ఇటీవల తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిని మార్చుతారంటూ విపరీతంగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ ప్రచారంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి తరుణ్ చుగ్ స్పందించారు. ఎన్నికలు ఉన్నందున బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని మార్చే ఉద్దేశం ఏమి లేదని స్పష్టం చేశారు. తాజాగా దీనిపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌పైనే బండి సంజయ్ విమర్శలు చేశారు. రాష్ట్ర అధ్యక్షుడి మార్పుపై ప్రచారం బీఆర్ఎస్ నేతలకు అలవాటు అయిపోయిందని, అధ్యక్షుడి మార్పు ఉంటుందో.. లేదో.. తాను జేపీ నడ్డాను అడిగి చెబుతానని సరదాగా మాట్లాడారు. లీకులకు కారణం ముఖ్యమంత్రి కేసీఆరే అని బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ లో బుధవారం (జూన్ 28) సాయంత్రం బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు.
సొంత పార్టీలో ఏం జరుగుతుందో చూసుకోకుండా పక్క పార్టీలో కుట్రలు చేస్తుండడం సీఎం కేసీఆర్ కు అలవాటే అని విమర్శించారు. ఈటల రాజేందర్ ను హత్య చేస్తానన్న వారిని ముందుగా అరెస్ట్ చేయాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు. ఈటల రాజేందర్ భద్రతపైన కేసీఆర్ ఎందుకు స్పందించడం లేదని అన్నారు. హత్య చేస్తానన్న వ్యక్తి బహిరంగంగా ప్రెస్ మీట్ లు పెడుతున్నారని అన్నారు. బీజేపీ నేతలకు సక్రమంగా భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని బండి సంజయ్ అన్నారు.
బుధవారం (జూన్ 28) సాయంత్రం బండి సంజయ్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కి వెళ్లారు. 'మేరా బూత్ సబ్సే మజ్బూత్' కార్యక్రమంలో భాగంగా దేశవ్యాప్తంగా బీజేపీని బలోపేతం చేసే లక్ష్యంగా, విస్తారక్ లను నియమించిన నేపథ్యంలో, ఇతర రాష్ట్రాల నుండి సుమారు 650 మంది విస్తారక్ లు నేడు తెలంగాణకు రైలులో వచ్చారు. ఈ సందర్భంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో వారికి బండి సంజయ్ స్వాగతం పలికారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్ఫూర్తితో వీరంతా తెలంగాణలో పర్యటించి, పోలింగ్ బూత్ ల వారీగా పార్టీని బలోపేతం చేసే పనిలో నిమగ్నమవుతారని బండి సంజయ్ ట్వీట్ చేశారు.