Minister V Srinivas Goud: తెలంగాణ అబ్కారీ శాఖ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ తుపాకీ పుచ్చుకొని గాలిలోకి కాల్పులు చేసిన వ్యవహారం, విపక్షాలు మరిన్ని విమర్శలు చేసేందుకు తావిస్తోంది. తాజాగా ఈ ఘటనపై బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు స్పందించారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ కాల్పులు జరిపేందుకు ఏ చట్టం అనుమతి ఇచ్చిందని ప్రశ్నించారు. ఒక ప్రైవేటు వ్యక్తికి తుపాకీ ఇవ్వవచ్చని ఏ చట్టంలో ఉందో చెప్పాలని నిలదీశారు. ఎస్పీ వెంకటేశ్వర్లు దీనికి సమాధానం చెప్పాలని రఘునందన్ రావు డిమాండ్ చేశారు. ఈ విషయంలో రఘునందన్ రావు డీజీపీని కూడా విమర్శించారు.
డీజీపీ మహేందర్ రెడ్డి కూడా ఈ కేసును తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. నివేదిక ఇవ్వాలని చెప్పి ఆయన చేతులు దులుపుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రికి గన్ లైసెన్స్ ఉందా? అని ప్రశ్నించారు. ఆ తుపాకీ పేల్చే సమయంలో పొరపాటున గురితప్పి ఉంటే ప్రాణ నష్టం జరిగి ఉండేదని అన్నారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్‌పై పోలీసులు కేసు నమోదు చేయాలని రఘునందన్ డిమాండ్ చేశారు.
మంత్రి ఫైర్ చేసిన గన్‌ను ఇంతవరకూ ఎందుకు సీజ్ చేయలేదని, మంత్రి సహా ప్రైవేటు వ్యక్తికి తుపాకీ ఇచ్చి కాల్చమనే అధికారం ఎస్పీ సహా ఎవరికీ లేదని అన్నారు. ఒకవేళ ఎస్పీ గన్ ఇచ్చి ఉంటే ఆయనను కూడా నిందితుడిగా చేర్చాలని డిమాండ్ చేశారు. అయితే, ఆ గన్ లో రబ్బరు బుల్లెట్లు ఉన్నాయన్న మంత్రి స్పందనను రఘునందన్ రావు తీవ్రంగా తప్పుబట్టారు. గన్ మెన్ల దగ్గర ఉండే తుపాకుల్లో రబ్బరు బుల్లెట్లు ఉంటాయా అని ప్రశ్నించారు.
మహబూబ్ నగర్ లో ఘటన
సీఎం కేసీఆర్ పిలుపు మేరకు స్వాతంత్ర్య వజ్రోత్సవాలను మహబూబ్ నగర్ లో కూడా ఘనంగా నిర్వహించారు. శనివారం ఫ్రీడం రన్, ఫ్రీడం వాక్ అనే కార్యక్రమాలు ఇందులో భాగంగానే నిర్వహించారు. పోలీసుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగ్గా.. ఈ వాక్ లో మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఓ తుపాకీ పేల్చినట్టు ఫోటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి. దీంతో వివాదం రాజుకుంది.
అయితే, దీనిపై మంత్రి స్పందిస్తూ.. తాను నిజం తుపాకీ పేలుస్తున్నట్లుగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఇష్టానుసారంగా కథనాలు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ర్యాలీలు జరిగినపుడు బుల్లెట్లు లేని బ్లాంక్ గన్ తో గాల్లోకి కాల్చడం పరిపాటి అని మంత్రి అన్నారు. మూడు రోజుల క్రితం కూడా వరంగల్ లో బ్లాంక్ గన్ తో గాల్లోకి కాల్చానని అన్నారు.
వాళ్ల కళ్లు మండుతున్నాయి - మంత్రి
‘‘బుల్లెట్లు ఉండని గన్ తో కాలిస్తే చప్పుడే వస్తుంది. బుల్లెట్లు ఉండవు కనీసం పిల్లెట్లు కూడా ఉండవు. జిల్లా ఎస్పీ స్వయంగా గన్ ఇచ్చారు. ఎస్పీకి గన్ ఇచ్చే అధికారం ఉంది. నేనంటే గిట్టని వారే మొదటి నుంచి బట్ట కాల్చి మీదెస్తున్నారు. 25 వేల మంది ర్యాలీలో పాల్గొనడం మహబూబ్ నగర్ లో ఇదే ప్రథమం. దీంతో కొందరి కళ్ళు మండుతున్నాయి. నేను కూడా జర్నలిజం చదివాను. వార్తలు రాసే ముందు కనీస వివరణ తీసుకోవాలన్న సోయి లోపించడం బాధాకరం. క్రీడల మంత్రిగా నాకు కొన్ని అధికారాలు ఉన్నాయని తెలుసుకోవాలి. వరంగల్ లో రాని వివాదం మహబూబ్ నగర్ లో ఎందుకు వస్తోంది. బురద జల్లే పద్దతి రాజకీయాల్లో మంచిది కాదు’’ అని మంత్రి శ్రీనివాస్ గౌడ్ వివరణ ఇచ్చారు.