట్టిందని ఆయన ప్రశ్నించారు. మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ బీసీలకు వ్యతిరేకపార్టీయేనన్న గంగుల కమలాకర్...మరోసారి బీసీలను మోసం చేసిందన్నారు. తన రాజకీయ జీవితంలో ఎప్పుడూ సభ ప్రారంభమైన వెంటనే వాయిదా వేసిన చరిత్ర లేదన్నారు.
బీసీ గణన తప్పుల తడక
బీసీ గణనపై చర్చ కోసం తెలంగాణ సమాజం వేయికళ్లతో ఎదురుచూస్తున్న తరుణంలో
షెడ్యూల్ ఇచ్చి ప్రభుత్వం మాట తప్పిందని మాజీమంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్(Talasani Srinivas Yadhav) అన్నారు. సభకు పిలిచి మమ్మల్ని అవమానించారంటూ ఆయన మండిపడ్డారు. మంత్రివర్గం సమావేశం ఒకరోజు ముందు పెట్టుకుంటే ఏమయ్యేదని ఆయన అన్నారు. మంత్రి శ్రీధర్‌బాబు చెప్పగానే సభాపతి సభను వాయిదా వేశారని....కనీసం మమ్మల్ని సంప్రదించలేదని తలసాని వాపోయారు. కుట్రపూరితంగానే సభను వాయిదా వేశారని ఆయన మండిపడ్డారు. పైగా ఎంతో కీలకమైన బీసీ గణనపై చర్చ కేవలం ఒక్కరోజే నిర్వహించడం అన్యాయమన్నారు. దీనిపై కనీసం నాలుగురోజులు చర్చించాలని ఆయన డిమాండ్ చేశారు. బీసీలకు కాంగ్రెస్ అన్యాయం చేస్తోందన్న తలసాని....బడుగు, బలహీన వర్గాల కోసం మరో ఉద్యమం రాబోతోందన్నారు. తెలంగాణ ఉద్యమం కన్నా తీవ్రంగా ఉండబోతోందని హెచ్చరించారు.