SI Constable Marks : ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ అభ్యర్థులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. హైకోర్టు ఆదేశాలతో ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలపై పోలీసు రిక్రూట్‌మెంట్‌బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఎస్, కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షల్లో 7 ప్రశ్నల విషయంలో అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. ప్రిలిమినరీ పరీక్షలో అందరికీ మార్కులు కలపాలని పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నిర్ణయం తీసుకుంది. హైకోర్టు ఆదేశాలతో మార్కులు కలిపిన వాళ్లలో ఉత్తీర్ణులైన వారికి ఫిజికల్ ఈవెంట్స్ నిర్వహించనున్నారు.

  


ఫిబ్రవరి 15 నుంచి ఫిజికల్  ఈవెంట్స్ 


పాత లాగిన్ నెంబర్లతో ఈనెల 30 నుంచి వెబ్‌సైట్‌లో దేహదారుఢ్య పరీక్షల అప్లికేషన్‌ సబ్‌మిట్‌ చేయాలని పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు తెలిపింది. ఇప్పటికే ప్రిలిమినరీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఫిజికల్ టెస్టు పూర్తి చేసిన వారు మళ్లీ అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఫిజికల్ ఈవెంట్స్ లో క్వాలిఫై కానీ వారి గురించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని బోర్డు చెప్పింది.  హైకోర్టు ఆదేశాల ప్రకారం మార్కుల కలిపిన అనంతరం ప్రిలిమినరీలో ఉత్తీర్ణులైన వారు ఫిబ్రవరి 1న ఉదయం 8 గంటల నుంచి 5వ తేదీ రాత్రి 10 గంటల వరకు పార్ట్‌-2 అప్లికేషన్‌ సబ్మిట్ చేసేందుకు అవకాశం కల్పించనున్నట్లు బోర్డు తెలిపింది. ఫిబ్రవరి 8న ఉదయం 8 గంటల నుంచి 12వ తేదీ రాత్రి 10 గంటల వరకూ ఫిజికల్ ఈవెంట్స్ పరీక్షల హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని బోర్డు వెల్లడించింది. ఫిబ్రవరి 15 నుంచి ఈవెంట్స్ నిర్వహించనున్నట్టు నియామక బోర్డు స్పష్టం చేసింది. 


మరో 2391 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ 


తెలంగాణలోని నిరుద్యోగులకు ప్రభుత్వం మరో తీపికబురు వినిపించింది. మ‌రో 2,391 పోస్టుల భ‌ర్తీకి రాష్ట్ర ఆర్థికశాఖ అనుమ‌తి ఇచ్చింది. ఈ మేర‌కు రాష్ట్ర ఆర్థిక మంత్రి హ‌రీశ్‌రావు ట్వీట్ చేశారు. ఈ  పోస్టుల‌ను టీఎస్‌పీఎస్సీ, మెడిక‌ల్ హెల్త్ బోర్డు, మ‌హాత్మా జ్యోతిబాపూలే గురుకుల‌ విద్యాసంస్థ భ‌ర్తీ చేయ‌నుంది. బీసీ గురుకులాల్లో మొత్తం 1,499 పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. ప్రిన్సిపాల్ పోస్టులు 10, డిగ్రీ లెక్చ‌ర‌ర్స్ 480, జూనియ‌ర్ లెక్చ‌ర‌ర్స్ 185, పీజీటీ 235, టీజీటీ 324 పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. స‌మాచార పౌర సంబంధాల శాఖ‌లో 166 పోస్టుల భ‌ర్తీకి అనుమ‌తి ఇచ్చింది ఆర్థిక శాఖ‌.


 హైకోర్టు ఉద్యోగాల దరఖాస్తు ప్రారంభం, చివరితేది ఎప్పుడంటే?


తెలంగాణ హైకోర్టులో ఉద్యోగాల భర్తీకి జనవరి 11న నోటిఫికేషన్లు వెలువడిన సంగతి తెలిసిందే. మొత్తం 176 ఖాళీల భర్తీకి 9 నోటిఫికేషన్లను హైకోర్టు విడుదల చేసింది. అయితే ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ జనవరి 21న ప్రారంభమైంది. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు ఫిబ్రవరి 11 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపట్టనున్నారు. పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లు ఫిబ్రవరి 20 నుంచి అందుబాటులో ఉండనున్నాయి. పరీక్ష తేదీపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు.


లైబ్రేరియన్ పోస్టుల దరఖాస్తు ప్రారంభం 


తెలంగాణలోని ఇంటర్, సాంకేతిక విద్యలో లైబ్రేరియన్ పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్సీ డిసెంబరు 31 నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనిద్వారా 71 లైబ్రేరియన్ పోస్టులకు భర్తీచేయనున్నారు. వీటిలో ఇంటర్మీడియట్ ఎడ్యకేషన్ పరిధిలో 40 పోస్టులు, టెక్నికల్ ఎడ్యకేషన్ పరిధిలో 31 పోస్టులు ఉన్నాయి. ఏదైనా డిగ్రీతోపాటు సంబంధిత విభాగంలో పీజీ డిగ్రీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ పోస్టుల భర్తీకి జనవరి 21న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఫిబ్రవరి 10 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. రాతపరీక్ష ద్వారా ఖాళీల భర్తీ ఎంపిక చేపడతారు.