Ibomma Case: సినిమా నిర్మాతలకు బొమ్మ , హిట్టో, ప్లాపో తెలియాలంటే బాక్సాఫీస్ రిజల్ట్ వరకూ ఆగాలేమో కానీ ఐబొమ్మ కేసులో నిందితుడు రవి మాత్రం క్షణాల్లో సినిమా లెక్కలు తేల్చేవాడట. సినిమా రిలీజ్ అయిన క్షణాల్లోనే హీరో క్రేజ్, వీడియో క్వాలిటీ ఆధారంగా పైరసీ సినిమాకు రేటు ఫిక్స్ చేసే వాడని సమాచారం. ఇదంతా క్షణాల్లో చకచకా జరిగిపోయేదట. కేసు విచారణలో భాగం ఐబొమ్మ రవి వద్ద కీలక విషయాలు రాబట్టిన పోలీసులు, టెక్నికల్ ఆధారాలతో కోర్టు ముందుంచినట్లుగా తెలుస్తోంది. కొత్తగా విడుదలైన సినిమాలను కొనేందుకు టెలిగ్రామ్ యాప్‌ను ఉపయోగించేవాడని విచారణలో వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. ఒక్కో సినిమాకు వందల డాలర్లు చెల్లించేవాడట. పెద్ద హీరోల సినిమాలైతే 500 డాలర్ల వరకూ చెల్లించి కొనుగోలు చేశాడట. చిన్న సినిమాలకు 100 నుంచి 200 డాలర్లు చెల్లించేవాడని తెలుస్తోంది. ప్రింట్ క్వాలిటీ ఆధారంగా ధరలు డిసైడ్ చేసేవాడని తెలుస్తోంది.
జల్సాలకు ఖర్చులు
ఐబొమ్మ రవి నేర చరిత్ర ఐబొమ్మతో మాత్రమే మొదలు కాలేదని తాజాగా వెలుగు చూసింది. చిన్నపట్టి నుంచి పైరసీ బుద్ధి అలవాటు చేసుకున్నాడు, తన స్నేహితుల సర్టిఫికేట్స్‌ను దొంగిలించేవాడట. ఇదే చేతి వాటానికి అలవాటు పడ్డ రవి, తన ప్రాణ స్నేహితులైన ప్రహ్లాద్, అంజయ్య సర్టిఫికేట్లను సైతం వారికి తెలియకుండా చోరీ చేయడంతో పాటు, వాటి సహాయంతో పాన్ కార్డు పొందడ, బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేసాడు. మొత్తంగా 7 బ్యాంక్ అకౌంట్ల ద్వారా పైరసీ సినిమా లావాదేవీలు నడిపించిన రవి, 13కోట్ల రూపాయలు సంపాదించి, వచ్చిన డబ్బులో 10కోట్లు రూపాయలను పూర్తిగా తన వ్యక్తిగత జల్సాలకు ఖర్చు చేశాడట. అకౌంట్‌లో మిగిలిన 3కోట్ల రూపాయలను ఫ్రీజ్ చేసిన పోలీసులు, మిగతా స్థిరాస్తి వివరాలను రాబట్టే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం.
లావాదేవీల్లో చాలా జాగ్రత్త
పైరసీ సినిమాల కొనుగోలుకు డబ్బు చెల్లించేందుకు సైతం ఎవరికి, ఏమాత్రం అనుమానం రాకుండా చాకచక్యంగా వ్యవహరించాడు. ఆరు పేమెంట్ గేట్‌వేల ద్వారా పైరసీ సినిమాల కొనుగోలుకు నగదు లావాదేవీలు నడిపినట్లు తెలుస్తోంది. ఎక్కువ మొత్తంలో నగదు బదిలీలు, ఏడు అకౌంట్ పిన్ నెంబర్లు ఇలా గందరగోళంలో ఏకంగా ఆయా అకౌంట్ల పాస్ వర్డ్స్ సైతం మర్చిపోయాడట. రంగారెడ్డి జిల్లాలో ఓ అడ్రస్‌తో సుపీరియర్ ఇండియా, హాస్టిల్ ఇన్, ఈఆర్ ఇన్ఫోటెక్ అనే మూడు కంపెనీలను ఏర్పాటు చేశాడు.
ట్యాక్స్ ఎగ్గొట్టేందుకు వేషాలు
కూకట్‌పల్లిలోని ఉషాముళ్లపూడికి సమీపంలో ఐబొమ్మ వెబ్ సైట్ ఆఫీస్ నిర్వహించడంతోపాటు, పది మంది సిబ్బందిని కూడా నియమించుకున్నట్లు విచారణలో బయటపెట్టాడు. ఆన్ లైన్ బెట్టింగ్ ప్రమోషన్ల ద్వారా ఒకే రోజు కోటి డబ్భై ఎనిమిది లక్షల రూపాయలు అకౌంట్‌లో పడ్డాయి. ఇంత మొత్తంలో అకౌంట్‌లో డబ్బు ఉంటే ట్యాక్స్ కట్టాలనే ఉద్దేశ్యంతో వాటిలో 90 లక్షల రూపాయలు తన సోదరి పంపాడు. ఇలా టాక్స్ ఎగ్గొట్టేందుకు ఐబొమ్మ నిందితుడు రవి వేసిన వేషాలు అన్నీ ఇన్నీ కావు. వ్యక్తులను , వ్యవస్థలను ఎలా వాడుకోవాలో తెలిసిన రవి, డబ్బు సంపాదన లక్ష్యంగా అవసరమైన అన్ని అడ్డదారులు తొక్కడమే కాదు, ఆధారాలు ఉన్నాయంటూ ఎదురు ప్రశ్నించడం అలవాటుగా మార్చుకున్నాడు.