Telangana Unemployed Protest: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) కార్యాలయ ముట్టడికి నిరుద్యోగ ఐకాస (JAC) పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. 30 లక్షల మందితో ‘నిరుద్యోగుల మార్చ్‌’ నిర్వహించనున్నట్లు జేఏసీ ప్రకటించింది. ఈ పిలుపు మేరకు జిల్లాల నుంచి నిరుద్యోగ యువత నగరం బాటపట్టారు. ఈ సందర్భంగా టీజీపీఎస్సీ కార్యాలయం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. నిరుద్యోగులు మార్చ్‌ను ప్రభుత్వం ఎక్కడికక్కడ అడ్డుకునే ప్రయత్నం చేస్తోంది. జిల్లాల నుంచి హైదరాబాద్‌కు నిరుద్యోగులు, విద్యార్థిసంఘాల నాయకులు రాకుండా అక్రమ అరెస్టులకు పాల్పడుతుంది.  ఏఐఎస్‌ఎఫ్‌, ఏఐవైఎఫ్‌, బీజేవైఎం, బీఆర్‌ఎస్ విద్యార్థి విభాగం నాయకులను అదుపులోకి తీసుకుంటున్నారు. కొందరు నాయకులను గృహ నిర్బంధంలో ఉంచుతున్నారు.


హైదరాబాద్‌ శివారు ప్రాంతాల్లో ప్రత్యేకంగా చెక్ పాయింట్లు ఏర్పాటుచేసింది. జిల్లాల నుంచి వస్తున్న ప్రతివాహనాన్ని పోలీసులు క్షుణ్నంగా తనిఖీ చేసి పంపతున్నారు. హైదరాబాద్‌‌లో అశోక్‌నగర్‌, ఉస్మానియా యూనివర్సిటీలు, లైబ్రరీలు, స్టడీ సర్కిళ్లు, స్టడీ రూమ్‌లతోపాటు అనేక ప్రాంతాల్లో ఉన్న నిరుద్యోగ నేతలను ఎక్కడికక్కడ పోలీసులు అరెస్టు చేసి నిర్బంధంలో పెట్టినట్లు తెలుస్తోంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరికి నిరసనగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని జేఏసీ నాయకులు అంటున్నారు.  ప్రభుత్వం దిగొచ్చేదాకా వెనుకడుగు వేసేదే లేదంటూ హెచ్చరిస్తున్నారు. సోషల్‌ మీడియాలోనూ మద్ధతుగా పోస్టులు వెలుస్తున్నాయి.


రాష్ట్రంలో గ్రూప్‌ 2, 3 పోస్టులను పెంచి డిసెంబర్‌లో పరీక్షలు నిర్వహించాలని, గ్రూప్‌1 మెయిన్స్‌కు 1:100 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేయాలని, ఉద్యోగ క్యాలెండర్‌ ప్రకటించాలని, జీవో 46 రద్దుతోపాటు డీఎస్సీని 3 నెలల పాటు వాయిదా వేసి.. అక్టోబర్‌లో 25 వేల పోస్టులతో మెగా డీఎస్సీ నిర్వహించాలని డిమాండ్‌ చేస్తున్నారు. వీటితోపాటు నిరుద్యోగ భృతి కింద రూ.4 వేలు ఇవ్వాలని, గురుకుల టీచర్‌ పోస్టుల భర్తీలో రిలింక్విష్‌మెంట్‌ విధానం అమలుచేయాని జేఏసీ నేతలు డిమాండ్‌ చేస్తున్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిన కాంగ్రెస్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరుద్యోగులు కదం తొక్కుతున్నారు.


ప్రతిపక్షాలు, ఇతర వర్గాల సంపూర్ణ మద్దతు..
ఉద్యోగాల సాధన కోసం నిరుద్యోగులు నిత్యం ఉద్యమాలు కొనసాగిస్తూనే ఉన్నారు. నిరుద్యోగులకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చేంత వరకు వారి పక్షాన నిలబడి, ఉద్యమానికి బాసటగా నిలుస్తామని ప్రతిపక్షాలు ప్రకటించాయి. ఇప్పటికే నిరుద్యోగుల ఉద్యమానికి బీఆర్‌ఎస్‌ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఇతర రాజకీయ పార్టీలు, విద్యార్థి సంఘాలు మద్దతు ఇచ్చాయి. ఓయూతోపాటు రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల్లో కూడా నిరసనలు కొనసాగుతున్నాయి. కాంగ్రెస్‌ బహిష్కృత నేత బక్క జడ్సన్‌, ఫ్యాకల్టీ అశోక్‌ తమ ఇండ్లలోనే ఆమరణ నిరాహార దీక్షలు కొనసాగిస్తున్నారు.


విద్యార్థి నాయకుల అరెస్టు దుర్మార్గం: కేటీఆర్‌
విద్యార్థి సంఘాల నాయకుల అరెస్టు చేయడం పట్ల మాజీమంత్రి కేటీఆర్‌ తీవ్రంగా స్పందించారు. విద్యార్థుల శాంతియుత నిరసనపై ప్రభుత్వం నియంతృత్వంతో వ్యవహరిస్తోందని మండిపడ్డారు. తమ డిమాండ్లు తెలపాలనుకున్న విద్యార్థి నాయకుల అరెస్టు దుర్మార్గమన్నారు. ఎన్నికల ముందు నిరుద్యోగులతో రాహుల్‌ గాంధీ భేటీ ఏర్పాటు చేశారని, కానీ అధికారంలోకి రాగానే నిరుద్యోగులను అణచివేసే ప్రయత్నం చేస్తోందని వెల్లడించారు. ప్రభుత్వం ఈ ఆందోళనలపై స్పందించి వెంటనే డిమాండ్లను పరిష్కరించాలని కోరారు.