Telangana News: కాంగ్రెస్ కు చెందిన తెలంగాణ ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి సోషల్ మీడియాలో చేసిన ఓ పోస్టు వివాదాస్పదం అవుతున్న సంగతి తెలిసిందే. భువనగిరి ఎమ్మెల్యే అయిన అనిల్ కుమార్ బక్రీద్ సందర్భంగా ఓ పోస్టర్ రూపొందించి శుభాకాంక్షలు తెలిపారు. అందులో బక్రీద్ శుభాకాంక్షలు తెలిపిన తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఓ ఆవు బొమ్మను ఆ పోస్టులో చేర్చడంతో హిందుత్వవాదులు తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు.


గోషామహల్ కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మాట్లాడుతూ.. హిందువులను అవమానించేలా ఆ పోస్ట్ ఉందని వెంటనే డిలీట్ చేయాలని డిమాండ్ చేశారు. ‘‘ఇవాళ బక్రీద్. కానీ, గోరక్షకులకు ఇది విషాద దినం. దేశమంతా మేము బాధలో ఉంటే.. కాంగ్రెస్ ఎమ్మెల్యే బక్రీద్ శుభాకాంక్షలు అని ఓ పోస్టు పెట్టారు. శుభాకాంక్షలు చెబితే ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ, ఆ పోస్టులో ఒక ఆవును ప్రతిబింబిస్తూ డిజైన్ చేశారు. ఆ ఆవుపై దర్గా బొమ్మను రూపొందించారు. గోవును ఆ పోస్టులో చేర్చి హిందువుల మనోభావాలను దెబ్బతీశారు. 


హిందువులు, ముస్లిల ఓట్లతోనే రేవంత్ రెడ్డి సీఎం అయ్యారు. కానీ, హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఇలాంటి పోస్టులు చేయడం కరెక్టు కాదు. దయచేసి ఆ సోషల్ మీడియా పోస్టును సదరు ఎమ్మెల్యే తొలగించేలా చర్యలు తీసుకోవాలని రాజా సింగ్ డిమాండ్ చేశారు.