భారతదేశ 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశ వ్యాప్తంగా సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ (Azadi Ka Amrit Mahotsav) కార్యక్రమంలో భాగంగా ఇంటింటా జాతీయ జెండా కార్యక్రమాన్ని.. ‘ హర్ ఘర్ తిరంగా’ (Har Ghar Tiranga) కార్యక్రమం చేపట్టారు. ఇందులో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా దంపతులు తమ నివాసంలో జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఆగస్టు 15 వరకు సాగే ఈ డ్రైవ్ లో తమ ఇళ్లపై జాతీయ జెండాను ఎగురవేయాలని, ప్రజలను ప్రధాని నరేంద్ర మోదీ కోరారు.
దేశ వ్యాప్తంగా హర్ ఘర్ తిరంగా
కేంద్ర మంత్రి అమిత్ షా తన సతీమణితో కలిసి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రధాని మోదీ పిలుపు మేరకు దేశ వ్యాప్తంగా కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల సీఎంలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులతో పాటు దేశ వ్యాప్తంగా ప్రజలు.. తమ ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేస్తున్నారు. ప్రభుత్వం ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ లో భాగంగా చేపట్టిన ‘హర్ ఘర్ తిరంగ’ కార్యక్రమంలో ప్రజలు మువ్వన్నెల జెండాను ఎగురవేసేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా.. 2002ను సవరించింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా జూలై 20న ఉత్తర్వులు జారీ చేశారు. జాతీయ జెండా ఎగురవేయడానికి సవరించిన వివరాలను పేర్కొంటూ.. కేంద్ర మంత్రిత్వ శాఖ రాష్ట్రాలకు సమాచారం అందించింది.
దేశ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల స్ఫూర్తిని పొందడానికి పౌరులు తమ ఇళ్ల వద్ద జెండాలను ఎగురవేయాలని, సోషల్ మీడియా డీపీలను మార్చుకోవాలని గత నెలలో ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు త్రివర్ణ పతకాలు శోభను సంతరించుకున్నాయి. సినీ నటులు, కేంద్ర మంత్రుల నుంచి సామాన్యుల వరకూ తమ ఇంటిపై జాతీయ జెండాను ఎగరవేసి ఆ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.
స్వాతంత్య్ర వజ్రోత్సవాలు
హైదరాబాద్ లో స్వాతంత్య్ర వజ్రోత్సవాలు స్కూళ్లలో ఐక్యతా రాగాన్ని పలికిస్తున్నాయి. తమ ప్రతిభకు పదును పెడుతున్న విద్యార్థులు.. జోరుగా వినూత్నంగా జెండాలను తయారు చేస్తున్నారు. నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న స్కూల్ విద్యార్థులు తమ క్రియేటివిటిని చాటి చెబుతూ భారీ జాతీయ పతాలకాలతో ర్యాలీలు నిర్వహిస్తునారు. మరికొందరు జాతీయ జెండాలు చేతబూని శాంతి ర్యాలీలు నిర్వహిస్తున్నారు. దేశానికి స్వాతంత్రం తెచ్చిన మహనీయుల త్యాగాలను స్మరించుకోవాలన్న స్ఫూర్తిని నింపుతున్నారు.
హైదరాబాద్ తార్నాకలోని స్కూల్ విద్యార్థులు వినూత్నంగా 100 మీటర్ల భారీ జాతీయ జెండాతో ర్యాలీగా నిర్వహించారు. సంగారెడ్డిలో 75 అడుగుల భారీ జాతీయ జెండాతో ర్యాలీ చేపట్టారు మంత్రి హరీష్ రావు. 800 మీటర్ల జాతీయ జెండాతో నగరవీధుల్లో విద్యార్దులు సంగీత్ నుండి రైల్ నిలయం వరకూ ర్యాలీ నిర్వహించారు. కొందరు జెండా విశిష్టతను వివరిస్తూ జనంలో చైతన్యం తీసుకొస్తున్నారు. ఇక వివిధ జిల్లాల్లో పోలీసుల సహాకరంతోనూ విద్యార్థులు పెద్ద ఎత్తున వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కాలనీల్లో ర్యాలీలు, వివిధ రకాలైన పోటీలు నిర్వహిస్తూ తమ ప్రతిభను చాటుకుంటున్నారు. మరో 25 ఏళ్లకు శతాబ్ది ఉత్సవాలు జరుపుకునే నాటకి.. ఈ జ్ఞాపకాలు ఉండే విధంగా విద్యార్థులు వినూత్నంగా వజ్రోత్సవాలు ఢిల్లీ నుంచి గల్లీ వరకూ నిర్వహిస్తున్నారు.