Boianapalli Vinod Kumar Comments on Telangana Legislative Council | హైదరాబాద్‌: ఓవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అధికార కాంగ్రెస్ పార్టీలోకి క్యూ కట్టారు. ఇది ప్రజాస్వామ్యమా? సీఎం రేవంత్ రెడ్డి గతంలో చెప్పిన మాటలకు కట్టుబడకుండా.. ఇతర పార్టీల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను రాజీనామా చేయించకుండా కాంగ్రెస్ (Congress Party) లో చేర్చుకుంటున్నారని ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలో మాజీ ఎంపీ బోయినలపల్లి వినోద్‌ కుమార్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ శాసనమండలి ఉనికి ప్రమదంలో పడిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరైనా కోర్టును ఆశ్రయిస్తే రాష్ట్ర శాసన మండలి పూర్తిగా రద్దు అయ్యే ప్రమాదం ఉందన్నారు. ఏపీ సీఎం చంద్రబాబుతో చర్చించి రేవంత్ రెడ్డి తెలంగాణ అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంచేలా చేస్తేనే, రాష్ట్రంలో శాసనమండలి ఉంటుందని సూచించారు. జులై 6న చంద్రబాబు, రేవంత్ రెడ్డి కానున్న తరుణంలో వినోద్ కుమార్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అవుతున్నాయి.


మండలిలో 40 సీట్లు ఉండాలి.. 
తెలంగాణ భవన్‌లో శుక్రవారం మీడియా సమావేశంలో బోయినపల్లి వినోద్‌ కుమార్‌ పాల్గొని మాట్లాడారు. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 171 పకారం తెలంగాణ శాసన మండలిలో కనీసం సీట్లు 40 ఉండాలన్నారు. శాసనసభ సీట్లలో మూడో వంతు కౌన్సిల్‌ సభ్యులు ఉండాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ అంత కంటే తక్కువ సీట్లు ఉండకూడదు అన్నారు. కేంద్రం ప్రభుత్వం గత ఐదేళ్ల హయాంలో చేసిన రాజ్యాంగ సవరణతో పస్తుతం తెలంగాణ శాసన మండలి ఉనికి పమాదంలో పడిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో ఉండే ఆంగ్లో ఇండియన్‌ (Anglo Indian) ఎమ్మెల్యేను తొలగించారు. దాంతో రాష్ట్ర అసెంబ్లీలో ఎమ్మెల్యేల సంఖ్య 120 నుంచి 119కి తగ్గిందన్నారు. 


గత అసెంబ్లీ కాలం ముగిసే వరకు ఆంగ్లో ఇండియన్‌ పదవీ కాలం ఉంది. దాంతో గత అసెంబ్లీ సమయం ముగిసే వరకు శాసనమండలికి ఎలాంటి ముప్పు రాలేదని వినోద్‌ కుమార్‌ పేర్కొన్నారు. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం గతంలో చేసిన రాజ్యాంగ సవరణ కొత్త ప్రభుత్వం, కొత్త అసెంబ్లీ ఏర్పాటు నుంచి అమల్లోకి వచ్చిందన్నారు. దానివల్ల ఆంగ్లో ఇండియన్‌ శాసనసభ్యుడు అసెంబ్లీలో లేరు. ఫలితంగా తెలంగాణలో ఎమ్మెల్యేల సంఖ్య 119కి పడిపోయిందని, ఎమ్మెల్యే సంఖ్య ప్రకారం రాజ్యాంగ నిబంధనలకు లోబడి కౌన్సిల్‌ సభ్యుల సంఖ్య 1/3 కి అంటే 39కి పడిపోయినట్లు వినోద్ కుమార్ చెప్పారు. 


రాజ్యాంగం ప్రకారం కనీసం తెలంగాణ శాసనమండలిలో 40 మంది సభ్యులు ఉండాలనే నిబంధన ఉల్లఘించినట్లు అవుతుందని, కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ఈ విషయం లేవనెత్తి ఎవరైనా కోర్టును ఆశ్రయిస్తే వెంటనే శాసన మండలి రద్దు అయ్యే అవకాశం ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో శాసనమండలి ఉనికి ప్రమాదంలో పడుతుందన్నారు. రాష్ట్రంలో శాసన మండలి కొనసాగాలంటే ఎమ్మెల్యేల సంఖ్య పెరగాలన్నారు. 


కేంద్రంలో చక్రం తిప్పుతున్న చంద్రబాబు 
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు పస్తుతం కేంద్ర ప్రభుత్వంలో కీలకంగా ఉన్నారని, శనివారం నాటి ఇద్దరు సీఎంలు కలిసి తెలంగాణ అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంపునకు కృషి చేయాలని తెలంగాణ ప్రభుత్వానికి మాజీ ఎంపీ వినోద్ కుమార్ సూచించారు. విభజన చట్టంలోని 26 సెక్షన్‌ ప్రకారం తెలంగాణలో ఎమ్మెల్యేల సంఖ్య 153కి, ఏపీలో అసెంబ్లీ సీట్లను 225కు పెంచాల్సి ఉందన్నారు. అసెంబ్లీ సీట్లను పునర్ విభజన చేయాలని కోరితే కేంద్రం స్పందించలేదని ఆరోపించారు.


అదే సమయంలో జమ్ము కశ్మీర్‌ లో అసెంబ్లీ సీట్లను పెంచారని, అంటే కేంద్రానికి ఇష్టం ఉంటే అసెంబ్లీలో ఎమ్మెల్యే స్థానాలను పెంచుకుంటుందని ఎద్దేవా చేశారు. ఏపీ సీఎం చంద్రబాబుతో తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి చర్చించి.. విభజన చట్టంలో పేర్కొన్న తీరుగా అసెంబ్లీలో ఎమ్మెల్యేల స్థానాల సంఖ్య పెరిగేలా చూస్తేనే.. శాసన మండలి కొనసాగుతుందన్నారు. పార్లమెంట్‌లో బిల్లు వచ్చిన రోజు శాసనమండలి అవసరమమనితాను సుదీర్ఘంగా ప్రసంగించినట్లు పేర్కొన్నారు.