PM Modi Visits Hyderabad: హైదరాబాద్ వేదికగా జరిగిన బీసీ ఆత్మగౌరవ సభకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై విమర్శలు గుప్పించారు. అయితే హైదరాబాద్ లో జరిగిన మోదీ సభకు బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ హాజరు కాలేదు. బీజేపీ శ్రేణులు సైతం రాజా సింగ్ ప్రధాని సభకు ఎందుకు హాజరు కాలేదా అని చర్చించుకుంటున్నారు. దీనిపై రాజా సింగ్ స్పందించి, వివరణ ఇచ్చారు. ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన బీసీ ఆత్మగౌరవ బహిరంగ సభకు హాజరు కాలేకపోయినందుకు బాధగా ఉందన్నారు. 


ఈ సభలో తాను పాల్గొంటే సభకు వెచ్చించిన మొత్తంలో కొంత భాగం తన ఎన్నికల ఖర్చులోకి వెళుతుంది అని రాజా సింగ్ తెలిపారు. ఎమ్మెల్యే అభ్యర్ధి ఎన్నికల ఖర్చు రూ.40 లక్షలకు మించకూడదు అని ఎలక్షన్ కమిషన్ నిబంధనలు ఉన్నాయి. దాంతో తాను మోదీ సభలో పాల్గొంటే తన ఎన్నికల ప్రచార ఖర్చు పరిమితి దాటే ప్రమాదం ఉందని భావించి, ఈ ముఖ్యమైన లో సభకు తాను హాజరు కాలేకపోయానని స్పష్టం చేశారు. అంతే తప్ప మరే కారణం లేదని, పార్టీ కార్యకర్తలు అర్ధం చేసుకోవాలని కోరారు. ఈ మేరకు ఓ ప్రకటనలో తెలిపారు. కాగా, ఎల్పీ స్టేడియం గోషామహల్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోకి వస్తుందని తెలిసిందే.


దళితులను లోక్ సభ స్పీకర్, రాష్ట్రపతి చేసింది మేమే: ప్రధాని మోదీ



దళితులు, పీడితులు, ఆదివాసీలకు ఎప్పుడూ బీజేపీ అండగా ఉంటుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో నిర్వహించి బీసీ గర్జన సభకు మోదీతో పాటు, కిషన్ రెడ్డి, బండి సంజయ్, పవన్ కళ్యాణ్ తదితరులు హాజరయ్యారు. ‘‘అటల్ బిహారీ వాజ్ పేయీ ప్రభుత్వం సమయంలో మేమే ఏపీజే అబ్దుల్ కలాంను రాష్ట్రపతిని చేశాం. జీఎంసీ బాలయోగిని బీజేపీ తొలి దళిత లోక్ సభ స్పీకర్ ను చేసిందని గుర్తు చేశారు. అలాగే తొలి దళిత రాష్ట్రపతిగా కూడా రామ్ నాథ్ కోవింద్‌ను చేసిందని, అలాగే ద్రౌపది ముర్మును రాష్ట్రపతిగా చేసి తొలి ఆదివాసీ వ్యక్తిని దేశాధినేత చేసిన ఘనత బీజేపీకే దక్కుతుందని అన్నారు. తెలంగాణలో ఇప్పుడు బీసీ వ్యక్తి సీఎం కాబోతున్నారు. ఇది మోదీ గ్యారంటీ’’ అన్నారు ప్రధాని మోదీ.


కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీకి సీ టీమ్
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక కేసీఆర్ ప్రభుత్వం అతి పెద్ద మోసం బీసీలకు చేసిందని ప్రధాని మోదీ విమర్శించారు. ఎస్సీ, ఎస్టీలను ఎప్పుడూ కేసీఆర్, బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదని అన్నారు. వారు ఎప్పుడూ తమ కుటుంబం (కేసీఆర్ ఫ్యామిలీ) కోసమే పని చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అనేది బీఆర్ఎస్ పార్టీకి సీ టీమ్ అని అన్నారు. హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో తెలంగాణ బీజేపీ నిర్వహించిన భారీ బహిరంగ సభకు ప్రధాని మోదీ హాజరయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్ పైన, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలపై తీవ్రమైన విమర్శలు చేశారు. 



గతంలో ఎల్బీ స్టేడియం సభ తర్వాతే మోదీ ప్రధాని అయ్యారు: కిషన్ రెడ్డి



పదేళ్ల కిందట గుజరాత్ సీఎంగా మోదీ ఎల్బీ స్టేడియానికి వచ్చారని కిషన్ రెడ్డి గుర్తుచేశారు. ఆ సభ తర్వాతే మోదీ ప్రధాని అయ్యారని చెప్పారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం అంతా ఒకటేనన్నారు. మన్మోహన్ హయాంలో కేసీఆర్ మంత్రి అయ్యారు. కాంగ్రెస్ హయాంలో టీఆర్ఎస్ నేతలు మంత్రులుగా ఉన్నారని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రపతి అభ్యర్థిగా ముర్ము వస్తే సీఎం కేసీఆర్ పట్టించుకోలేదు అన్నారు.