తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు రోజులు గడుస్తున్న కొద్దీ కీలక నేతల మధ్య వాడీవేడి వ్యాఖ్యలు ఎక్కువ అవుతున్నాయి. తాజాగా బీజేపీ చేరికల కమిటీ చైర్మన్, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. కీలక వ్యాఖ్యలు చేశారు. తన నియోజకవర్గం హుజూరాబాద్ తో పాటుగా ముఖ్యమంత్రి పైన కూడా తాను పోటీకి దిగుతానని చెప్పారు. గురువారం (అక్టోబరు 12) హుజూరాబాద్‌లో బీజేపీ ముఖ్యకార్యకర్తల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
తాను తన నియోజకవర్గం హుజూరాబాద్ తో పాటు సీఎం కేసీఆర్ పై గజ్వేల్‌లో రెండు చోట్లా పోటీ చేస్తానని ప్రకటించారు. ఈ సందర్భంగా హుజురాబాద్ లో మీరే హీరోలు అవ్వాలంటూ కార్యకర్తలకు ఆయన పిలుపు ఇచ్చారు. ఇప్పుడు ఈటల కేసీఆర్‌పై పోటీ చేస్తానని ప్రకటన చేసినప్పటికీ.. అందుకు పార్టీ గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా? అనే అంశం కూడా కీలకం. అయితే, కేసీఆర్ పై తాను పోటీకి రెడీ అని ఈటల రాజేందర్ ఎప్పటి నుంచో చెబుతూ వస్తున్నారు.
అయితే, ఈటల రాజేందర్ సతీమణి జమున కేసీఆర్ కు ప్రత్యర్థిగా పోటీకి దిగుతారని ప్రచారం జరిగింది. అది నిజం కాదని, తర్వాత పార్టీ శ్రేణులు వెల్లడించాయి.
నవంబరు 30న ఎన్నికలు
తెలంగాణలో ఎన్నికలకు షెడ్యూల్ విడులైన సంగతి తెలిసిందే. నోటిఫికేషన్ నవంబరు 3న విడుదల కానుంది. ఎన్నికల నామినేషన్ల స్వీకరణ కూడా అదే రోజు ప్రారంభం కానుంది. ఎన్నికల నామినేషన్లకు తుది గడువు నవంబరు 10. నామినేషన్లు స్క్రూటినీ తేదీ నవంబరు 13 నుంచి ఉండనుంది. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ నవంబరు 15గా ఉంది. ఇక తెలంగాణ ఎన్నికలు నవంబరు 30న జరగనుండగా, డిసెంబరు 3న కౌంటింగ్ జరగనుంది. అదే రోజు ఫలితాలు వెల్లడి కానున్నాయి.