తెలంగాణ కొత్త సచివాలయాన్ని తన చేతుల మీదుగా ప్రారంభించడాన్ని తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నట్లుగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు తెలిపారు. సచివాలయం ఎంత సస్యశ్యామలంగా ఉందో రాష్ట్రంలోని పల్లెలు కూడా అలాగే అలరారుతూ ఉన్నాయని అన్నారు. ఈ 9 ఏళ్ల కాలంలో తనతో పాటు ఉండి పాలనలో పాలుపంచుకున్న ప్రతి ఒక్క ప్రభుత్వ అధికారికి సీఎం కేసీఆర్ చేతులెత్తి నమస్కరించారు. నేడు (ఏప్రిల్ 30) కేసీఆర్ తెలంగాణ కొత్త సచివాలయాన్ని ప్రారంభించారు. తన ఛాంబర్‌లోని సీట్‌లో ఆసీనులై కీలకమైన ఆరు ఫైల్స్ పై సంతకం చేశారు. ఆ తర్వాత ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం కేసీఆర్ ప్రసంగించారు.


అంబేడ్కర్ చూపిన బాటలోనే ఆర్టికల్ 3 ప్రకారం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది కాబట్టి, ఆయన కీర్తిని దేశమంతా చాటాలనే ఉద్దేశంతో నిలువెత్తు ఉద్దేశం ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు. అంబేడ్కర్ సమానత్వ భావాలు, ఆయన అడుగుజాడల్లోనే నడవాలనే ఉద్దేశంతో రాష్ట్ర సచివాలయానికి ఆయన పేరే పెట్టుకున్నట్లుగా తెలిపారు. తెలంగాణ పోరాటంలో అమరులైన వారిని కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. 


తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణం అంటే ఉన్నయన్ని కూలగొట్టి కొంత మంది కురచ వ్యక్తులు, మరుగుజ్జులు కారు కూతలు కూశారు. పునర్నిర్మాణం అంటే తెలియని మరుగుజ్జులకు నేను ఈ సందర్భంగా కొన్ని మాటలు చెప్పాలనుకుంటున్నాను.