హైదరాబాద్‌కు మరో ప్రతిష్టాత్మక మల్టినేషనల్ కంపెనీ రానుంది. జర్మనీకి చెందిన "బాష్" హైదరాబాద్‌లో సాఫ్ట్ వేర్ , రీసెర్చ్ అండ్ డెలవప్‌మెంట్ విభాగాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించుకుంది. బాష్ కంపెనీ మొబిలిటి, ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్, హోమ్ అప్లయన్సెన్స్ వంటి రంగాల్లో గ్లోబల్ లీడర్‌గా ఉంది. ఈ సంస్థ సాఫ్ట్ వేర్ విభాగం బాష్ గ్లోబల్ సాఫ్ట్ వేర్ టెక్నాలజీస్ , ఆర్ అండ్ డీ విభాగాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు కేటీఆర్‌తో వర్చువల్‌గా ఆ కంపెనీ యాజమాన్యం చర్చలు జరిపి అంగీకారం తెలిపింది. ఈ విషయాన్ని కేటీఆర్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. 





బాష్ కంపెనీ హైదరాబాద్‌లో క్యాంపస్‌ ఏర్పాటు చేయడం వల్ల మూడు వేల ఉద్యోగాలు లభించనున్నాయి. హైదరాబాద్ ఇప్పటికే అనేక ప్రఖ్యాత సాఫ్ట్ వేర్ కంపెనీలతో ఐటీ నగరంగా పేరు పొందింది. ఇప్పుడు బాష్ కూడా అతి పెద్ద క్యాంపస్ ఏర్పాటుకు ముందుకు రావడం అంతర్జాతీయంగా హైదరాబాద్‌కు మరింత మంచి పేరు రానుంది. 


ఇటీవలి కాలంలో తెలంగాణలో పెద్ద ఎత్తున మల్టినేషనల్ కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందాలు చేసుకుంటున్నాయి. హైదరాబాద్‌లో భారీ పెట్టుబడి పెట్టేందుకు ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్‌ కూడా తుది చర్చలు పూర్తి చేసింది.  శంషాబాద్‌ ప్రాంతంలో 50 ఎకరాలను మైక్రోసాఫ్ట్‌కు ప్రభుత్వం కేటాయించింది. రూ.15 వేల కోట్ల పెట్టుబడితో డేటా సెంటర్‌ ఏర్పాటుకు మైక్రోసాఫ్ట్‌ నిర్ణయించుకుంది. ఈ నెలలోనే 0ధికారికంగా సంయుక్త ప్రకటన చేసే అవకాశం ఉంది.
  
అదానీ కూడా దాదాపుగా రూ. లక్ష కోట్లతే డేటా సెంటర్ పెట్టాలనే ప్రణాళికలు ప్రకటించారు. అమెజాన్ వెబ్ సర్వీసెస్ కూడా పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతోంది. హైదరాబాద్ డేటా సెంటర్ల కేంద్రంగా మారే అవకాశం ఉండటంతో ప్రభుత్వం కూడా ప్రత్యేక పాలసీని ప్రకటించింది. ఇది హైదరాబాద్‌కు మరింత ప్లస్ అయింది.  బాష్ రాకతో హైదరాబాద్ మరింత ప్రపంచ స్థాయి నగరంగా ఎదిగనుంది.