Bandi Sanjay: ఏ లక్ష్యం కోసం తెలంగాణ సాధించుకున్నమో ఆ లక్ష్యం నెరవేరలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. హైదరాబాద్ లోని కాచిగూడలో భారతీయ మజ్దూర్ సంఘ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ఆర్టీసీ కార్మికుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. ఈ సమావేశంలోనే బండి సంజయ్ మాట్లాడుతూ... తెలంగాణ వచ్చిన తర్వాత మొత్తం 40 మంది ఆర్టీసీ కార్మికులు బలయ్యారని గుర్తు చేశారు. నాడు చర్చలు జరిపే దాకా బాబు అనే ఆర్టీసీ కార్మికుడి అంత్యక్రియలు నిర్వహించమని.. తాము కరీంనగర్ లో భీష్మించుకు కూర్చుండబట్టే కేసీఆర్ చర్చలు జరిపేందుకు ముందుకు వచ్చారన్నారు. అలాగే సీఎం కేసీఆర్ తమపై లాఠీచార్జ్ చేయించి, జైలుకు పంపించాడని, ఆఖరికి శవాలను కూడా ఎత్తుకుపోయిండంటూ ఆరోపించారు. అంతిమ యాత్ర నిర్వహిస్తుంటే పోలీసులు, బీఆర్ఎస్ కార్యకర్తలు వచ్చి శవాన్ని ఎత్తుకెళ్లినట్లు గుర్తు చేశారు.
తెలంగాణ ఉద్యమ సమయంలో కార్మికులు చాలా తెగువ చూపించారన్నారు. అలాగే అదే తెగువతో ఇప్పుడు కేసీఆర్ పాలనకు చరమగీతం పాడాలని సూచించారు. సింగరేణి, విద్యుత్, ఆర్టీసీ ఉద్యోగులంతా ఏకం కావాలని తెలిపారు. మరో ఐదు నెలల్లో రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేసిన ఆయన.. తొలగించిన ఉద్యోగులందరినీ విధుల్లోకి తీసుకుంటామని చెప్పారు. అలాగే బడ్జెట్ లో ఆర్టీసీకీ ప్రత్యేక బడ్దెట్ కేటాయిస్తామని చెప్పుకొచ్చారు. భయపడితే సీఎం కేసీఆర్ మరింత భయపెడతారని వివరించారు. అంతేకాకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందన్నారు.