Raghunandan Rao Death threat call | హైదరాబాద్: బిజెపి ఎంపీ రఘునందన్ రావును చంపేస్తామంటూ బెదిరింపు కాల్ రావడం కలకలం రేపుతోంది. పీపుల్స్ వార్ మావోయిస్టు పేరుతో బెదిరింపు కాల్ చేసిన అగంతకుడు తాను మధ్యప్రదేశ్ కు చెందిన మావోయిస్టు అని చెప్పాడు. సోమవారం సాయంత్రం లోగా చంపేస్తామంటూ హెచ్చరించాడు. ఎంపీ రఘునందన్ రావు మేడ్చల్ జిల్లా దమ్మైగూడలో ఒక స్కూల్లో జరిగిన కార్యక్రమానికి హాజరైన సమయంలో బెదిరింపు కాలు వచ్చింది. ఎంపీ పీఏ ఫోన్ లిఫ్ట్ చేయగా.. రఘునందన్ రావును ఈరోజు సాయంత్రంలోగా చంపేస్తానని అమావోయిస్టు బెదిరించాడు. ఎంపీ రఘునందన్ రావు ఈ బెదిరింపు కాల్ పై తెలంగాణ డీజీపీతో పాటు మెదక్ ఎస్పీ, ఇతర పోలీస్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.

కొనసాగుతోన్న ఆపరేషన్ కగార్..

దేశంలో మావోయిస్టులు లేకుండా చేస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా పలుమార్లు చెప్పారు. మార్చి 2026 నాటికి భారత్ మావోయిస్ట్ రహిత దేశంగా చేస్తామని స్పష్టం చేశారు. ఇందులో భాగంగా మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం మావోయిస్టులకు ఉక్కుపాదం మోపుతోంది. గతంలో పలు రాష్ట్రాల్లో మావోయిస్టు, నక్సల్స్ ప్రభావిత జిల్లాలు ఉండేవి. కానీ భద్రతా బలగాలు చేపట్టిన కూంబింగ్ ఆపరేషన్లలో కీలక మావోయిస్టులతో పాటు వందల మావోయిస్టులు చనిపోయారు. ఆపరేషన్ కగార్ దాదాపు చివరి దశకు వచ్చేసింది. 

చర్చలకు తమను ఆహ్వానించాలని, శాంతియుతంగా సమస్యను పరిష్కరించుకుందామని సెంట్రల్ మావోయిస్టు పార్టీ కమిటీ సభ్యులు కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని మోదీకి, హోం మంత్రి అమిత్ షాకు, ఛత్తీస్ గఢ్ ముఖ్యమంత్రికి లేఖలు రాశారు. కానీ ఆపరేషన్ కగార్ కొనసాగుతోందని, సామాన్య జన జీవితానికి ఏ ఇబ్బంది లేకుండా చేస్తామని బీజేపీ నేతలు చెబుతున్నారు. మరోవైపు కేంద్ర మంత్రులు, బీజేపీ ఎంపీలు, పార్టీ నేతలకు మావోయిస్టుల నుంచి ఏదో చోట ఇలాగే బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. తాజాగా తెలంగాణకు చెందిన బీజేపీ ఎంపీ రఘునందన్ రావుకు బెదిరింపు కాల్ వచ్చింది. మధ్యప్రదేశ్ నుంచి కాల్ చేసిన మావోయిస్టు, సోమవారం సాయంత్రంలోగా ఎంపీని చంపేస్తామని హెచ్చరించాడు.