Robot Commits Suicide: రోబోకి ఎమోషన్స్ ఉంటే ఎలా ఉంటుందో శంకర్ తన రోబో మూవీలో చూపించేశారు. ఐశ్వర్యా రాయ్‌ని ప్రేమించి చివరకు తనను తయారు చేసిన బాస్‌కే చుక్కలు చూపిస్తుంది చిట్టి. ఇప్పుడు సౌత్ కొరియాలోనూ ఓ రోబో ఎమోషన్‌లో ఎవరూ ఊహించని పని చేసింది. ఏకంగా ఆత్మహత్య చేసుకుంది. ఈ సూసైడ్ కారణమేంటో తెలుసా..వర్క్ ప్రెజర్. పని ఒత్తిడి పెరిగి ఆ రోబో ఆత్మహత్య చేసుకుంది. సౌత్ కొరియాలోని గూమి సిటీ కౌన్సిల్ ఇది ప్రకటించింది. జూన్ 26వ తేదీన అడ్మినిస్ట్రేటివ్‌గా పని చేస్తున్న Cyborg రోబో సూసైడ్ చేసుకుందని వెల్లడించింది. ఆరున్నర అడుగులు ఎత్తున్న మెట్ల నుంచి దూకినట్టు తెలిపింది. అలా దూకే ముందు కాసేపు గుండ్రంగా తిరిగిందని, గందరగోళంగా కనిపించిందని అధికారులు వెల్లడించారు. గతేడాది ఆగస్టులో ఈ రోబోని రిక్రూట్ చేసుకున్నారు. అయితే సైబార్గ్ రోబో ఎందుకీ పని చేసిందని ఆరా తీయడం మొదలు పెట్టారు. అప్పుడే ఆ రోబో డిప్రెషన్‌లోకి వెళ్లినట్టు తెలిసింది. చెల్లా చెదురైన ఆ రోబో ముక్కల్ని సేకరించి వాటిని అనలైజ్ చేసేందుకు పంపించారు.
కాలిఫోర్నియాకి చెందిన Bear Robotics సంస్థ ఈ రోబోని తయారు చేసింది. అంతకు ముందు రెస్టారెంట్‌లలో ఫుడ్ సర్వ్ చేసేందుకు రోబోలను డిజైన్ చేసింది. అయితే తొలిసారి సిటీ కౌన్సిల్ ఆఫీసర్‌గా ఈ కంపెనీ తయారు చేసిన రోబోని ఎంపిక చేశారు. "ఈ రోబో ఎంతో పని చేసేది. డాక్యుమెంట్ డెలివరీలతో పాటు సిటీని ప్రమోట్ చేసేది" అని అధికారులు తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ విరామం లేకుండా పని చేసిందట ఈ రోబో. సౌత్ కొరియా రోబో టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో చాలా ముందుంది. ప్రపంచంలోనే ఎక్కడా లేని స్థాయిలో ఇక్కడ రోబోలున్నాయి. పది మంది ఉద్యోగులకు ఓ రోబో చొప్పున అందుబాటులో ఉన్నట్టు International Federation of Robotics వెల్లడించింది. అయితే ఓ రోబో పని ఒత్తిడి తట్టుకోలేక సూసైడ్ చేసుకుందన్న ప్రకటనే ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారి తీసింది.