Bandi Sanjay: ముందస్తు ఎన్నికలపై శనివారం మంత్రి కేటీఆర్ చేసిన సవాల్ కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. ముందస్తు ఎన్నికలకు తాము కూడా రెడీ ఉన్నామని సవాల్ ను స్వీకరించారు. అయితే ముందస్తుకు వెళ్తున్నామనే మాట కేటీఆర్ కాకుండా తన తండ్రి కేసీఆర్ తో చెప్పించాలని బండి సంజయ్ షరతు పెట్టారు. కరీంనగర్ లో పార్టీ కార్యాలయంలో మాట్లాడిన ఎంపీ బండి సంజయ్.. సీఎం కేసీఆర్ పై, రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
మేం కూడా సిద్ధమే..
ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు రైతు బంధు ఇచ్చి సబ్సిడీలు లేకుండా చేశారని బండి సంజయ్ ఆరోపణలు చేశారు. కమీషన్ల పేరుతో రైతులను నిండా ముంచేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో రైతుల బలవన్మరణాలు పెరిగిపోయాయని, ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం అన్నదాతల ఆత్మహత్యల్లో దేశంలో నాలుగో స్థానానికి చేరుకుందని తెలిపారు. కరీంనగర్ లో పార్టీ ఆఫీస్ లో మీడియాతో బండి సంజయ్ మాట్లాడారు. తెలంగాణలో రైతులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని, ఇక్కడి అన్నదాతల సమస్యలను పరిష్కరించకుండా ఇతర రాష్ట్రాల్లోని రైతులకు సీఎం కేసీఆర్ చెక్కులు పంపిణీ చేశారని బండి సంజయ్ విమర్శించారు. కృష్ణా జలాల్లో రాష్ట్రానికి ఎంత వాటా తెచ్చారో స్పష్టం చేయాలని ఈ మేరకు బండి సంజయ్ విమర్శలు గుప్పించారు.
అదే మాట మీ తండ్రితో చెప్పించాలి
ఈ సందర్భంగా కేటీఆర్ శనివారం చేసిన ముందస్తు ఎన్నికల సవాల్ ను బండి సంజయ్ స్వీకరించారు. ముందుస్తు ఎన్నికలకు తాము కూడా సిద్ధమేనని ప్రకటించారు. అయితే ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నామనే మాట కేటీఆర్ కాకుండా తన తండ్రి కేసీఆర్ తో చెప్పించాలని బండి సంజయ్ కండిషన్ పెట్టారు. బీజేపీలో కోవర్టులు ఉన్నట్లు ఈటల అనలేదని, మీడియానే అలా వక్రీకరించిందని బండి సంజయ్ పేర్కొన్నారు.
శనివారం 'ముందుస్తు' సవాల్ విసిరిన కేటీఆర్
కేంద్ర ప్రభుత్వం లోక్ సభను రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు సిద్ధపడితే తెలంగాణలోనూ శాసనసభను రద్దు చేసి ఎన్నికలకు వెళ్తామని కేటీఆర్ శనివారం పేర్కొన్నారు. బీఆర్ఎస్ శ్రేణులు అందుకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. శనివారం నిజామాబాద్ పర్యటనకు వచ్చిన మంత్రి కేటీఆర్ పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు కేటీఆర్. మోదీ ప్రభుత్వం సబ్ కా సాథ్ - సబ్ కా వికాస్ అని మాటలు చెబుతూ చేతల్లో మాత్రం సబ్ కా బక్వాస్ చేస్తోందని విమర్శించారు. నష్టాలు వస్తున్న ప్రభుత్వం రంగ సంస్థలను జాతీయం చేస్తూ లాభాలు వస్తున్న సంస్థలను ప్రేవైటు పరం చేస్తున్నారని ఈ మేరకు కేటీఆర్ మోదీ పాలనపై విమర్శలు గుప్పించారు. నిజామాబాద్ కు పసుపు బోర్డు ఇస్తామని చెప్పి చివరకు జౌళి బోర్డును సైతం ఎత్తేశారని బీజేపీ ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు. ఫిబ్రవరి 1న ప్రవేశ పెట్టనున్న బడ్జెట్ లో కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు పరిశ్రమ, ఐటీఐఆర్, పారిశ్రామిక రాయితీలు ఇచ్చేందుకు మోదీ సర్కారుకు చివరి అవకాశమని కేటీఆర్ పేర్కొన్నారు.