Raja Singh in PM Modi Public Meeting: హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరిగిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచార సభలో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కు అవమానం జరిగింది. బీజేపీ కీలక నేతలు సభా వేదికపైకి వెళ్లాల్సి ఉండగా.. ఎమ్మెల్యే రాజాసింగ్ ను మాత్రం వెళ్లనివ్వలేదు. రాజాసింగ్ వేదికపైకి వెళ్తుండగా.. ప్రధాని మోదీ వ్యక్తిగత భద్రతా సిబ్బంది అయిన ఎస్పీజీ (స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్) అనుమతి నిరాకరించింది. తాను బీజేపీ ఎమ్మెల్యేను అని చెప్పుకున్నా ఎస్పీజీ సిబ్బంది ఎమ్మెల్యేను సభపైకి అనుమతించలేదు.
ఎల్బీ స్టేడియంలో సభ జరిగే నిర్దేశించిన సమయం కన్నా ఆలస్యంగా వచ్చారనే కారణంతోనే ఎమ్మెల్యే రాజాసింగ్ ను ఎస్పీజీ సిబ్బంది నిలిపేసి ఉంటారని రాష్ట్ర పోలీసులు చెబుతున్నారు. కానీ, రాజాసింగ్ అనుచరులు మాత్రం ఈ వ్యవహారం పట్ల సీరియస్ గా ఉన్నారు. రాజసింగ్ ను సభకు పిలిచి అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంత ప్రయత్నించినప్పటికీ సభా వేదికపైకి రాజాసింగ్ ను అనుమతించకపోవడంతో.. ఇక ఆయన చేసేది లేక ప్రజలతో పాటు కూర్చొన్నారు. సాధారణ కుర్చీల్లో ప్రజల మధ్యకు వచ్చి తన అనుచరులతో సహా కూర్చొని ప్రధాని ప్రసంగం విన్నారు.
రాజసింగ్ లేటుగా వచ్చినందునే అనుమతి ఇవ్వవలేదని పోలీసులు అంటుండగా.. అసలు సభపైన ఉండాల్సిన వారి పేర్ల జాబితాలో రాష్ట్ర బీజేపీ తన పేరును చేర్చలేదని రాజాసింగ్ అనుచరులు చెబుతున్నారు. దీనిపై రాజాసింగ్ క్లారిటీ ఇచ్చారు. తాను సభకు ఆలస్యంగా రాలేదని స్పష్టత ఇచ్చారు. తాను నిర్దేశిత సమయం కన్నా 20 నిమిషాల ముందే సభ వద్దకు చేరుకున్నానని మోదీ చెప్పారు.